టీటీడీ లడ్డూను అపవిత్రం చేసిన వారిని కఠినంగా శిక్షించాలి: రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి
ABN , Publish Date - Feb 17 , 2026 | 09:02 PM
శ్రీవారి ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి శ్రీ సుభుదేంద్ర తీర్థ శ్రీపాద స్పందించారు. తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వినియోగంపై శ్రీ సుభుదేంద్ర స్వామి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
తిరుమల, ఫిబ్రవరి17 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి శ్రీ సుభుదేంద్ర తీర్థ శ్రీపాద (Sri Subhudendra Teertha Sripada) స్పందించారు. తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వినియోగంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా క్షమించరాని నేరం చేశారన్నారు. కల్తీ నెయ్యి సరఫరా చేసి మహా పాపానికి ఒడిగట్టిన వారిని చట్ట ప్రకారం శిక్షించాలంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు శ్రీ సుభుదేంద్ర తీర్థ శ్రీపాద లేఖ రాశారు .
తీవ్ర ఆవేదనకు గురయ్యా..
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి సమర్పించే లడ్డూ ప్రసాదంలో గతంలో కల్తీ పదార్థాలు ఉపయోగించారని తెలిసి తీవ్ర ఆవేదనకు గురయ్యానని శ్రీ సుభుదేంద్ర స్వామి చెప్పుకొచ్చారు. కోట్లాదిమంది హిందువులు అత్యంత పవిత్రంగా భావించే ప్రసాదాన్ని అపవిత్రం చేయడం క్షమించరాని అపరాధమని హెచ్చరించారు. మహా నైవేద్యాన్ని అపవిత్రం చేయడం అత్యంత పాపభూయిష్టమైన చర్య అని ఆవేదన వ్యక్తం చేశారు. సనాతన హిందూ ధర్మ పరిరక్షణ కేంద్రంగా ఉన్న మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతులుగా.. ఈ హేయమైన చర్యను తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు.
తీవ్రంగా పరిగణించాలి..
ధర్మో రక్షతి రక్షిత: అనే సూక్తిని గుర్తుచేస్తూ, ప్రభుత్వం దీన్ని తీవ్రంగా పరిగణించాలని శ్రీ సుభుదేంద్ర స్వామి డిమాండ్ చేశారు. నిష్పాక్షిక విచారణ జరిపి, కోట్లాది మంది హిందువుల మనోభావాలను కాపాడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. శ్రీవారి లడ్డూలో కల్తీకి పాల్పడిన వారిపై చట్టరీత్యా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సనాతన హిందూ ధర్మ విలువలను పరిరక్షించాలని ఏపీ ప్రభుత్వాన్ని శ్రీ సుభుదేంద్ర స్వామి కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి...
జగన్ కుటుంబమే తిరుమల పవిత్రతని దెబ్బతీసింది.. అచ్చెన్నాయుడు ధ్వజం..
వేంకటేశ్వరస్వామితో ఆటలాడే వారెవరూ బతికి బట్టకట్టలేదు.. స్వామి శ్రీనివాసనంద సరస్వతి ఫైర్
Read Latest Telangana News And AP News And Telugu News