Share News

విదేశీ ఉద్యోగాల పేరుతో మోసం.. ఏజెంట్‌పై పీడీ యాక్ట్ నమోదు

ABN , Publish Date - Nov 05 , 2026 | 05:45 PM

కంబోడియా, మయన్మార్ దేశాలకు నిరుద్యోగ యువతను తరలించి సైబర్ నేరాలకు పాల్పడుతున్న ప్రధాన ఏజెంట్ చుక్క రాజేశ్ వినయ్ కుమార్‌పై విశాఖపట్నం పోలీసులు పీడీ (PD) యాక్ట్ నమోదు చేశారు.

 విదేశీ ఉద్యోగాల పేరుతో మోసం.. ఏజెంట్‌పై పీడీ యాక్ట్ నమోదు
Visakhapatnam Job Scam

విశాఖపట్నం, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): కంబోడియా, మయన్మార్ దేశాలకు నిరుద్యోగ యువతను తరలించి సైబర్ నేరాలకు పాల్పడుతున్న ప్రధాన ఏజెంట్ చుక్క రాజేశ్ వినయ్ కుమార్‌పై విశాఖపట్నం పోలీసులు పీడీ (PD) యాక్ట్ నమోదు చేశారు. తక్కువ చదువుకున్నా పర్లేదంటూ, ఏసీ రూముల్లో లక్షల్లో జీతమంటూ ఆశచూపించి అమాయకులను ఏజెంట్ మోసం చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. గాజువాక కేంద్రంగా ఇన్‌స్టిట్యూట్ నడుపుతున్న రాజేశ్ పలువురు నిరుద్యోగులను విదేశాలకు పంపి మోసం చేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు.


కంబోడియా, బ్యాంకాక్ వెళ్లిన యువకులతో ఇండియాకు వ్యతిరేకంగా సైబర్ స్కామ్స్ చేయిస్తూ అక్కడ తీవ్ర వేధింపులకు గురిచేశారని బాధితులు పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు. నిరుద్యోగుల నుంచి నగదు, ఫోన్‌పే ద్వారా డబ్బులు వసూలు చేసి ఫ్లైట్ టికెట్లు, ఈ-వీసాలను ఏజెంట్ రాజేశ్ ఏర్పాటు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడ ఉండే విదేశీ ఏజెంట్లకు ఇక్కడి నిరుద్యోగులను అమ్ముకుంటున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు.


విదేశాల్లో భారీ వేతనాల వస్తాయని.. డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరుతో మభ్యపెట్టే నకిలీ ఏజెంట్లను నమ్మి మోసపోవద్దని పోలీసులు సూచించారు. ఆగ్నేయ దేశాలకు వెళ్లి సైబర్ నేరాలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద కార్యకలాపాలపై తమకు ఫిర్యాదు చేయాలని విశాఖపట్నం పోలీసులు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నాంది ఫౌండేషన్ 28 ఏళ్ల ప్రస్థానం.. ఆనంద్ మహీంద్రాకు చంద్రబాబు థ్యాంక్స్

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు పటిష్ఠ ప్రణాళిక: ఏపీ ఎస్‌ఈసీ

ఏలూరు జిల్లాలో వరదలు.. అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 05 , 2026 | 05:58 PM