నవంబర్ 15లోగా స్థానిక ఎన్నికలు పూర్తి చేయాలి.. మంత్రులకు చంద్రబాబు ఆదేశాలు
ABN , Publish Date - Oct 10 , 2026 | 02:36 PM
సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో బీసీ రిజర్వేషన్లపై చర్చ జరిగింది. స్థానిక ఎన్నికలను సీరియస్‌గా తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
అమరావతి, అక్టోబర్ 10: సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో బీసీ రిజర్వేషన్లపై చర్చ జరిగింది. స్థానిక ఎన్నికలను సీరియస్‌గా తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పట్టణాల్లో బీసీల జనాభా శాతం బాగా పెరిగిందని.. ఎన్టీఆర్ సమయంలో బీసీలకు 24 శాతం రిజర్వేషన్లు ఇచ్చారని గుర్తుచేశారు. అలాగే గత టీడీపీ ప్రభుత్వంలో 34 శాతం బీసీలకు ఇచ్చారని.. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు బీసీ రిజర్వేషన్లపై సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయాయని విమర్శించారు.
ఎన్నికలకు కూటమి సిద్ధంగా ఉందన్న సీఎం.. నవంబర్ 15వ తేదీ నాటికి స్థానిక ఎన్నికలు పూర్తి చేసి రెగ్యులర్ పరిపాలనలోకి వెళ్లాలని మంత్రులకు సూచించారు. కూటమి అభ్యర్థుల గెలుపు బాధ్యత ఇన్‌ఛార్జ్ మంత్రులదే అని స్పష్టం చేశారు. మూడు పార్టీల మధ్య సమన్వయంతో ముందుకు వెళ్లాలని అన్నారు. స్థానిక పరిస్థితుల ఆధారంగా ఇన్‌ఛార్జ్ మంత్రులు సమన్వయం చేసుకోవాలన్నారు. ఏ ఒక్క స్థానం ఓడిపోవడానికి వీలులేదని.. 100 శాతం స్థానాలు గెలుచుకొని తీరాల్సిందే అని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలలో కొత్త నాయకత్వం వస్తుందని అభిప్రాయపడ్డారు. స్థానిక ఎన్నికలను మంత్రులు, ఎమ్మెల్యేలు సీరియస్‌గా తీసుకోవాలని ఆదేశించారు.
గతంలో 34 శాతం రిజర్వేషన్ ఉంటే దానిని కదిలించింది జగన్ అని.. ఆ తర్వాత హైకోర్టు కొట్టివేస్తే సుప్రీంకోర్టుకు కూడా వెళ్లలేదని చంద్రబాబు విమర్శించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం 34 శాతం రిజర్వేషన్లను బీసీలకు ఇస్తుంటే.. అది అమలుకాకుండా కోర్టుకు వెళ్లారని మండిపడ్డారు. బీసీలకు రిజర్వేషన్ రాకుండా వైసీపీ అడ్డుపడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు సాధ్యమైనంత ఎక్కువ రిజర్వేషన్ ఇద్దామని, పార్టీపరంగా 34 శాతం రిజర్వేషన్ ఇద్దామని ఈ సందర్భంగా సీఎం చెప్పుకొచ్చారు. వైసీపీ కోర్టుకు వెళ్లకుండా ఉంటే 34 శాతం రిజర్వేషన్ అమలయ్యేదని చెప్పుకొచ్చారు. గతంలో బీసీలకు రిజర్వేషన్ ఇచ్చే విషయంలో కూడా జగన్ తప్పులు చేశారని వ్యాఖ్యానించారు. కమిషన్ వేయకుండానే జగన్ 34 శాతం రిజర్వేషన్ జీఓ ఇచ్చారని.. దీంతో ఆనాడు హైకోర్టు కొట్టివేసిందన్నారు. సర్ తర్వాత వచ్చే ఓటర్ల జాబితాతో ఎన్నికలు నిర్వహించాలని జగన్ కోర్టుకు వెళ్లారని తెలిపారు.
ఎల్‌నినో సమయంలో సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో 34 శాతం లోటు వర్షపాతం ఉన్నప్పటికీ గత ఏడాది నీటి నిల్వలు చేసుకోవడం వలన ఈ ఏడాది కొంతవరకు బయటపడ్డామని చెప్పుకొచ్చారు. మంత్రులు ప్రేక్షకుల మాదిరిగా ఉండవద్దని.. కొత్త విషయాలు నేర్చుకోవాలన్నారు. కేంద్రంలో ఉన్న సంబంధిత శాఖ మంత్రితో టచ్‌లో ఉండాలని తెలిపారు. ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అభివృద్ధి పనులకు సంబంధించిన నిధులను సోమ, మంగళవారాలలో విడుదల చేస్తామని.. ఒక్కో నియోజకవర్గానికి కోటి రూపాయల చెప్పున విడుదల చేయనున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇక సమావేశంలో బీసీ రిజర్వేషన్లపై రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదిక వివరాలను అధికారులు చదివి వినిపించారు.
ఇవి కూడా చదవండి...
వికారాబాద్‌లో దారుణం.. ప్రేమ వేధింపులతో యువతి బలవన్మరణం
‘సర్’పై కాంగ్రెస్ ఆరోపణలను తిప్పికొట్టండి.. నేతలకు రాంచందర్ రావు పిలుపు
Read Latest Telangana News And Telugu News