Share News

కడపలో ప్రమాదం.. బోల్తా పడిన LPG ట్యాంకర్

ABN , Publish Date - May 27 , 2026 | 09:42 AM

కడప జిల్లాలో ఎల్‌పీజీ గ్యాస్ ట్యాంకర్ బోల్తాపడింది. ఈ ప్రమాదం కారణంగా రాయచోటి – కడప ప్రధాన రహదారిపై రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. గువ్వల చెరువు ఘాట్‌లోని ఐదో మలుపు వద్ద ఎల్‌పీజీ గ్యాస్ ట్యాంకర్ అదుపుతప్పి రోడ్డుకు అడ్డంగా బోల్తా పడింది.

కడపలో ప్రమాదం.. బోల్తా పడిన LPG ట్యాంకర్
Kadapa Accident

కడప జిల్లా, మే 27 (ఆంధ్రజ్యోతి): కడప జిల్లాలో ఎల్‌పీజీ గ్యాస్ ట్యాంకర్ బోల్తాపడింది. ఈ ప్రమాదం కారణంగా రాయచోటి – కడప ప్రధాన రహదారిపై రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. గువ్వల చెరువు ఘాట్‌లోని ఐదో మలుపు వద్ద ఎల్‌పీజీ గ్యాస్ ట్యాంకర్ అదుపుతప్పి రోడ్డుకు అడ్డంగా బోల్తా పడింది. దీంతో రాయచోటి – కడప మార్గంలో వాహనాల రాకపోకలను పోలీసులు పూర్తిగా నిలిపివేశారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అప్రమత్తమై ట్రాఫిక్‌ను మళ్లించారు. రాయచోటి నుంచి వెళ్లే వాహనాలను చక్రాయపేట మార్గం మీదుగా దారి మళ్లిస్తున్నారు. ఘటనాస్థలిలో భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.


బోల్తాపడిన గ్యాస్ ట్యాంకర్‌ను తొలగించేందుకు ఉదయం నుంచే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మూడు భారీ క్రేన్ల సహాయంతో ట్యాంకర్‌ను పైకి లేపే ప్రయత్నాలు చేశారు. అయితే ఈ ప్రక్రియలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. ట్యాంకర్‌ను పైకి లేపే సమయంలో మూడు క్రేన్లు కూడా ఒక్కసారిగా నేలకొరిగాయి. దీంతో సహాయక సిబ్బంది మరింత అప్రమత్తమయ్యారు.


ఇదిలా ఉండగా, ట్యాంకర్ నుంచి ఎల్‌పీజీ గ్యాస్ లీక్ అవుతుండటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గ్యాస్ లీకేజీ కారణంగా సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. ఎలాంటి అగ్నిప్రమాదం జరగకుండా అధికారులు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఘటనాస్థలికి అగ్నిమాపక సిబ్బంది, పోలీసు బలగాలు చేరుకుని పరిసర ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్నారు. ఈ ఘటనతో రాయచోటి – కడప రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలు ఉపయోగించాలని అధికారులు సూచిస్తున్నారు. గ్యాస్ లీకేజీ పూర్తిగా నియంత్రణలోకి వచ్చిన తర్వాతే ట్యాంకర్ తొలగింపు ప్రక్రియను వేగవంతం చేయనున్నట్లు అధికారులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి...

స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలపై సీఎం చంద్రబాబు సమీక్ష.. వ్యవసాయ అనుబంధ రంగాలపై కీలక చర్చ

కరెంట్ సమస్యల పరిష్కారానికి 1912 టోల్ ఫ్రీ నెంబర్: మంత్రి గొట్టిపాటి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 27 , 2026 | 09:47 AM