Share News

అన్ని శాఖలకు ముఖ్యమంత్రే మంత్రిగా ఉండటం మన కర్మ: కవిత

ABN , Publish Date - Apr 03 , 2026 | 12:25 PM

సీబీఎస్సీ సెంట్రల్ సిలబస్ ఉన్న స్కూల్స్‌లో 25 నుంచి 30 శాతం ఫీజులు పెంచి ఇప్పటి నుంచే వసూలు చేస్తున్నారని కవిత తెలిపారు. ప్రత్యేక అసెంబ్లీ నిర్వహించి ఫీజు నియంత్రణ చట్టం వెంటనే తీసుకురావాలని డిమాండ్ చేశారు.

అన్ని శాఖలకు ముఖ్యమంత్రే మంత్రిగా ఉండటం మన కర్మ: కవిత
Kalvakuntla Kavitha

హైదరాబాద్, ఏప్రిల్ 3: రాష్ట్రంలో స్కూల్ ఫీజుల గొడవ నడుస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో 39,640 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయని తెలిపారు. వీటిలో 12,061 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయన్నారు. సీబీఎస్సీ సెంట్రల్ సిలబస్ ఉన్న స్కూల్స్‌లో 25 నుంచి 30 శాతం ఫీజులు పెంచి ఇప్పటి నుంచే వసూలు చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఫీజు నియంత్రణ చట్టం చేయాలని రేవంత్ రెడ్డి పదే పదే మాట్లాడారని గుర్తుచేశారు. ఎవరెంత తిన్నారంటూ అసెంబ్లీలో చర్చ చేసుకున్నారే తప్ప ఫీజుల నియంత్రణపై మాట్లాడలేదని విమర్శించారు.


ప్రత్యేక అసెంబ్లీ నిర్వహించి ఫీజు నియంత్రణ చట్టం వెంటనే తేవాలని కవిత డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలన్నారు. ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు ఫీజులను పెంచుతున్నాయే తప్ప టీచర్లకు మాత్రం జీతాలు పెంచరని విమర్శించారు. ప్రైవేట్ కాలేజీల్లో ఆహార నాణ్యతను ప్రభుత్వం పట్టించుకోదా అని ప్రశ్నించారు. ప్రైవేట్ పాఠశాలలు, ఆసుపత్రులను సీఎం ప్రారంభిస్తున్నారని... వాళ్ళ దోపిడిని ఎంకరేజ్ చేస్తున్నారా అంటూ నిలదీశారు.


ప్రైవేట్ స్కూల్స్ దోపిడీని కంట్రోల్ చేయాలని ప్రభుత్వాన్ని కవిత డిమాండ్ చేశారు. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే స్కూల్స్ ముందు ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ‘అన్ని శాఖలకు ముఖ్యమంత్రే మంత్రిగా ఉండటం మన కర్మ’ అంటూ వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో తనను నిజామాబాద్‌కు పరిమితం చేశారని అన్నారు. ఆంధ్రా, నార్త్ ఇండియా వాళ్ళు ఇక్కడ విద్యా సంస్థలు నెలకొల్పినా తెలంగాణ వాళ్ళకే అవకాశం ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు.


ఇవి కూడా చదవండి...

బైక్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ముగ్గురి మృతి

గ్రూప్‌-1 నియామకాలపై సుప్రీంకోర్టు తీర్పు.. సీఎం రేవంత్ స్పందన

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 03 , 2026 | 12:57 PM