Share News

తూ.గో జిల్లాలో పులి సంచారం.. అప్రమత్తంగా ఉండాలని పవన్ కల్యాణ్ ఆదేశాలు

ABN , Publish Date - Oct 10 , 2026 | 03:20 PM

తూర్పు గోదావరి జిల్లా చాగల్లు పరిసర ప్రాంతాల్లో పులి సంచారంపై అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆదేశాలు జారీ చేశారు. చాగల్లు పరిసరాల్లో పులి సంచారంతో అటవీ శాఖ అధికారులను డిప్యూటీ సీఎం అప్రమత్తం చేశారు.

తూ.గో జిల్లాలో పులి సంచారం.. అప్రమత్తంగా ఉండాలని పవన్ కల్యాణ్ ఆదేశాలు
Deputy CM Pawan Kalyan

అమరావతి, అక్టోబర్ 10: తూర్పు గోదావరి జిల్లా చాగల్లు పరిసర ప్రాంతాల్లో పులి సంచారంపై అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆదేశాలు జారీ చేశారు. చాగల్లు పరిసరాల్లో పులి సంచారంతో అటవీ శాఖ అధికారులను డిప్యూటీ సీఎం అప్రమత్తం చేశారు. పులి కదలికలపై ప్రజలకు నిరంతరం సమాచారం అందించాలని ఆదేశించారు. పులిని సురక్షితంగా బంధించేందుకు హనుమాన్‌ బృందాలను మోహరించాలని సూచించారు. పులి కదలికలను నిరంతరం పర్యవేక్షించాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. పులి సంచరిస్తున్న ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.


ప్రజలు ఒంటరిగా పొలాల్లోకి వెళ్లొద్దని డిప్యూటీ సీఎం విజ్ఞప్తి చేశారు. పులిని చూసేందుకు అత్యుత్సాహం ప్రదర్శించవద్దని ప్రజలకు సూచించారు. అటవీ శాఖ అధికారులు జారీ చేసే సూచనలను తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అటవీ శాఖ జోనల్‌ కన్జర్వేటర్‌ పర్యవేక్షణలో పులి పట్టివేత చర్యలు చేపట్టాలని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.


కాగా.. తూర్పుగోదావరి జిల్లా పులి సంచారంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. చాగల్లు మండలంలోని చిక్కాలపాలెం, అమ్మిగుంట ప్రాంతాల్లో పులి సంచారంపై అటవీ అధికారులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే అప్రమత్తమైన ఫారెస్ట్ అధికారులు పులిని బంధించేందుకు యత్నిస్తున్నారు. అయితే చిక్కాలపాలెంలో పులిని గుర్తించిన స్థానికులు దాన్ని వెంబడించినట్లు సమాచారం.


గత ఐదురోజులుగా పులి వేటాడలేదని.. ఆకలితో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఎటువంటి ఆహారం లేకపోవడంతో పులి నీరసంగా ఉందని భావిస్తున్నారు. దీంతో పులిని బంధించేందుకు ఇదే సరైన సమయమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పులిని బంధించడానికి విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. పులి సంచారం నేపథ్యంలో ఒంటరిగా పొలాల్లోకి వెళ్లవద్దని రైతులకు అటవీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.


ఇవి కూడా చదవండి...

వికారాబాద్‌లో దారుణం.. ప్రేమ వేధింపులతో యువతి బలవన్మరణం

‘సర్’పై కాంగ్రెస్ ఆరోపణలను తిప్పికొట్టండి.. నేతలకు రాంచందర్ రావు పిలుపు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 10 , 2026 | 03:33 PM