శ్రీవారి సొత్తును ఇతరులకు కేటాయించే హక్కు లేదు: భానుప్రకాశ్ రెడ్డి
ABN , Publish Date - Oct 10 , 2026 | 04:15 PM
తిరుమల కొండ పూర్తిగా వేంకటేశ్వర స్వామి సొత్తు అని టీటీడీ పాలకమండలి సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి స్పష్టం చేశారు. సప్తగిరులు మొత్తం స్వామి వారికే సొంతమన్నారు.
తిరుమల, అక్టోబర్ 10: తిరుమల కొండ పూర్తిగా వేంకటేశ్వర స్వామి సొత్తు అని టీటీడీ పాలకమండలి సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి స్పష్టం చేశారు. సప్తగిరులు మొత్తం స్వామి వారికే సొంతమన్నారు. ఈరోజు(శనివారం) మీడియాతో మాట్లాడుతూ.. 7.5 ఎకరాల భూమిని మైసూర్ మహారాజ్‌కు టీటీడీ కేటాయించిందని తెలిపారు. ఈ భూమిలో కర్ణాటక ప్రభుత్వం అతిథిగృహాన్ని నిర్మించిందన్నారు. తాజాగా కర్ణాటక ప్రభుత్వం తిరుమల్లోని అతిథి గృహాన్ని టూరిజం శాఖకు కేటాయిస్తూ కేబినెట్‌లో నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఈ కేటాయింపు వెనుక కాంగ్రెస్‌కు చెందిన ఓ మాజీ కేంద్ర మంత్రి హస్తం ఉందని ఆరోపించారు.
శ్రీవారి సొత్తును ఇతరులకు కేటాయించే హక్కు ఏ ప్రభుత్వానికి లేదని భానుప్రకాశ్ స్పష్టం చేశారు. కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధార్మిక క్షేత్రాన్ని కర్ణాటక సీఎం డీకే శివకుమార్ వ్యాపార కేంద్రంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. త్వరలోనే టీటీడీ తరుఫున కర్ణాటక ప్రభుత్వానికి నోటీసులు పంపుతామన్నారు. కర్ణాటక ప్రభుత్వం స్పందించకపోతే అతిథి గృహాన్ని టీటీడీ స్వాధీనం చేసుకుంటుందని భానుప్రకాశ్ రెడ్డి స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి...
‘సర్’పై కాంగ్రెస్ ఆరోపణలను తిప్పికొట్టండి.. నేతలకు రాంచందర్ రావు పిలుపు
తూ.గో జిల్లాలో పులి సంచారం.. అప్రమత్తంగా ఉండాలని పవన్ కల్యాణ్ ఆదేశాలు
Read Latest AP News And Telugu News