విద్యార్థులపై లాఠీఛార్జ్ కాదు.. కేంద్రం సమాధానమివ్వాలి: కమల్ హాసన్
ABN , Publish Date - Jul 23 , 2026 | 12:38 PM
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసనలకు ప్రముఖ నటుడు, రాజ్యసభ ఎంపీ కమల్ హాసన్ మద్దతు ప్రకటించారు.
ఇంటర్‌నెట్ డెస్క్, జులై 23 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసనలకు ప్రముఖ నటుడు, రాజ్యసభ ఎంపీ కమల్ హాసన్ (Kamal Haasan) మద్దతు ప్రకటించారు. ప్రశ్నపత్రాల లీక్‌ల వ్యవహారంపై సీజేపీ చేస్తున్న ఆందోళనలపై స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన పోస్టు పెట్టారు.
విద్యార్థులను వ్యవస్థ నిరాశల వైపు నెట్టివేస్తోంది..
‘ఒక బిడ్డ ఏడ్చినప్పుడే మనం వినాల్సింది. కానీ ఎంతోమంది పిల్లలు ప్రాణాలు కోల్పోయే వరకు వేచి చూశాం. నేర్చుకోవడం స్థానంలో శిక్షణ, జిజ్ఞాస స్థానంలో ఆందోళన, ప్రతిభ స్థానంలో నేర ప్రవృత్తి చోటుచేసుకుంది’ అని వ్యాఖ్యానించారు. విద్యార్థులకు సమాధానాలు, అవకాశాలు అందించాల్సిన వ్యవస్థ వారిని అడ్డంకులు, ఒత్తిళ్లు, నిరాశల వైపు నెట్టివేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘పిల్లలకు సమాధానాల బదులుగా అడ్డంకులు, లాఠీలు ఎదురైతే అది ఒక దేశ వైఫల్యానికి సంకేతం’ అని పేర్కొన్నారు.
సోనమ్ వాంగ్‌చుక్.. నిరాహార దీక్షను విరమించండి..
సామాజిక కార్యకర్త, విద్యా సంస్కరణల కోసం పోరాడుతున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను ఉద్దేశించి కమల్ హాసన్ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. ‘దేశానికి రాబోయే ప్రయాణంలో మీ అవసరం ఉంది. దయచేసి మీ నిరాహార దీక్షను విరమించండి’ అంటూ కోరారు.
విద్యార్థుల కలలు ఉన్నతంగా నిలవాలి..
అదేవిధంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన భావోద్వేగ సందేశం ఇచ్చారు. ‘భారతదేశ బిడ్డలారా.. మీరే మాలో ఉత్తములు. మీరు మీ కర్తవ్యాన్ని నెరవేర్చారు. ఇప్పుడు దేశం మీకు తన కర్తవ్యాన్ని నెరవేర్చాల్సిన సమయం వచ్చింది. మీ కలలు ఎల్లప్పుడూ మా వైఫల్యాల కన్నా ఉన్నతంగా నిలవాలి’ అని పేర్కొన్నారు.
జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న నీట్ వ్యతిరేక నిరసనలకు రాజకీయ, సామాజిక వర్గాల నుంచి మద్దతు పెరుగుతున్న నేపథ్యంలో కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. విద్యార్థుల భవిష్యత్తు, విద్యావిధానం, ప్రవేశ పరీక్షలపై జాతీయ స్థాయిలో చర్చ మళ్లీ వేడెక్కుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి...
గుడ్ న్యూస్.. తెలంగాణలో అదనపు ధాన్యం కొనుగోలుకు కేంద్ర ఆమోదం
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో కీలక పరిణామం..
రామచందర్ రావును వెంటనే విడుదల చేయాలి: బండి సంజయ్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News