Home Minister Anitha: పాస్ పుస్తకాలపై జగన్ ఫొటో వేశారు.. హోంమంత్రి ఫైర్
ABN , Publish Date - Jan 05 , 2026 | 01:29 PM
పారిశ్రామికంగా పాయకరావుపేట నియోజకవర్గం అభివృద్ధి చెందుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. స్టీల్ ప్లాంట్, బల్క్ డ్రగ్, బొమ్మల పరిశ్రమ లాంటి ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయని వివరించారు.
అనకాపల్లి జిల్లా, జనవరి 5(ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత (AP Home Minister Anitha) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారని ధ్వజమెత్తారు. గతంలో రైతులు రెవెన్యూ సమస్యలతో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగేవారని ప్రస్తావించారు. తమ ప్రభుత్వంలో ప్రజల సమస్యలు తీర్చడానికి రెవెన్యూ శాఖ కృషి చేస్తోందని తెలిపారు. 100 మంది ప్రజలు అర్జీలు ఇస్తే, అందులో 80మందివి భూ సమస్యలే ఉన్నాయని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వంలో పాస్ పుస్తకాలపై జగన్ మోహన్ రెడ్డి ఫొటో వేసుకున్నారని దుయ్యబట్టారు హోంమంత్రి అనిత.
ఇవాళ(సోమవారం) నక్కపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర, హోం మంత్రి అనిత, అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ హాజరయ్యారు. అలాగే ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు హోంమంత్రి అనిత. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు ప్రజలకు రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలు ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఇచ్చిన మాట ఇచ్చినట్లుగా రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలు ఇస్తున్నామని స్పష్టం చేశారు. ఈ పాస్ పుస్తకంపై క్యూఆర్ కోడ్ ఉంటుందని తెలిపారు. ఈ క్యూఆర్ కోడ్ ద్వారా ఎలాంటి మోసాలు చేయడానికి అవకాశం ఉండదని స్పష్టం చేశారు. పారిశ్రామికంగా పాయకరావుపేట నియోజకవర్గం అభివృద్ధి చెందుతోందని వెల్లడించారు హోంమంత్రి అనిత.
స్టీల్ ప్లాంట్, బల్క్ డ్రగ్, బొమ్మల పరిశ్రమ లాంటి ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయని వివరించారు. ఈ సంవత్సరాన్ని రెవెన్యూ ప్రక్షాళన సంవత్సరంగా చూడాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. అడ్డరోడ్డు జంక్షన్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పాయకరావుపేట నియోజకవర్గంలో పదోతరగతి చదువుతున్న విద్యార్థులకు సీఎస్ఆర్ నిధులతో 2,600 సైకిళ్లు ఇస్తున్నామని తెలిపారు. పిల్లలు ఎవరు పదోతరగతితో చదువులు ఆపకూడదని అన్నారు. ఉన్నతంగా చదువుకొని మహోన్నత స్థాయికి వెళ్లాలని సూచించారు. విద్యార్థులు, గంజాయి డ్రగ్స్ జోలికి పోకుండా మంచిగా చదువుకొని పాయకరావుపేట నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని హోంమంత్రి అనిత దిశానిర్దేశం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఆత్మనిర్భర్ భారత్‌లో మరో కీలక మైలురాయి: సీఎం చంద్రబాబు
ప్రయాణికులకు అలర్ట్.. విమానాల రాకపోకలకు ఆలస్యం
Read Latest AP News And Telugu News