ఎస్సీ, ఎస్టీలకు వందశాతం సబ్సిడీతో సోలార్ ప్యానెల్స్: మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
ABN , Publish Date - Apr 19 , 2026 | 01:38 PM
ప్రజల జీవితాల్లో గొప్ప మార్పు తీసుకురాగలిగే పీఎం సూర్య ఘర్ పథకం ప్రారంభించటం చాలా ఆనందంగా ఉందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా కోటి గృహాలకు ఉచిత విద్యుత్ అందించాలనే మహత్తర లక్ష్యంతో ఈ పథకం అమలు చేస్తున్నారని పేర్కొన్నారు.
నంద్యాల, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి): ప్రజల జీవితాల్లో గొప్ప మార్పు తీసుకురాగలిగే పీఎం సూర్య ఘర్ పథకం ప్రారంభించటం చాలా ఆనందంగా ఉందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి (Minister BC Janardhan Reddy) వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా కోటి గృహాలకు ఉచిత విద్యుత్ అందించాలనే మహత్తర లక్ష్యంతో ఈ పథకం అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు వంద శాతం సబ్సిడీతో ఉచితంగా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించిందని తెలిపారు. ఈరోజు (ఆదివారం) బనగానపల్లె పంచమపేటలో ప్రధానమంత్రి సూర్యఘర్ ఉత్సవ్‌ను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఎస్సీ, ఎస్టీలకు వందశాతం సబ్సిడీతో సోలార్ ప్యానల్స్ అందిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఇతర వర్గాలకు 40శాతం వరకు సబ్సిడీ లభిస్తుందని పేర్కొన్నారు. బనగానపల్లె నియోజకవర్గంలో 4606 మంది, బనగానపల్లె మండలంలో 2910 మంది ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందుతున్నారని వివరించారు. పంచమపేటలో 331 మంది లబ్ధిదారులకు ఈ పథకాన్ని అందిస్తున్నామని వెల్లడించారు.
ఈ పథకం ద్వారా నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందవచ్చని తెలిపారు. మధ్యతరగతి కుటుంబాలపై విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించవచ్చని అన్నారు. అదనంగా ఉత్పత్తి అయ్యే విద్యుత్ ప్రభుత్వానికి అమ్ముకునే వెసులుబాటు ఉంటుందని వివరించారు. ఈ పథకం కేవలం ఉచితంగా విద్యుత్‌ను అందించడం మాత్రమే కాదని... దేశాన్ని పునరుత్పాదక శక్తి వైపు తీసుకెళ్లే గొప్ప అడుగని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
జగన్ హయాంలో పేదలకు అన్నం లేకుండా చేశారు.. సీఎం ధ్వజం
స్మార్ట్ పరిశ్రమలతో అమరావతికి ఆదాయం పెంచడమే లక్ష్యం: మంత్రి నారాయణ
వైఎస్సార్ సిద్ధాంతాలను జగన్ మంటగలిపారు.. షర్మిల ధ్వజం
Read Latest AP News And Telangana News And International News And Telugu News