వివేకా హత్య కేసులో ఆరోపణలపై ఎందుకు మౌనం?.. జగన్‌కు మంత్రి నిమ్మల సూటి ప్రశ్న
ABN , Publish Date - Sep 30 , 2026 | 03:10 PM
మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ అవినీతి, నేరపూరిత మనస్తత్వం ముందు అంతర్జాతీయ మాఫియా డాన్లు సైతం దిగదుడుపే అంటూ ఎద్దేవా చేశారు.
అమరావతి, సెప్టెంబర్ 30: మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈరోజు(బుధవారం) మీడియాతో మాట్లాడుతూ.. జగన్ అవినీతి, నేరపూరిత మనస్తత్వం ముందు అంతర్జాతీయ మాఫియా డాన్లు సైతం దిగదుడుపే అంటూ ఎద్దేవా చేశారు. తాను చేసిన ఘోర నేరాలు, హత్యలను ఇతరులపైకి నెట్టేసి తప్పించుకోవడంలో జగన్ సరికొత్త నేర పాఠాలు నేర్పారని విమర్శించారు. కేవలం ఆర్థిక ఉగ్రవాదిగానే కాక, నేర సామ్రాజ్యానికే జగన్ అసలైన సూత్రధారిగా మారారని అన్నారు. తాత రాజారెడ్డి నాటి ఫ్యాక్షన్ క్రూరత్వాన్ని అందిపుచ్చుకుని, అనుచరులకు ‘రప్పా రప్పా’ హింసా సంస్కృతిని నూరిపోస్తున్నారని మండిపడ్డారు. సొంత బాబాయ్‌ని గొడ్డలితో హత్య చేయించి, ఆ కేసుతో సంబంధమున్న వారిని వరుసగా అనుమానాస్పదంగా అంతమొందిస్తున్నారని ఆరోపించారు.
నాడు లోటస్ పాండ్‌లో బటన్ నొక్కితేనే.. పులివెందులలో బాబాయ్ ప్రాణాలు గాల్లో కలిశాయని మంత్రి వ్యాఖ్యానించారు. సునీల్ యాదవ్ ఇచ్చిన సంచలన వాంగ్మూలంపై జగన్మోహన్ రెడ్డి ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. దస్తగిరి నుంచి సునీల్ యాదవ్ వరకు.. తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా సాగిన కుట్రల గుట్టును రట్టు చేశారని తెలిపారు. అంతఃపుర రహస్యాలను, సాగిన నెత్తుటి కుట్రలను జగన్ తక్షణమే ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు. జగన్, అవినాష్ రెడ్డిల నుంచే తనకు ప్రాణహాని ఉందని నిందితుడు సునీల్ యాదవే స్వయంగా వెల్లడించారని అన్నారు.
వివేకా కేసును నెత్తికెత్తుకుంటే శివశంకర్ రెడ్డి రూ.10 కోట్లు ఇస్తానన్నట్లు కువైట్ గంగాధర్ రెడ్డి సీబీఐకి సాక్ష్యమిచ్చారని నిమ్మల తెలిపారు. వివేకా కేసుతో లింకున్న కసనూరు శ్రీనివాస్ రెడ్డి, ఈసీ గంగిరెడ్డి, కువైట్ గంగాధర్ రెడ్డి, డ్రైవర్ నారాయణ, వైఎస్ అభిషేక్ రెడ్డి, వాచ్‌మెన్ రంగయ్యలు అనుమానాస్పదంగా ప్రాణాలు కోల్పోయారని అన్నారు. కేసులో కీలక సాక్షిగా మారిన సునీల్ యాదవ్‌పై ఇప్పటికే మూడుసార్లు హత్యాయత్నం జరిగిందని చెప్పారు. రూ.40 కోట్ల భారీ సుపారీ వెనుక ఉన్న అసలైన అంతిమ లబ్ధిదారు జగనేనని స్వయంగా నిందితులే స్పష్టం చేశారని అన్నారు. ప్రభుత్వంపై బురదజల్లడానికి ముందుండే వ్యక్తి.. సొంత బాబాయ్ హత్య కేసులో నిందితులే నేరుగా వేలెత్తి చూపుతున్నా ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు. నిందితుల వాంగ్మూలాలపై జగన్ పాటిస్తున్న మౌనం ముమ్మాటికీ నేరాన్ని అంగీకరించడమే అని మంత్రి నిమ్మల రామానాయు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
ఏషియన్ గేమ్స్‌లో భారత మహిళల ఆర్చరీ జట్టుకు స్వర్ణం.. మంత్రి మండిపల్లి అభినందనలు
దసరా మహోత్సవాలకు రండి.. సీఎం చంద్రబాబుకు ఆహ్వానం
Read Latest AP News And Telugu News