మాట్లాడే ముందు.. ఆలోచించండి.. ఇయర్ ఫోన్స్‌తో ప్రాణాలకు ముప్పు
ABN , Publish Date - Oct 29 , 2026 | 08:37 AM
ఏమీ పట్టించుకోకుండా.. ఏ మాత్రం స్పృహ లేకుండా రైల్వేట్రాక్ పక్కన ఇయర్ ఫోన్ పెట్టుకొని మాట్లాడుతూ నడుస్తున్న ఓ వ్యక్తిని వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన రైలు ఢీకొట్టి వెళ్లిపోయింది.
కళ్లకు రోడ్లు కనపడవు.. చెవులకు హారన్ వినపడదు
అటు ఇటైతే ప్రాణాలు హరీ
బొల్లారం ఘటన నేపథ్యంలో సీపీ హెచ్చరిక
ఎక్స్‌లో యువతకు దిశా నిర్దేశం
హైదరాబాద్ సిటీ: ఏమీ పట్టించుకోకుండా.. ఏ మాత్రం స్పృహ లేకుండా రైల్వేట్రాక్ పక్కన ఇయర్ ఫోన్ పెట్టుకొని మాట్లాడుతూ నడుస్తున్న ఓ వ్యక్తిని వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన రైలు ఢీకొట్టి వెళ్లిపోయింది. దాంతో ఆ యువకుడు దుర్మరణం చెందాడు. ఈ హృదయ విదారక దృశ్యం ఎవరి గుండెలనైనా బరువెక్కించక మానదు. బొల్లారం సమీపంలో ఇటీవల ఈ ప్రమాదం జరిగింది. ఇయర్ ఫోన్లు వినోదాన్ని పంచుతున్నాయా లేక కళ్లముందే పొంచి ఉన్న మృత్యువు కేకను కూడా వినిపించకుండా చేస్తున్నాయా? నిండు జీవితం కంటే ఆ ఫోన్ కాల్ అంత అత్యవసరమా, ఇంట్లో ఎదురుచూసే కుటుంబ సభ్యుల కంటే ఆ పాటలు అంత ముఖ్యమైనవా? ఒక్కసారి ఆలోచించండి అంటూ ఎక్స్ వేదికగా స్పందించారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీ.సీ. సజ్జనార్. ఈ మేరకు యువతకు ఎక్స్‌లో దిశానిర్ధేశం చేశారు.
చెవులు వినిపించనంతగా..
బైక్, కారు, లారీ, బస్సు, ఆటో, ట్రాలీ ఇలా వాహనం ఏదైనా.. వాహనదారులతో పాటు.. నడుచుకుంటూ వెళ్లే పాదచారులు సైతం 60 శాతానికి పైగా చేతిలో సెల్‌ఫోన్, చెవిలో ఇయర్‌ఫోన్, ఇయర్ బర్డ్స్ పెట్టుకొని డ్రైవింగ్ చేస్తున్నారు. పాదచారులు మాట్లాడుకుంటూ, పాటలు వింటూ రోడ్డుపై నడుస్తూ.. కనీస జాగ్రత్తలు తీసుకోకుండా రోడ్లు దాటుతున్నారు. కొందరైతే.. హెల్మెట్ లోపల సెల్‌ఫోన్ పెట్టి మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్నారు. ఆటోలు, క్యాబ్‌లు, ఉబర్ బైక్‌లు నడిపేవారు గూగుల్ మ్యాప్‌లు, వీడియోలు, లొకేషన్లు చూస్తూ రోడ్డుపై డ్రైవింగ్ చేస్తున్నారు. పక్కన వచ్చే వాహనదారులను పట్టించుకోకుండా, హారన్ కొట్టినా వినిపించుకోకుండా నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ రోడ్డు ప్రమాదాలకు కారణమతున్నారు.
ప్రాణాలు పోతే తిరిగిరావు
నిజానికి ఈ సృష్టిలో ప్రాణానికి మించిన అత్యవసరమైన ఫోన్ కాల్ ఏదీ ఉండదు. ప్రాణం గాల్లో కలిసిపోతే ఏ శక్తీ తిరిగి తీసుకురాలేదు. మీ కుటుంబానికి మిగిలేది జీవితాంతం తీరని శోకం, అంతులేని విషాదం మాత్రమే. ముఖ్యంగా యువత రోడ్లపై నడుస్తున్నప్పుడు, వాహనాలు నడుపుతున్నప్పుడు, రైల్వే ట్రాక్‌ల సమీపంలో నడుస్తున్నప్పుడు ఇయర్‌ఫోన్లు వాడే ప్రాణాంతక అలవాటును తక్షణమే మానుకోవాలి. ‘‘కాస్త ఆలోచించండి, బాధ్యతగా మెలగండి, నిండు ప్రాణాలను నిర్లక్ష్యానికి బలివ్వకండి, మీ రాక కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న మీ కుటుంబాన్ని గుర్తుంచుకోండి’’ అంటూ సీపీ సజ్జనార్ యువతకు దిశా నిర్దేశం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
చనిపోయినా ఎంత బుజ్జిగున్నావ్ చిట్టితల్లీ
బహిరంగ మార్కెట్‌లోకి పంప్డ్ స్టోరేజీ విద్యుత్!
Read Latest AP News And Telangana News And International News And Telugu News