Share News

604 మండలాల్లో వర్షాభావం

ABN , Publish Date - Jul 31 , 2026 | 07:50 AM

నాలుగు నెలల నైరుతి రుతుపవనాల సీజన్‌లో సగం కాలం గడిచిపోయింది. దేశంలోని అనేక ప్రాంతాల్లో భారీవర్షాలు కురుస్తుండగా దక్షిణ భారతంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ మాత్రం వర్షం కోసం ఎదురుచూస్తోంది.

604 మండలాల్లో వర్షాభావం
Andhra Pradesh Rainfall

  • దేశంలో 14 శాతం.. రాష్ట్రంలో 52.3 శాతం లోటు

  • సాగని సాగు.. ఖరీఫ్‌ సీజన్‌పై తీవ్ర ప్రభావం

  • 254.7కుగాను 121.8 మిల్లీమీటర్లే వర్షపాతం

  • దేశంలో 14 శాతం... రాష్ట్రంలో 52.3 శాతం లోటు

  • సాగని సాగు.. ఖరీఫ్‌ సీజన్‌పై తీవ్ర ప్రభావం

విశాఖపట్నం, జూలై 30(ఆంధ్రజ్యోతి): నాలుగు నెలల నైరుతి రుతుపవనాల సీజన్‌లో సగం కాలం గడిచిపోయింది. దేశంలోని అనేక ప్రాంతాల్లో భారీవర్షాలు కురుస్తుండగా దక్షిణ భారతంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ మాత్రం వర్షం కోసం ఎదురుచూస్తోంది. అడపాదడపా ఒక మోస్తరు వర్షం తప్ప ఇప్పటివరకూ భారీట వర్షాలు పడలేదు. ఈ నేపథ్యంలో తీవ్ర వర్షాభావం నెలకొనడంతో ఖరీఫ్‌ సాగు ముందుకు కదలడం లేదు. నైరుతి సీజన్‌లో రాష్ట్రంలో జూన్‌ ఒకటో తేదీ నుంచి గురువారం వరకు రెండు నెలల్లో 254.7 మిల్లీమీటర్లకుగాను 121.8 మిల్లీమీటర్లు (సాధారణం కంటే 52.3 శాతం తక్కువ) వర్షపాతం నమోదైంది. మొత్తంగా చూస్తే రాష్ట్రంలో 85శాతం ప్రాంతం వర్షాభావానికి లోనయ్యింది. మొత్తం 688 మండలాలకుగాను సాధారణం కంటే చాలా ఎక్కువ వర్షపాతం కురిసిన మండలాలు ఒక్కటి మాత్రమే ఉండగా, సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైన మండలాలు 10, సాధారణ వర్షపాతం నమోదైన మండలాలు 73 ఉన్నాయి. సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైన మండలాలు 380, చాలా తక్కువ వర్షపాతం నమోదైన మండలాలు 224 ఉన్నాయి. అంటే 604 మండలాలు వర్షాభావానికి గురైనవి కావడం రాష్ట్రంలో దుర్భిక్ష పరిస్థితుల తీవ్రతను తెలియజేస్తోంది.


జూన్‌లో మాదిరిగానే జూలైలో కూడా రోజుల తరబడి వేడి వాతావరణం కొనసాగడం, అదే సమయంలో వర్షాలు లేక పొడి వాతావరణం నెలకొనడంతో ఖరీఫ్‌ సాగు ముఖ్యంగా మెట్ట పంటల సాగుపై ప్రభావం చూపింది. వర్షాలు లేక చెరువులు, వాగులు, కుంటలు నిండకపోవడంతో వ్యవసాయ పనులకు ఆటంకం ఏర్పడింది. వర్షాలపై వాతావరణ మార్పుల ప్రభావం ఎక్కువగా ఉందని వాతావరణ నిపుణులు విశ్లేషించారు. మరోవైపు దేశంలోని అనేక రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్ర, దక్షిణ కర్ణాటక, గుజరాత్‌, రాజస్థాన్‌, ఒడిశా, ఉత్తరాఖండ్‌, జమ్ము కశ్మీర్‌, హిమాచల్‌ప్రదేశ్‌, అసోం, మరికొన్ని ఈశాన్య రాష్ట్రాలు వరదలతో అతలాకుతలమవుతున్నాయి. గుజరాత్‌ను అసాధారణ వర్షాలు ముంచెత్తాయి. అసోం ఇంకా కోలుకోలేదు. బంగాళాఖాతంలో ఏర్పడిన మూడు అల్పపీడనాల్లో రెండు వాయుగుండాలు/తీవ్ర వాయుగుండాలుగా మారి తూర్పు, మధ్య, పశ్చిమ, వాయవ్య భారతంలో విస్తారంగా వర్షాలు కురిశాయి. ఆంధ్రప్రదేశ్‌కు మాత్రం వర్షాలు ముఖం చాటేశాయి. నైరుతి రుతుపవనాల సీజన్‌లో దేశం మొత్తం జూన్‌ ఒకటో తేదీ నుంచి గురువారం వరకు 437.2 మిల్లీమీటర్లకుగాను 376.6 (సాధారణం కంటే 14 శాతం తక్కువ) మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అరేబియా సముద్రం మీదుగా వచ్చే తేమగాలులు పశ్చిమ కనుమలు దాటి కర్ణాటక, తెలంగాణ, ఏపీ వరకూ విస్తరించలేకపోతున్నాయని, దీంతో దక్షిణాదిలో ఎక్కువ ప్రాంతాలు వర్షాభావం ఎదుర్కొంటున్నాయని నిపుణులు తెలిపారు.


వార్తలు కూడా చదవండి...

హిందుత్వం అంటే మతం కాదు జీవన విధానం: వెంకయ్యనాయుడు

కియాతో ఏపీ ప్రభుత్వం ఎంఓయూ

గాదె సాయి కృష్ణ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం.. వారం రోజుల కస్టడీకి మాజీ సీఐ నాగరాజు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jul 31 , 2026 | 07:50 AM