కర్మ ఎవరినీ వదిలిపెట్టదని జగన్ తెలుసుకోవాలి: టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర
ABN , Publish Date - Oct 18 , 2026 | 04:10 PM
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఫైర్ అయ్యారు. అభివృద్ధి చేశామని చెబుతున్న జగన్ను.. ప్రజలు 2024 ఎన్నికల్లో ఎందుకు ఓడించారో, ఎందుకు 11 సీట్లకే పరిమితం చేశారో వైసీపీ చెప్పాలన్నారు.
అమరావతి, అక్టోబర్ 18: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో వైసీపీ ఉద్దేశపూర్వకంగానే గొడవలు సృష్టిస్తోందని టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. ఈ మేరకు వైసీపీని తీవ్రంగా విమర్శించారు.
‘అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్న వైసీపీని.. గత ఎన్నికల్లో ప్రజలు ఎందుకు ఓడించారు? మీరు అభివృద్ధి చేశామంటున్నారు.. ప్రజలు మీరు అరాచకాలు చేశారని భావించే.. పక్కన కూర్చోబెట్టారు. రాయచోటికి పంజాబ్ గ్యాంగ్ను, పుంగనూరుకు బెంగుళూరు గ్యాంగ్లను తీసుకువచ్చింది మీరు కాదా..? పులివెందులలో మీ ఎంపీ అవినాష్ రెడ్డి 200 మందిని వేసుకొని పోలింగ్ కేంద్రానికి ఎందుకు వెళ్లారో చెప్పాలి. మేము తలచుకుంటే మీరు అసలు నామినేషన్లు వేయగలిగేవారా..? కేవలం ఐదు చోట్ల మీరే అల్లర్లు సృష్టించి రాష్ట్రం మొత్తం అరాచకాలు జరిగాయని ఎలా చెబుతారు? దశాబ్దాలుగా పుంగనూరు, పులివెందుల, రాయచోటిలో జరుగుతున్న అణచివేతల కారణంగానే అక్కడ ప్రజలు తిరగబడ్డారు. గంట ముందే తాడేపల్లి ప్యాలెస్లో ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను చంద్రబాబు అనుచరుడని తిట్టి.. మళ్లీ ఆయన దగ్గరికే వెళ్లి.. పక్కన కూర్చొని చెప్పడం చూస్తే సిగ్గుగా లేదా? 2021 స్థానిక ఎన్నికల్లో చేసిన దౌర్జన్యాలు, అరాచకాలకు వైసీపీ.. ఇప్పుడు ఫలితాలు అనుభవించబోతోంది. కర్మ ఎవరిని వదిలిపెట్టదని జగన్ తెలుసుకోవాలి’ అని ఎమ్మెల్యే నరేంద్ర పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మున్సిపల్ ఎన్నికలు.. మేయర్ అభ్యర్థులపై ఉత్కంఠ.. సీఎం నిర్ణయంపై ఆసక్తి
రాయచోటి, పుంగనూరు ఘటనలపై నివేదిక కోరాం.. చర్యలు తీసుకుంటాం: ఏపీ ఎస్ఈసీ