Share News

యువత ఓటు హక్కు వినియోగించండి.. ప్రజాప్రతినిధులను ప్రశ్నించండి: కోటంరెడ్డి

ABN , Publish Date - Jun 03 , 2026 | 11:03 AM

నేటి విద్యార్థులు వివిధ రంగాల్లో కెరీర్ అవకాశాలపై ఆసక్తి చూపుతున్నప్పటికీ, సైన్యం, రాజకీయాల వంటి ప్రజాసేవా రంగాలపై ఆసక్తి కనపరిచేవారి సంఖ్య తగ్గిపోతోందని నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యానించారు.

యువత ఓటు హక్కు వినియోగించండి.. ప్రజాప్రతినిధులను ప్రశ్నించండి:  కోటంరెడ్డి
TDP MLA Kotamreddy Sridhar Reddy

నెల్లూరు, జూన్ 3(ఆంధ్రజ్యోతి): నేటి విద్యార్థులు వివిధ రంగాల్లో కెరీర్ అవకాశాలపై ఆసక్తి చూపుతున్నప్పటికీ, సైన్యం, రాజకీయాల వంటి ప్రజాసేవా రంగాలపై ఆసక్తి కనపరిచేవారి సంఖ్య తగ్గిపోతోందని నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (TDP MLA Kotamreddy Sridhar Reddy) వ్యాఖ్యానించారు. ఈరోజు(బుధవారం) నెల్లూరు నగరంలోని వోవెల్ జూనియర్ కాలేజీ ఐఐటీ, నీట్ అకాడమీలో జాతీయ స్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థుల అభినందన సభ జరిగింది.


ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి, విద్యాసంస్థల అధినేత వేణు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి మాట్లాడుతూ.. ప్రజలు ఓటు వేసి ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటారని, ఎన్నికల సమయంలో ప్రజల మధ్యకు వెళ్లిన నాయకులు గెలిచిన తర్వాత కూడా అదే విధంగా ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ప్రతి ప్రజాప్రతినిధి బాధ్యత అని పేర్కొన్నారు.


విద్యార్థులు కేవలం చదువులకే పరిమితం కాకుండా సమాజంలో జరుగుతున్న పరిణామాలను కూడా తెలుసుకోవాలని ఎమ్మెల్యే కోటంరెడ్డి సూచించారు. సామాజిక, రాజకీయ పరిస్థితులపై అవగాహన పెంచుకోవాలని, ప్రజాప్రతినిధులను ప్రశ్నించే ధైర్యం కలిగి ఉండాలని చెప్పుకొచ్చారు. ఓటు హక్కు వచ్చిన వెంటనే దానిని వినియోగించుకోవాలని, మంచి నాయకులను ఎన్నుకోవడం ద్వారా సమాజాభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. ‘మనకెందుకులే’ అనే నిర్లక్ష్య ధోరణి సమాజానికి నష్టాన్ని కలిగిస్తుందని, ప్రతి పౌరుడు బాధ్యతతో వ్యవహరించాలని పేర్కొన్నారు.


యువత దేశ భవిష్యత్తు అని, విద్యతో పాటు సామాజిక బాధ్యత కూడా అవసరమని తెలిపారు. ఈ విద్యాసంస్థకు చెందిన 22 మంది విద్యార్థులు జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించడం ఎంతో గర్వకారణమని అభినందించారు. వారి కృషి, పట్టుదల ఇతర విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు. విద్యార్థుల విజయాలకు తల్లిదండ్రులు, అధ్యాపకులు అందించిన సహకారం కూడా ప్రశంసనీయమని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

‘సర్‌’ను సీరియస్‌గా తీసుకోండి.. సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

సునీల్ కుమార్ వ్యాఖ్యలపై విచారణ చేయాలి: రఘురామకృష్ణరాజు

Read Latest  AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jun 03 , 2026 | 11:10 AM