ఏపీలో బీసీ జనాభా 50.42 శాతం.. రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక చర్చ
ABN , Publish Date - Oct 10 , 2026 | 12:23 PM
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. ఈ సందర్భంగా బీసీ రిజర్వేషన్ల అంశంపై సమగ్ర సమాచారాన్ని అధికారులు మంత్రివర్గం ముందుంచారు.
అమరావతి, అక్టోబర్ 10: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. ఈ సందర్భంగా బీసీ రిజర్వేషన్ల అంశంపై సమగ్ర సమాచారాన్ని అధికారులు మంత్రివర్గం ముందుంచారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చిందని అధికార యంత్రాంగం పేర్కొంది. సమకాలీన డేటా, ప్రస్తుత స్థానిక పరిస్థితులు, జనాభా ప్రాతిపదికన మాత్రమే రిజర్వేషన్లు ఖరారు చేయాలని అత్యున్నతన్యాయస్థానం స్పష్టం చేసింది. గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో ‘ట్రిపుల్ టెస్ట్’ తప్పనిసరిగా నిర్దేశిస్తూ పలు కేసుల్లో సుప్రీంకోర్టు నిర్దేశించింది.
ట్రిపుల్ టెస్ట్ పూర్తి చేయకపోతే, SC, STలకు వారి జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు కల్పించిన అనంతరం, మిగిలిన అన్ని స్థానాలను జనరల్ కేటగిరీగా ప్రకటించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేసింది. రిటైర్డ్ IAS అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా అధ్యక్షతన స్వతంత్ర ప్రత్యేక కమిషన్‌ను సర్కార్ ఏర్పాటు చేసింది. ఈ ఏడాది మార్చి 23 నుంచి కమిషన్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తృతంగా పర్యటించి, వివిధ బీసీ కుల సంఘాల నుంచి విజ్ఞప్తులు, అభిప్రాయాలను కమిషన్ సేకరించింది. దాదాపు 7 నెలల పాటు విస్తృతంగా, సమగ్రంగా వివిధ స్థాయిల్లో అధ్యయనం నిర్వహించిన అనంతరం 2026, ఆగస్టు14న ప్రభుత్వానికి రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదికను సమర్పించింది.
సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సమకాలీన సమాచారాన్ని కమిషన్ ప్రాతిపదికగా తీసుకుంది. ఈ వివరాలను స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డుల ద్వారా ప్రజల ముందుంచి... తప్పులు, లోపాలు ఉంటే పరిశీలించి సరిదిద్దుకునే అవకాశం కల్పించారు. PR&RD, MA&UD శాఖల నుంచి తుది ధృవీకరణ అనంతరం అందిన నివేదికల ఆధారంగా ప్రత్యేక కమిషన్ రాష్ట్ర మొత్తం జనాభాను 5,27,46,589గా పేర్కొంది. అందులో బీసీ జనాభా 2,65,94,418, అంటే మొత్తం జనాభాలో బీసీలు 50.42 శాతంగా ఉన్నారు. గ్రామీణ జనాభాలో బీసీలు-48.84 శాతం, పట్టణ జనాభాలో బీసీలు-54.36 శాతం అని కమిషన్ స్పష్టం చేసింది. ఈ వివరాల ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్‌పై ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది.
ఇవి కూడా చదవండి...
పట్టిసీమతో కృష్ణా డెల్టాకు జలకళ.. 500 టీఎంసీల గోదావరి జలాల వినియోగం
సీఈసీ వివాదంపై వెంకయ్య నాయుడు ఫైర్.. ప్రతిపక్షాల తీరుపై విమర్శలు
Read Latest AP News And Telugu News