తమ్మినేని సీతారాం విచారణలో కీలక పరిణామాలు.. కుమారుడి జాడపై మౌనం
ABN , Publish Date - Jul 30 , 2026 | 07:32 AM
‘తెలియదు..’ భూకబ్జా వ్యవహారంలో పోలీసులు ఏ ప్రశ్న వేసినా మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం జవాబు మాత్రం ఇదే. బతికున్న వ్యక్తిని రికార్డుల్లో ‘చంపేసి’, కుమారుడు చిరంజీవి నాగ్ పేరుతో రూ.4 కోట్ల విలువైన భూమిని రిజిస్ట్రేషన్ చేయించిన కేసులో సీతారాం బుధవారం పోలీసు విచారణకు హాజరయ్యారు.
తెలియదు!
భూ కబ్జా, కుమారుడి జాడపై
ఏం అడిగినా తమ్మినేని తీరిదే
మరికొన్ని ప్రశ్నలకు మౌనం..
కేసు పెట్టేదాకా భూమి కొన్నట్టు తెలియదు
రిజిస్ర్టేషన్‌కు నేను డబ్బులు ఇవ్వలేదు
5 గంటలు సాగిన మాజీ స్పీకర్ విచారణ
మళ్లీ పిలిస్తే రావాలని పోలీసుల ఆదేశం
శ్రీకాకుళం, జూలై 29(ఆంధ్రజ్యోతి): ‘తెలియదు..’ భూకబ్జా వ్యవహారంలో పోలీసులు ఏ ప్రశ్న వేసినా మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం జవాబు మాత్రం ఇదే. బతికున్న వ్యక్తిని రికార్డుల్లో ‘చంపేసి’, కుమారుడు చిరంజీవి నాగ్ పేరుతో రూ.4 కోట్ల విలువైన భూమిని రిజిస్ట్రేషన్ చేయించిన కేసులో సీతారాం బుధవారం పోలీసు విచారణకు హాజరయ్యారు. ఈ కేసులోనే సీతారాం, ఆయన భార్య వాణిశ్రీకి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కుమారుడు నాగ్‌కు మాత్రం ఊరట లభించలేదు. కోర్టు ఆదేశాల మేరకు బుధవారం శ్రీకాకుళం రూరల్ పోలీసు స్టేషన్‌లో విచారణకు న్యాయవాదితో కలసి తమ్మినేని సీతారాం హాజరయ్యారు. కుమారుడు ఎక్కడున్నారని విచారణ సందర్భంగా పోలీసులు సీతారాంను పలుమార్లు ఆరా తీశారు. కానీ, ఆయన మాత్రం ‘తెలియదు’ అనే సమాధానమివ్వడం గమనార్హం.
ఐదు గంటల పైబడి విచారించినా.. ఆయన నుంచి ఏం రాబట్టలేకపోయారని సమాచారం. భూమికి సంబంధించి రిజిస్ట్రేషన్, క్రయ విక్రయాలు మీకు తెలిసే జరిగాయా...ఇది వివాదాస్పద భూమి అని మీకు తెలియదా....మీ అబ్బాయి ప్రస్తుతం ఎక్కడున్నాడు...మీ అబ్బాయిని ఉద్దేశపూర్వకంగా తప్పించారా.. అని ప్రశ్నించారు. ఇందులో చాలా ప్రశ్నలకు తెలియదు అని అనగా, మరికొన్నింటికి మౌనంగా ఉండిపోయారు. ‘మీ అబ్బాయికి భూమి కొనుగోలు చేయాలని మీరు డబ్బులు ఇచ్చారా?’ అని అడగ్గా, తాను ఇవ్వలేదని బదులిచ్చారు. భూమికి ఎవరిపేరున రిజిస్ట్రేషన్ జరిగిందని ప్రశ్నించగా, చిరంజీవి నాగ్ పేరుతో రిజిస్ట్రేషన్ జరిగిందని చెప్పినట్లు సమాచారం. భూమి గురించి ఏమీ తెలియదా.. అని అడగ్గా.. ‘‘కేసు నమోదు అయిన తర్వాతే ఆ భూమి విషయం నాగ్‌ను అడిగాను. అంతా సక్రమంగానే భూ కొనుగోలు జరిగిందని చెప్పాడు’’ అని సీతారాం వివరించారు. మీకు షరతులతో బెయిల్ లభించింది కదా... మరి వీడియో ఎలా విడుదల చేశారని ప్రశ్నించగా.... కుటుంబ పెద్దగా ఆ పని చేసినట్టు తెలిపారు. విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరుకావాలని సీతారాంకు పోలీసులు స్పష్టం చేశారు. విచారణ ప్రక్రియనంతా వీడియో తీయించారు.
వార్తలు కూడా చదవండి...
చంద్రబాబు దూరదృష్టితో కుప్పంకు ఇజ్రాయిల్ టెక్నాలజీ: నారా భువనేశ్వరి
జీవ వైవిధ్య పరిరక్షణలో పులుల పాత్ర అమోఘం: పవన్ కల్యాణ్
ఏపీ మద్యం స్కాం.. కారుమూరికి సుప్రీంకోర్టులో షాక్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News