‘థాంక్యూ సీఎం సర్.. థాంక్యూ లోకేశ్ సర్’.. కొండారెడ్డి బురుజు వద్ద టీచర్స్ నినాదాలు
ABN , Publish Date - Aug 08 , 2026 | 12:38 PM
కర్నూలు జిల్లాలోని కొండారెడ్డి బురుజు నుంచి మెగా డీఎస్సీ 2025 ఆత్మ గౌరవ ర్యాలీ ప్రారంభమైంది. ఉపాధ్యాయుల హక్కు - న్యాయమైన నియామకాలకు మద్దతు అంటూ ఉపాధ్యాయ సంఘాలు పిలుపునిచ్చాయి.
కర్నూలు, ఆగస్టు 8: జిల్లాలోని కొండారెడ్డి బురుజు నుంచి మెగా డీఎస్సీ 2025 ఆత్మ గౌరవ ర్యాలీ ప్రారంభమైంది. ఉపాధ్యాయుల హక్కు - న్యాయమైన నియామకాలకు మద్దతు అంటూ ఉపాధ్యాయ సంఘాలు పిలుపునిచ్చాయి. మెగా డీఎస్సీ నియామకాలపై జరుగుతోన్న తప్పుడు ప్రచారం, నిరాధార ఆరోపణలను ఖండిద్దాం అంటూ ఉపాధ్యాయ సంఘాల పిలుపు మేరకు ఉమ్మడి కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలకు చెందిన నూతన ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున తరలివచ్చి ర్యాలీలో పాల్గొన్నారు. కర్నూలు కొండారెడ్డి బురుజు నుంచి జిల్లా పరిషత్ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగనుంది. రాయలసీమ ఉపాధ్యాయిని, ఉపాధ్యాయుల(డీఎస్సీ–2025) పేరిట ర్యాలీ నిర్వహించారు.
ఈ క్రమంలో కర్నూలు నడిబొడ్డున కొండారెడ్డి బురుజు వద్ద ‘థ్యాంక్యూ సీఎం సార్... థ్యాంక్యూ మినిస్టర్ నారా లోకేశ్’ అంటూ టీచర్స్ నినాదాలు చేశారు. కొండారెడ్డి బురుజుపైకి ఎక్కిన ఉపాధ్యాయులు.. వైసీపీకి వ్యతిరేకంగా నిరసన తెలియజేశారు. ‘కష్టపడి చదివి ఉద్యోగాలు పొందాం... ఎవరికీ డబ్బులు ఇవ్వలేదు. మాపై వైసీపీ దుష్ప్రచారం చేయడం తగదు’ అంటూ ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
దగా డీఎస్సీ అంటే వైసీపీపై యుద్ధమే... టీచర్స్ హెచ్చరిక
డీఎస్సీ అంటే మీనింగ్ తెలియని వాళ్లు తమపై ఆరోపణలు చేస్తున్నారని ఉపాధ్యాయులు మండిపడ్డారు. గత ప్రభుత్వంలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వని వారు నేడు విమర్శించడం సిగ్గు చేటన్నారు. డీఎస్సీ పరీక్షలు రాయని వారు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇచ్చిన మాట ప్రకారం సీఎం చంద్రబాబు.. ఆరు నెలల్లో నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు కల్పించారని తెలిపారు. గత ప్రభుత్వం ఉపాధ్యాయులతో పెట్టుకొని 11 సీట్లకు పరిమితమైందని.. టీచర్స్‌ను అవమానిస్తే వచ్చే ఎన్నికల్లో వైసీపీ పీఠం మళ్లీ కదిలిస్తామని హెచ్చరించారు. దగా డీఎస్సీ అంటే టీచర్లందరూ వైసీపీపైన యుద్ధం చేస్తారని వార్నింగ్ ఇచ్చారు. మెగా డీఎస్సీ నిర్వహించిన మంత్రి నారా లోకేశ్ చరిత్రలో నిలిచిపోతారన్నారు. డీఎస్సీ అంటే చంద్రబాబు... చంద్రబాబు అంటే డీఎస్సీ అని తెలిపారు. టీచర్లపై బురదజల్లే ప్రయత్నం చేస్తే ఎన్నికల్లో వైసీపీకి గుణపాఠం చెప్తామంటూ ఉపాధ్యాయులు హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి...
మహిళా ఎస్‌ఐపై అసభ్య ప్రవర్తన.. వైసీపీ నేత కోసం పోలీసుల గాలింపు
వివేకా హత్య కేసు విచారణలో అవకతవకలు: వైఎస్ సునీతా రెడ్డి
Read Latest AP News And Telugu News