Share News

వైసీపీవి అసత్య ప్రచారాలు.. విశాఖకు కూటమి ఏం చేసిందో చెబుతాం: ఎంపీ శ్రీభరత్

ABN , Publish Date - Oct 29 , 2026 | 11:13 AM

జీవీఎంసీ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా జరుగుతోందని, మొత్తం120 వార్డుల నుంచి కూటమి అభ్యర్థులు పోటీ చేస్తున్నట్లు ఎంపీ శ్రీభరత్ తెలిపారు. జీవీఎంసీ మేయర్ అభ్యర్థిగా ముక్క శ్రావణి పోటీ చేస్తున్నారన్నారు.

వైసీపీవి అసత్య ప్రచారాలు.. విశాఖకు కూటమి ఏం చేసిందో చెబుతాం: ఎంపీ శ్రీభరత్
MP Sri Bharat

విశాఖపట్నం, అక్టోబర్ 29: జీవీఎంసీ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా జరుగుతోందని, మొత్తం120 వార్డుల నుంచి కూటమి అభ్యర్థులు పోటీ చేస్తున్నట్లు ఎంపీ శ్రీభరత్ తెలిపారు. జీవీఎంసీ మేయర్ అభ్యర్థిగా ముక్క శ్రావణి పోటీ చేస్తున్నారన్నారు. వైసీపీ నాయకులు తమపై బురద జల్లుతున్నారని ఎంపీ మండిపడ్డారు. విశాఖకు కూటమి ఏమీ చేయలేదని అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్‌ను అభివృద్ధి పథంలో నడపడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్యాకేజీని తెచ్చామన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో స్టీల్ ప్లాంట్‌కు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.


విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేశామని ఎంపీ తెలిపారు. విశాఖ వేదికగా మూడు వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ నిర్మాణం జరుగుతున్నాయని.. అనేక ఐటీ కంపనీలు విశాఖకు వస్తున్నాయన్నారు. స్టార్ హోటల్స్ విశాఖలో ఏర్పాటు అవుతున్నట్లు చెప్పారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో మురికివాడలను తొలగించి గ్రూప్ హౌస్ నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. వైసీపీ విశాఖకు చేసిందేమీ లేదని.. గతంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వలేదని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత లబ్ధిదారులకు ఇళ్లు అందజేశామన్నారు. సెల్ వైజాగ్ అని వైసీపీ అనడం హాస్యాస్పదమన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అనేక ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టారని ఆరోపించారు. మద్యం లేకుండా చేస్తామని చెప్పి నాసిరకం మద్యం సరఫరా చేసి ప్రజల ప్రాణాలు తీశారని మండిపడ్డారు.


వైసీపీ ప్రభుత్వ హయాంలో 11 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని శ్రీభరత్ వ్యాఖ్యానించారు. ఋషికొండను బొడిగుండు చేసిన వైసీపీ పర్యావరణంపై మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. విశాఖలో త్రాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విశాఖ దేవస్థానం భూములను అభివృద్ధి కార్యక్రమాలకు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో తుఫాన్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని అన్నారు. తుఫాన్ వలన ఏపీలో ఐదుగురు మృతిచెందడం బాధాకరమని.. వీరిలో ఇద్దరు విశాఖకు చెందిన వారు ఉన్నారని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షలు నష్టపరిహారం ప్రకటించినట్లు ఎంపీ శ్రీభరత్ వెల్లడించారు.


ఇవి కూడా చదవండి...

ఆర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. ఏపీలో రైళ్లు దారి మళ్లింపు, పలు సర్వీసుల రద్దు

ఆర్నబ్ తుఫాన్ నష్టపరిహారంపై చంద్రబాబు కీలక ఆదేశాలు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 29 , 2026 | 11:40 AM