అక్టోబర్‌లో స్థానిక ఎన్నికలు.. కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యం: మంత్రి లోకేశ్
ABN , Publish Date - Sep 23 , 2026 | 12:03 PM
స్థానిక ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఈరోజు మంత్రులతో లోకేశ్ బ్రేక్‌ఫాస్ట్ సమావేశం నిర్వహించారు.
అమరావతి, సెప్టెంబర్ 23: స్థానిక ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఈరోజు(బుధవారం) మంత్రులతో లోకేశ్ బ్రేక్‌ఫాస్ట్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికలకు అంతా సిద్ధమవ్వాలని.. అన్ని స్థానాల్లో కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలన్నారు. అక్టోబర్‌లో ఎన్నికలు జరుగుతాయని.. స్థానిక ఎన్నికలు జరగవనే అపోహలు ఎవరికీ వద్దని తెలిపారు. కోర్టు పెండింగులో ఉన్నవి కూడా త్వరితగతిన పరిష్కరించుకుని అన్నింటిలో ఎన్నికలు జరిగేలా ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ఎన్నికలు వాయిదా పడాలన్న గొడ్డలి పార్టీ కుయుక్తులు పని చేయవన్నారు. పొత్తుల అంశంపై సమన్వయ కమిటీ, అధిష్ఠానం చర్చించి నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు.
ఓర్వలేకే డీఎస్సీపై తప్పుడు ప్రచారాలు..
విద్యా శాఖను లక్ష్యంగా చేసుకుని ప్రత్యర్ధులు పన్నుతున్న కుట్రల పట్ల తనతోపాటు సంబంధిత మంత్రులూ అప్రమత్తంగా ఉండాలని లోకేశ్ సూచించారు. గురువులపై గూండాలతో దాడులు చేయించే దుశ్చర్యకు గొడ్డలిపార్టీ పాల్పడిందని మండిపడ్డారు. శాప్ కార్యాలయం వద్దకు వచ్చి దాడులకు తెగపడి మీసాలు మెలేసినవారు.. పోలీసులు చట్టప్రకారం కేసులు పెట్టగానే పరారీలో ఉన్నారన్నారు. టీచర్లను కించపరుస్తూ ఎవరైనా దాడులకు పాల్పడితే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. అధికారంలో ఉండి చేసిన అక్రమాలపై ఆధారాలతో ఒక్కో కుంభకోణం బయటకు వస్తుంటే, ఓర్వలేకే డైవర్ట్ రాజకీయాల కోసం నిరుద్యోగులకు మేలు చేసిన డీఎస్సీపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వర్షాలపై..
రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడుతుండటం శుభపరిణామమని లోకేశ్ అన్నారు. వర్షాల వల్ల ప్రజలు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని మంత్రులకు సూచించారు. జలాశయాలు నింపుకునేందుకు ఇదో మంచి అవకాశమని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
తెనాలి రైల్వేస్టేషన్ వద్ద తెగిన విద్యుత్ వైర్లు.. తప్పిన ప్రమాదం
భారీ వర్షాలు.. ఆర్టీసీ అధికారులకు మంత్రి మండిపల్లి ఆదేశాలివే
Read Latest AP News And Telugu News