భారత్-కెన్యా మధ్య సముద్ర భద్రతా సహకారం మరింత బలోపేతం
ABN , Publish Date - Oct 29 , 2026 | 08:19 AM
భారత్-కెన్యా మధ్య సముద్ర భద్రతా సహకారం మరింత బలోపేతమవుతోంది. భారత కోస్ట్ గార్డ్ నౌక ఐసీజీఎస్ వరాహ కెన్యాలోని మొంబాసా పోర్ట్‌లో పర్యటించి, కెన్యా కోస్ట్ గార్డ్ సిబ్బందితో సంయుక్త శిక్షణ నిర్వహించింది.
ఆంధ్రజ్యోతి, అక్టోబర్ 29: భారత్, కెన్యాల మధ్య ద్వైపాక్షిక సముద్ర భద్రతను బలోపేతం చేసే దిశగా ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ (ICGS) 'వరాహ' కెన్యాలోని మొంబాసా (MOMBASA) పోర్ట్‌లో ప్రత్యేక సంయుక్త శిక్షణ, వృత్తిపరమైన మార్పిడి కార్యక్రమాలను నిర్వహించింది. భారతదేశం ఆవిష్కరించిన మాహాసాగర్ విజన్, ద్వైపాక్షిక బహారీ ఉమ్మడి నినాదంలో భాగంగా ఈ పర్యటన జరిగింది.
కెన్యా కోస్ట్ గార్డ్ సర్వీస్ సిబ్బందితో కలిసి కోస్ట్ గార్డ్ సిబ్బంది 'సముద్ర శోధన, రక్షణ' టేబుల్‌టాప్ ఎక్సర్ సైజెస్, విజిట్ బోర్డ్ సెర్చ్ అండ్ సీజర్ (VBSS), అణు, జీవ, రసాయన, నష్ట నియంత్రణ (NBCD) పై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఫలితంగా రెండు దేశాల కోస్ట్ గార్డ్ దళాల మధ్య సమన్వయం పెంచడం, చట్టబద్ధమైన సముద్ర రక్షణ, తీరప్రాంత భద్రతను పటిష్టం చేయడం ఈ శిక్షణ ముఖ్య ఉద్దేశం.
ఇందులో భాగంగా ఐసీజీఎస్ వరాహ కమాండింగ్ ఆఫీసర్ కమాండెంట్ రమణ్‌జీత్ సింగ్ రాణా, భారత డిఫెన్స్ అడ్వైజర్‌తో కలసి కెన్యా కోస్ట్ గార్డ్ సర్వీస్ డైరెక్టర్ జనరల్ బ్రూనో షియోసో ను కలిశారు. సంయుక్త విన్యాసాలు, శిక్షణపై చర్చించారు. అనంతరం కెన్యా పోర్ట్స్ అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ కెప్టెన్ విలియం రూటోను కలిసి ఓడరేవుల భద్రత, సముద్ర కనెక్టివిటీ, ద్వైపాక్షిక వాణిజ్యం పెంపొందించడంపై అభిప్రాయాలు పంచుకున్నారు.
సాంస్కృతిక కార్యక్రమాలు.. కమ్యూనిటీ కనెక్ట్
యోగ వేడుకలు: ఐసీజీఎస్ వరాహ నౌకపై కెన్యాలోని భారతీయ మూలాలున్న ప్రజలతో కలిసి ప్రత్యేక యోగా సెషన్‌ను నిర్వహించారు. స్థానిక ప్రజలు, భారతీయులను ఓడపైకి ఆహ్వానించి, సముద్ర భద్రతపై వారికి అవగాహన కల్పించారు.
ఈ ఏడాది ఆఫ్రికాలోని మొంబాసా పోర్ట్‌ను భారత నౌకాదళం లేదా కోస్ట్ గార్డ్ నౌక సందర్శించడం ఇది మూడోసారి. అంతకుముందు భారత నౌకాదళానికి చెందిన ఐఎన్‌ఎస్ త్రికండ్ (INS Trikand), ఐఎన్‌ఎస్ తార్కాష్ (INS Tarkash)లు ఈ పోర్ట్‌ను సందర్శించాయి. (ICGS Varaha Mombasa Visit)
ఈ వార్తలు కూడా చదవండి..
కాంగ్రెస్‌పై మోదీ సెటైర్.. బ్యాలెట్ పేపర్‌తో ఎన్ని సీట్లు వచ్చాయంటూ పోస్ట్
పంజాబ్‌లో కాల్పుల కలకలం.. ఒకరి మృతి