ఎల్‌నినో ప్రభావంతో కృష్ణా పరివాహక ప్రాంతంలో తగ్గిన వర్షాలు
ABN , Publish Date - Jul 24 , 2026 | 10:51 AM
ఎల్‌నినో ప్రభావంతో కృష్ణా పరివాహక ప్రాంతంలో వర్షాలు తగ్గాయని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ కె.నరసింహమూర్తి పేర్కొన్నారు. రాష్ట్రంలో 51శాతం, కృష్ణా డెల్టాలో 49శాతం వర్షపాతం లోటు ఉందని వెల్లడించారు.
అమరావతి, జులై 24 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావంతో కృష్ణా పరివాహక ప్రాంతంలో వర్షాలు తగ్గాయని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ కె.నరసింహమూర్తి పేర్కొన్నారు. రాష్ట్రంలో 51శాతం, కృష్ణా డెల్టాలో 49శాతం వర్షపాతం లోటు ఉందని వెల్లడించారు. ఈరోజు(శుక్రవారం) కృష్ణా డెల్టా నీటి పరిస్థితిపై ఇరిగేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నరసింహమూర్తి మాట్లాడారు. ఎగువ ప్రాజెక్టుల్లో నిల్వ ఉన్న నీరు (కుషన్ నీటి) కారణంగా శ్రీశైలానికి ప్రవాహాలు తగ్గాయని వివరించారు. ఏపీ ప్రభుత్వం తాగునీటికే తొలి ప్రాధాన్యం ఇచ్చిందని వెల్లడించారు. 2027 జూన్ వరకు తాగునీటి అవసరాల కోసం నీటి నిర్వహణ ఉంటుందని తెలిపారు. పులిచింతల నీటిని కూడా తాగునీటి అవసరాల కోసం భద్రపరిచినట్లు వెల్లడించారు.
పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీటి సరఫరా కొనసాగుతోందని చెప్పుకొచ్చారు. గోదావరిలో ప్రవాహాలు తగ్గడంతో పట్టిసీమ పంపింగ్‌పై ప్రభావం పడిందని తెలిపారు. సీలేరు నీటి లభ్యత కూడా తగ్గిందని ప్రస్తావించారు. కృష్ణా డెల్టా సాగుకు అవసరమైన నీటి లభ్యత ప్రస్తుతం లేదని అన్నారు. పట్టిసీమలో అన్ని పంపులను ఒకేసారి నడపడం సాధ్యం కావడం లేదని చెప్పుకొచ్చారు. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల 60 లక్షల మందికి తాగునీటికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు వివరించారు. ఈ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించి తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని అన్నారు. ఆర్‌ఎంసీ నుంచి అనధికారికంగా నీరు తీసుకోవద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు.
అనధికారిక పంపుల వినియోగాన్ని అరికట్టేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఆర్‌ఎంసీ పరిధిలో అన్నదాతలు ప్రస్తుతం వరి సాగు చేయొద్దని సూచించారు. ఈ మధ్యలో నీరు లేక పంట నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. భవిష్యత్తులో నీటి లభ్యత పెరిగితే వ్యవసాయ శాఖతో కలిసి నిర్ణయం తీసుకుంటామని చెప్పుకొచ్చారు. తాగునీటి తర్వాతే ఆరుతడి పంటలకు నీటి కేటాయింపులు చేస్తామని వెల్లడించారు. కృష్ణా డెల్టా పరిధిలో వరికి బదులుగా ఆరుతడి పంటలు సాగు చేయాలని సూచించారు. అసాధారణ పరిస్థితులను రైతులు అర్థం చేసుకుని విజ్ఞతతో వ్యవహరించాలని ఇంజినీర్ ఇన్ చీఫ్ కె.నరసింహమూర్తి విజ్ఞప్తి చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
దేవతా విగ్రహాలపై దుశ్చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు: మంత్రి ఆనం
అమరావతికి ప్రముఖ విద్యాసంస్థలు వస్తున్నాయి: మంత్రి గొట్టిపాటి
భూమన ఆక్రమించిన భూముల స్వాధీనానికి ఏపీ ప్రభుత్వం చర్యలు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News