Share News

హోటళ్లపై బండ

ABN , Publish Date - May 02 , 2026 | 01:06 AM

కేంద్ర ప్రభుత్వం అంతా ఊహించినట్టుగానే వ్యవహరిస్తోంది. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన వెంటనే ఇంధన రేట్లు పెంచుతుందని ముందు నుంచే ఊహాగానాలు వస్తున్నాయి.

హోటళ్లపై బండ

  • వాణిజ్య సిలిండర్‌ ధర మరో రూ.993 పెంపు

  • రెండు నెలల్లో రూ.1,300 భారం

  • రేట్ల పెంపు తప్పదంటున్న నిర్వాహకులు

విశాఖపట్నం, మే 1 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం అంతా ఊహించినట్టుగానే వ్యవహరిస్తోంది. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన వెంటనే ఇంధన రేట్లు పెంచుతుందని ముందు నుంచే ఊహాగానాలు వస్తున్నాయి. వాటిని నిజం చేస్తూ ప్రస్తుతం వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్‌ ధరను భారీగా పెంచింది. ఒకేసారి రూ.993 పెంచుతున్నట్టు ప్రకటించి, ఆ రేటు శుక్రవారం నుంచే అమల్లోకి వచ్చిందని పేర్కొంది.


గృహ వినియోగానికి (డొమెస్టిక్‌) 14.2 కిలోలు, వాణిజ్యానికి 19 కిలోల బరువు కలిగిన ఎల్‌పీజీ సిలిండర్లను సరఫరా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి డొమెస్టిక్‌ సిలిండర్ల ధర పెంచలేదు. పశ్చిమ ఆసియా దేశాల యుద్ధం మొదలైనప్పుడు వాణిజ్య సిలిండర్‌ ధర రూ.1,937 ఉండేది. ఏప్రిల్‌ ఒకటో తేదీన రూ.218 పెంచారు. ఇప్పుడు మరో రూ.993. దీంతో ప్రస్తుతం ఒక సిలిండర్‌ తీసుకుంటే రూ.3,200 వరకు చెల్లించాల్సి వస్తోంది. ఈ రెండు నెలల్లో సిలిండర్‌పై రూ.1,300 ధర పెరిగింది.


ప్రతి రెస్టారెంట్‌లో రోజుకు సగటున రెండు సిలిండర్లు వినియోగిస్తారు. అదనపు భారం రోజుకు రూ.2,600 పడుతోంది. ఇది నెలకు రూ.80 వేల వరకు ఉంటుంది. హోటల్‌ స్థాయి, సిలిండర్ల వినియోగం బట్టి ఈ భారం మారుతుంది. యుద్ధం ఆగిపోతే గ్యాస్‌ ధరలు తగ్గుతాయని హోటళ్ల యజమానులు ఇప్పటివరకూ రేట్లు పెంచలేదు. వీధుల్లో వ్యాపారులే పెంచారు. ఇప్పుడు కేంద్రం గ్యాస్‌ ధరలతో పాటు ఇతర ఇంధన ధరలు కూడా పెంచే అవకాశం ఉండడంతో ఇక టిఫిన్లు, భోజనాలు, ఇతర వంటకాల ధరలు పెంచక తప్పదని హోటళ్ల యజమాన్యాలు చెబుతున్నాయి.


రేట్లు 10 శాతం పెంపునకు ప్రతిపాదన: ఎంవీ పవన్‌ కార్తీక్‌, హోటల్‌ అండ్‌ రెస్టారెంట్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఏపీ

గ్యాస్‌ ధరలతో పాటు వంట నూనెలు, ఇతర నిత్యవసరాల ధరలు బాగా పెరిగాయి. ఇప్పటివరకు ఆ భారం వినియోగదారులపై మోపలేదు. ఇప్పుడు తప్పడం లేదు. మెనూ ధరలపై పది శాతం పెంచాలని భావిస్తున్నాం. ప్రభుత్వం గ్యాస్‌ విషయంలో ఏమైనా రాయితీలు ఇస్తే పరిశీలిస్తాం. లేదంటే పెంపు తప్పదు.

Updated Date - May 02 , 2026 | 06:52 AM