Share News

యువతి మృతి కేసులో నిందితుడి ఆత్మహత్యాయత్నం

ABN , Publish Date - Sep 24 , 2026 | 01:27 AM

యువతి మృతి కేసులో నిందితుడి ఆత్మహత్యాయత్నం

యువతి మృతి కేసులో  నిందితుడి ఆత్మహత్యాయత్నం

లంకెలపాలెం , సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి):

హైదరాబాద్‌లోని ‘ఓయో’ రూమ్‌లో యువతి అనుమానాస్పద మృతి కేసులో నిందితుడిగా భావిస్తున్న టి.శ్రీనివాస రవితేజ బుధవారం స్వగ్రామంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం ఇ-మర్రిపాలెం గ్రామానికి చెందిన శ్రీనివాస రవితేజ ఈనెల 21న హైదారాబాద్‌ వెళ్లాడు. మాదాపూర్‌లోని సిద్ధిఖీ నగర్‌ రోడ్డులో గల ఓయో రూమ్‌లో దిగాడు. అక్కడకు అతడికి పరిచయం ఉన్న షరోన్‌ నిఖిత తోప్నో (29) వచ్చింది. సోమవారం అర్ధరాత్రి హోటల్‌లో ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ ఆమె తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఆమెను శ్రీనివాస్‌ రవితేజ హోటల్‌ సిబ్బంది సాయంతో ద్విచక్ర వాహనంపై స్థానికంగా గల ఆస్పత్రికి తరలించాడు. అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు ధ్రువీకరించారు. దీంతో అక్కడ నుంచి పరారై స్వగ్రామానికి వచ్చాడు. బుధవారం ఉదయం విషయం బయటకు రావడంతో ఇంట్లో ఉన్న ఫ్లోర్‌ క్లీనింగ్‌ లిక్విడ్‌ తాగి రవితేజ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు అతడిని తొలుత అగనంపూడి ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కేజీహెచ్‌కు తరలించినట్టు సీఐ లంక భాస్కరరావు తెలిపారు. ఈ విషయమై తెలంగాణ పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు సీఐ వెల్లడించారు.

Updated Date - Sep 24 , 2026 | 01:27 AM