రంగారెడ్డి జిల్లాలో రూ.2 లక్షల విలువైన ఎండీఎంఏ డ్రగ్స్ పట్టివేత
ABN , Publish Date - Oct 10 , 2026 | 03:55 PM
రంగారెడ్డి జిల్లాలోని షాబాద్‌లో ఎండీఎంఏ డ్రగ్స్ పట్టుబడింది. బెంగళూరు నుంచి డ్రగ్స్‌ను తీసుకొచ్చి షాబాద్‌లో విక్రయించేందుకు యత్నించగా.. పోలీసులు పట్టుకున్నారు.
రంగారెడ్డి, అక్టోబర్ 10: జిల్లాలో షాబాద్‌లో ఎండీఎంఏ డ్రగ్స్ పట్టుబడింది. బెంగళూరు నుంచి డ్రగ్స్‌ను తీసుకొచ్చి షాబాద్‌లో విక్రయించేందుకు యత్నించగా.. పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. షాబాద్ మండలంలోని నాగరగూడ టీ పాయింట్ సమీపంలో డ్రగ్స్ విక్రయిస్తున్నారనే సమాచారంతో పోలీసులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. షాబాద్ పోలీసులు, ఎస్‌ఓటీ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి దాదాపు 13.97 గ్రాముల ఎండీఎంఏ మాదకద్రవ్యాలు, మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేశారు. పట్టుబడిన మాదకద్రవ్యాల విలువ సుమారు రూ.2 లక్షలు ఉంటుందని అంచనా.
నిందితులు పెయింటింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అధిక డబ్బు సంపాదించాలనే ఆశతో బెంగళూరు నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు విచారణలో వెల్లడైంది. మోకిలా, కోకాపేట తదితర ప్రాంతాల్లో అధిక ధరలకు విక్రయించేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. విద్యార్థులు, ఇతర వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
పట్టుబడిన వారు మారం వంశీ రెడ్డి (23), వీర ప్రవీణ్ కుమార్ (28) గా పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ శంకర్‌పల్లి మండలం ఇంద్రారెడ్డి నగర్‌కు చెందినవారిగా తెలిపారు. నిందితులపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ వెల్లడించారు. డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని యువతకు, విద్యార్థులకు సూచించారు. మాదకద్రవ్యాల విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ యోగేష్ గౌతమ్ హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి...
కారుమూరి నాగేశ్వరరావును ప్రశ్నించిన సిట్.. రూ.24 కోట్లపై ఆరా
వికారాబాద్‌లో దారుణం.. ప్రేమ వేధింపులతో యువతి బలవన్మరణం
Read Latest Telangana News And Telugu News