బైక్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ముగ్గురి మృతి
ABN , Publish Date - Apr 03 , 2026 | 10:42 AM
అనకాపల్లి జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో ముగ్గురు యువకులు మృతి చెందారు.
అనకాపల్లి జిల్లా, ఏప్రిల్ 3: అనకాపల్లి జిల్లాలో అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఎలమంచిలి మండలం పోతిరెడ్డిపాలెం జంక్షన్ వద్ద రాత్రి 12 గంటల ప్రాంతంలో ద్విచక్ర వాహనాన్ని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు అనకాపల్లికి తరలిస్తుండగా చనిపోయారు. మృతి చెందిన ముగ్గురు యువకులు ఎలమంచిలి మండలం పురుషోత్తపురం గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు.
మృతులు బంగారు నాని(24), గోవిందు (25) , పోతిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన బంగారి దుర్గాప్రసాద్(16)గా గుర్తించారు. మృతుల్లో ఇద్దరు పెయింటింగ్ పనులు చేసుకోగా, మరో యువకుడు చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువకుల మృతి సమాచారాన్ని కుటుంబసభ్యులకు తెలియజేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
ఇవి కూడా చదవండి...
పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు.. పేర్ని నానిపై కేసు
ఎన్టీఆర్ జిల్లాలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి
Read Latest AP News And Telugu News