దేశం మొత్తానిది ఒక దారి.. వైసీపీది మరో దారి: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Apr 03 , 2026 | 01:12 PM
పార్లమెంట్ ఉభయసభల్లోనూ అమరావతికి చట్టబద్ధత లభించడం ప్రజా విజయమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు 5 కోట్ల మంది ప్రజల తరఫున సీఎం కృతజ్ఞతలు తెలిపారు.
అమరావతి, ఏప్రిల్ 2: అమరావతికి చట్టబద్ధత కల్పించడం ప్రజల విజయమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) అన్నారు. శుక్రవారం సీఎం మీడియాతో మాట్లాడుతూ... వైసీపీ అమరావతిని నాశనం చేయాలని చూస్తే తాము శాసనం చేశామని చెప్పుకొచ్చారు. పార్లమెంట్ ఉభయ సభల్లోనూ అమరావతికి చట్టబద్ధత లభించడం ప్రజా విజయమన్నారు. రెండు సభల్లోనూ 35 మంది వరకు ఎంపీలు అమరావతికి మద్దతుగా మాట్లాడారని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు 5 కోట్ల మంది ప్రజల తరఫున సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. దేశం మొత్తానిది ఒక దారైతే... తమదో దారి అన్నట్లు వైసీపీ వ్యవహరించిందని సీఎం విమర్శించారు. రాష్ట్రం, దేశం నాశనమైనా పర్వాలేదు.. తమకు స్వార్థ రాజకీయమే ముఖ్యమన్నట్లుగా వైసీపీ వ్యవహరించిందని ఆరోపించారు.
తెలంగాణకు వ్యతిరేకం కాదు...
తెలంగాణ తన బ్రెయిన్ చైల్డ్ అని.. తెలుగుదేశం పార్టీని అక్కడే స్థాపించినట్టు సీఎం తెలిపారు. తెలంగాణకు తాను వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో ఏడు మండలాలను ఏపీలో కలిపితేనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. తనకున్న అనుభవం, కేంద్ర సహకారంతో ఆ ఏడు మండలాలు ఏపీలో కలిశాయని తెలిపారు. ఆ ఏడు మండలాలు కలిపితేనే పోలవరం సాకారమవుతుందని కేంద్రం గుర్తించిందన్నారు.
ఆనాడు వైసీపీ సమర్థించింది...
శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఆధారంగా గుంటూరు - విజయవాడ మధ్య రాజధాని ఉంటే బాగుంటుందని అందరూ అన్నారని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రం మధ్యలో ఉన్న ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసినట్లు చెప్పారు. ఈ ప్రాంతానికి రాజకీయ, సాంస్కృతిక ప్రాధాన్యం ఉందన్నారు. సమృద్ధిగా నీరు, సారవంతమైన భూములు ఉన్నాయని చంద్రబాబు వివరించారు. ఆనాడు అసెంబ్లీలో వైసీపీ కూడా రాజధానిని సమర్థించిందని... కనీసం 30 వేల ఎకరాలు ఉండాలని జగన్ చెప్పారని తెలిపారు. గుంటూరు - విజయవాడ మధ్యలోనే రాజధానిని ఏర్పాటు చేయాలని ఆనాడు జగన్ అన్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తుచేశారు.
పైసా తీసుకుకోకుండా
‘నా చేతిలో డబ్బులు లేవు.. కానీ నూతన రాజధాని నిర్మించాలనే సంకల్పం ఉంది’ అని సీఎం చెప్పారు. భూ సమీకరణ విధానం ప్రకటించిన వెంటనే రైతులు ముందుకు వచ్చి కేవలం నమ్మకం మీదనే నయా పైసా తీసుకోకుండా 34 వేల ఎకరాలు త్యాగం చేశారని సీఎం గుర్తు చేశారు. 11 నెలల్లో సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు నిర్మించామని తెలిపారు. తాను ట్రాన్సిట్ సచివాలయం అన్నా వైసీపీ దాన్ని కూడా రాద్ధాంతం చేసిందని.. అంటే వాళ్ల నైజం ఏమిటో అర్థమవుతుందని వ్యాఖ్యానించారు. అమరావతికి పవిత్రత ఉందని, అన్ని పవిత్ర దేవాలయాల నుంచి మట్టి, నీరు తీసుకొచ్చి అమరావతిని పునీతం చేశామని చంద్రబాబు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా పార్లమెంట్‌లో మట్టి, యమునా నది నుంచి నీరు తీసుకొచ్చారని గుర్తు చేశారు.
భగవంతుడు రెండు అవకాశాలిచ్చారు...
‘నేను ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాను... వైసీపీ మాత్రం కుట్రలు చేస్తూ ముందుకు వెళ్లింది. స్మశానం, ఎడారి అని, నిర్మాణాలకు పనికిరాదని ప్రచారం చేసింది. ప్రపంచ బ్యాంకుకు ఉత్తరాలు రాశారు. వరద వస్తే మునిగిపోతుందని భయపెట్టారు. మూడు రాజధానులు అని మూడు ముక్కలాట ఆడారు’ అని విమర్శించారు. తన రాజకీయ జీవితంలో ఇటువంటి వారిని ఎప్పుడూ చూడలేదన్నారు. అయినా 2024 ఎన్నికల్లో ప్రజలు తిరుగులేని తీర్పు ఇచ్చి అమరావతే రాజధాని అని స్పష్టం చేశారని తెలిపారు. భగవంతుడు తనకు రెండు అవకాశాలు ఇచ్చారని... హైదరాబాద్, సికింద్రాబాద్‌తో పాటు సైబరాబాద్‌ను యాడ్ చేశానని.. ఇప్పుడు అమరావతిని తీర్చిదిద్దే బాధ్యత వచ్చిందని అన్నారు. వైసీపీ అమరావతి బ్రాండ్‌ను దెబ్బతీసే ప్రయత్నం చేసిందని విమర్శించారు. అమరావతి బాండ్లు రెండు గంటల్లో అమ్ముడుపోయాయని.. అంటే అమరావతి బ్రాండ్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎంత ఆదరణ ఉందో అర్థమవుతోందని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
స్వీట్స్ తినిపించిన సీఎం..
అమరావతికి చట్టబద్ధత కల్పించడంపై సీఎం చంద్రబాబును మీడియా ప్రతినిధులు అభినందించారు. ఇది చాలా గర్వించదగిన క్షణాలని, అమరావతి అంటే ఎమోషన్ అని సీఎం అన్నారు. ఆనందంలో తాను కూడా స్వీట్ తింటానని చెప్పి స్వీట్ తిన్నారు సీఎం. అందరికీ స్వయంగా సీఎం చంద్రబాబు స్వీట్స్ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి...
ఏసుక్రీస్తు సందేశం అందరికీ ఆదర్శం: సీఎం చంద్రబాబు
జగన్.. అమరావతిని ఇంచు కూడా కదపలేరు: గంటా శ్రీనివాసరావు
Read Latest AP News And Telugu News