విజయవాడ సరస్ మేళాకు రాష్ట్రపతి ముర్ము.. 600 స్టాళ్ల ఏర్పాటు: పెమ్మసాని చంద్రశేఖర్
ABN , Publish Date - Oct 10 , 2026 | 12:41 PM
విజయవాడ ఉత్సవ్‌తో పాటు సరస్ మేళాను ఘనంగా నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న డ్వాక్రా మహిళలను ఒకే వేదికపైకి తీసుకువచ్చే కార్యక్రమం సరస్ మేళా అని అన్నారు.
విజయవాడ, అక్టోబర్ 10: విజయవాడ ఉత్సవ్‌తో పాటు సరస్ మేళాను ఘనంగా నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఈరోజు(శనివారం) మీడియాతో మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఉన్న డ్వాక్రా మహిళలను ఒకే వేదికపైకి తీసుకువచ్చే కార్యక్రమం సరస్ మేళా అని అన్నారు. మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగడానికి మంచి వేదికగా చెప్పుకొచ్చారు. ఈనెల 15న సరస్ మేళాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరుకానున్నారని తెలిపారు. ఈ మేళాలో మొత్తం 600 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నామని, దేశీయ రుచులను కూడా సరస్ మేళా ద్వారా పరిచయం చేయనున్నట్లు చెప్పారు.
సరస్ మేళా ద్వారా గ్రామీణ మహిళలకు జాతీయ స్థాయి గుర్తింపు లభించనుందని కేంద్రమంత్రి తెలిపారు. మహిళా ఉత్పత్తులకు జాతీయస్థాయి మార్కెటింగ్ వేదిక ఈ మేళా అని అన్నారు. దేశవ్యాప్తంగా ఆహార పదార్థాలు, కళలకు ఒకే వేదికగా వెల్లడించారు. ఈనెల 20 వరకు విజయవాడ ఉత్సవ్‌ను నిర్వహించనున్నట్లు తెలిపారు. సరస్ మేళాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. దసరా ఉత్సవాలు కూడా ఘనంగా జరుగనున్నాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు.
అదే సరస్ మేళా ఉద్దేశం: కేశినేని చిన్ని
గత ఏడాది గుంటూరులో నిర్వహించిన సరస్ మేళా విజయవంతమైందని ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. కృష్ణానదీ తీరాన పున్నమిఘాట్‌లో ఈ మేళాను నిర్వహించనున్నట్లు తెలిపారు. డ్వాక్రా, మెప్మా మహిళలు అందరూ సరస్ మేళాలో పాల్గొనాలన్నారు. ఈ మేళాలో దేశ వ్యాప్తంగా ఉన్న డ్వాక్రా మహిళలు పాల్గొననున్నారని చెప్పారు. డ్వాక్రా, మెప్మా మహిళల చేతి ఉత్పత్తులకు మార్కెటింగ్ వేదిక సరస్ మేళా అని అన్నారు. మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిద్దడమే ఈ మేళా ముఖ్య ఉద్దేశమని ఎంపీ కేశినేని చిన్ని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి...
సీఈసీ వివాదంపై వెంకయ్య నాయుడు ఫైర్.. ప్రతిపక్షాల తీరుపై విమర్శలు
ఏపీలో బీసీ జనాభా 50.42 శాతం.. రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక చర్చ
Read Latest AP News And Telugu News