తూ.గో. జిల్లాలో పెద్దపులి సంచారం.. ఒంటరిగా పొలాల్లోకి వెళ్లొద్దని హెచ్చరిక
ABN , Publish Date - Oct 10 , 2026 | 08:52 AM
తూర్పుగోదావరి జిల్లా చాగల్లు మండలంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. చిక్కాలపాలెం, అమ్మిగుంట ప్రాంతాల్లో పులి కదలికలు కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. వివరాల్లోకి వెళితే..
తూర్పుగోదావరి, అక్టోబర్ 10: జిల్లాలో పెద్దపులి సంచారం స్థానిక ప్రజలను.. రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. చాగల్లు మండలంలోని చిక్కాలపాలెం, అమ్మిగుంట ప్రాంతాల్లో పులి తిరుగుతున్నట్లు సమాచారం రావడంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.
చిక్కాలపాలెం సమీపంలో పెద్దపులిని గమనించిన స్థానికులు దానిని వెంబడించినట్లు తెలుస్తోంది. దీంతో ఆయా గ్రామాల పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. మరోవైపు.. గత ఐదు రోజులుగా పులి ఎలాంటి వేటాడకపోవడంతో ఆహారం దొరకక నీరసించినట్లు అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు. పులి కదలికలను నిశితంగా పరిశీలిస్తున్న అధికారులు.. దాని ప్రస్తుత పరిస్థితిని అంచనా వేస్తున్నారు. పులి సంచరిస్తున్న ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
పెద్దపులి ప్రస్తుతం నీరసంగా ఉన్నట్లు భావిస్తున్న నేపథ్యంలో దానిని సురక్షితంగా బంధించేందుకు ఇదే అనువైన సమయమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో పులిని పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. పులి కదలికలను గుర్తించడం.. దాని సంచార మార్గాలను పరిశీలించడం వంటి చర్యలపై దృష్టి సారించారు. ముఖ్యంగా పొలాల వద్దకు వెళ్లే రైతులు.. వ్యవసాయ పనుల కోసం బయటకు వెళ్లే కూలీలు మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎవరూ ఒంటరిగా పొలాల్లోకి వెళ్లవద్దని, పులి కనిపించినా దాని దగ్గరకు వెళ్లడం, వెంబడించడం వంటి చర్యలకు పాల్పడవద్దని సూచిస్తున్నారు. అటవీ శాఖ అధికారులు పులిని బంధించే వరకు స్థానికులు అప్రమత్తంగా ఉంటూ అధికారుల సూచనలు పాటించాలని కోరుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఎల్‌నినో ప్రభావం.. 2027 నాటికి భారత్‌లో వంటనూనెల కొరత..
భారత మూలాలున్న మహిళలకు నోబెల్ శాంతి పురస్కారం