ఆర్నబ్ తుఫాన్ నష్టపరిహారంపై చంద్రబాబు కీలక ఆదేశాలు
ABN , Publish Date - Oct 29 , 2026 | 10:37 AM
ఆర్నబ్ తుఫాన్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షేత్రస్థాయిలో సాధారణ పరిస్థితి నెలకొనేంత వరకు విశ్రమించొద్దని ఇప్పటికే అధికార యంత్రాంగానికి సీఎం సూచనలు చేశారు.
అమరావతి, అక్టోబర్ 29: ఆర్నబ్ తుఫాన్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు(గురువారం) టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షేత్రస్థాయిలో సాధారణ పరిస్థితి నెలకొనేంత వరకు విశ్రమించొద్దని ఇప్పటికే అధికార యంత్రాంగానికి సీఎం సూచనలు చేశారు. కొన్ని ప్రాంతాలు మినహా మిగిలిన తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ స్థితి నెలకొంది. ఈ క్రమంలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోని క్షేత్రస్థాయి పరిస్థితులు, పునరుద్ధరణ పనులపై వివిధ శాఖల అధికారులు, జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తుఫాన్ నష్టంపై ఇవాళ ప్రాథమిక నివేదికను అందిస్తామని చంద్రబాబుకు అధికారులు తెలిపారు. పంట నష్టం మినహా బాధితులందరికీ నష్టపరిహారాన్ని అందించే పనిని వేగవంతం చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.
అధికార యంత్రాంగం పనితీరు అద్భుతం..
ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలకు అండగా ఉండాలని సీఎం తెలిపారు. ఆర్నబ్ తుఫాన్ సమయంలో అధికార యంత్రాంగం అద్భుతంగా పని చేసిందని కొనియాడారు. ఏపీలో ప్రస్తుతం విభిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని.. రాయలసీమ ప్రాంతంలో ఎల్‌నినో ప్రభావంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. ఇక మిగిలిన ప్రాంతాల్లో ఆర్నబ్ తుఫాన్ వల్ల సమస్యలు ఉత్పన్నమైనట్లు తెలిపారు. ఈ రెండింటి విషయంలో అధికార యంత్రాంగం సమర్థవంతంగా వ్యవహరించి ప్రజలను ఆదుకోవాలని ఆదేశించారు. రాయలసీమలో పంటలు వేసుకునే పరిస్థితి లేదని అన్నారు. ఉత్తరాంధ్ర, కోస్తా, గోదావరి జిల్లాల్లో వేసుకున్న పంటలను, కొబ్బరి చెట్లను నష్టపోయిన దుస్థితి నెలకొందన్నారు. పక్కా ప్రణాళికతో ఈ ప్రకృతి విపత్తుల బారీ నుంచి ప్రజలను బయటపడేయాలని తెలిపారు. ఆర్నబ్ తుఫాన్ వల్ల ప్రాణ, ఆస్తి నష్టం వీలైనంత మేర తగ్గించేలా చూశామని చెప్పుకొచ్చారు. చెరువులు, కాల్వలకు గండ్లు పడకుండా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. పడిపోయిన చెట్లను ఇప్పటికే చాలా వరకు తొలగించామని.. ఇంకా ఎక్కడైనా పడిపోయిన చెట్లు రోడ్లపై ఉంటే వాటిని వెంటనే తొలగించాలని ఆదేశించారు.
రేపటిలోగా విద్యుత్ పునరుద్ధరణ..
తుఫాన్ కారణంగా పోగైన చెత్తను కూడా తీసేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. రేపటిలోగా అన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలన్నారు. నష్ట పరిహారానికి సంబంధించిన అంశాలపై జీవో జారీ చేశామని.. పంట నష్టం మినహా బాధితులకు నష్టపరిహరం అందించాలని తెలిపారు. త్వరగా తుఫాన్ నష్టంపై అంచనాలు సిద్ధం చేయాలని ఆదేశించారు. నీట మునిగిన పంటలను ఏ మేరకు కాపాడగలమో చూడాలన్నారు. దీనిపై వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు, విద్యార్థులు అధ్యయనం చేయాలని అన్నారు. పంట మట్టిపాలు కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో ఆలోచించాలన్నారు. కొబ్బరి చెట్లు సహా వివిధ ఉద్యాన పంటలకు చెందిన చెట్లు, మొక్కలను తిరిగి ప్లాంట్ చేయగలిగే పరిస్థితులు ఉన్నాయా అనే అంశాన్నీ పరిశీలించాలని సూచించారు. తుఫాన్ బాధిత వ్యవసాయ, ఉద్యాన రైతులకు వాటిల్లిన నష్టాన్ని భర్తీ చేయడానికి వివిధ స్కీంలను వర్తింపజేయాలన్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ స్థితి నెలకొనేంత వరకు ప్రభుత్వ యంత్రాంగం అండగా నిలవాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం చేసే పనులను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలపాలని.. అప్పుడే ప్రజల నుంచి సహకారం లభిస్తుందన్నారు. త్వరితగతిన పంట నష్టం అంచనాలను సిద్ధం చేసేందుకు టెక్నాలజీని వినియోగించాలని టెలికాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి గొట్టిపాటి పర్యటన.. విద్యుత్ పునరుద్ధరణకు ఆదేశాలు
ఆర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. ఏపీలో రైళ్లు దారి మళ్లింపు, పలు సర్వీసుల రద్దు
Read Latest AP News And Telugu News