Share News

రీల్స్ కోసం బైక్‌‌పై స్టంట్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

ABN , Publish Date - Feb 05 , 2026 | 12:17 PM

కడప నగర శివారులో సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ ప్రమాదానికి గురయ్యాడో యువకుడు. ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో యువకుడికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

రీల్స్ కోసం బైక్‌‌పై స్టంట్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Kadapa Bike Stunt Accident

కడప, ఫిబ్రవరి5 (ఆంధ్రజ్యోతి): సోషల్ మీడియాలో వ్యూస్, లైకుల కోసం యువత ఇటీవల చేస్తున్న సాహసాలు వారి ప్రాణాల మీదకు తెస్తున్నాయి. వేగంగా వెళ్లే బైక్‌లపై నిలబడటం, కాళ్లతో రోడ్డును రాపిడి చేయడం(స్కేటింగ్), చేతులు వదిలేసి వాహనం నడపడం వంటివి.. ప్రమాదాలకు కారణమవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి కడప జిల్లాలో జరిగింది. నగర శివారులోని ఎయిర్‌పోర్ట్ రోడ్డు విశాలంగా ఉండటంతో యువత తరచూ ఇక్కడ స్టంట్లు చేయడానికి ప్రయత్నిస్తుంటారు.


ఈ క్రమంలోనే ముబారక్(20) అనే యువకుడు నిన్న(బుధవారం) తన స్నేహితుడితో కలిసి స్కూటీపై వెళ్తూ.. రీల్స్ కోసం స్కేటింగ్ స్టంట్లు చేసేందుకు యత్నించాడు. ఈ క్రమంలో వాహనం అదుపుతప్పి అతడు కిందపడిపోయాడు. ముబారక్‌కు తీవ్రమైన గాయాలవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో యువకుడికీ తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో సదరు యువకుణ్ని మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని ఓ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


పోలీసుల హెచ్చరిక..

ఎయిర్‌పోర్ట్ రోడ్డు వంటి నిర్మానుష్య ప్రాంతాల్లో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నప్పటికీ.. యువత అర్ధరాత్రి సమయాలను ఎంచుకుని ఇలాంటి విన్యాసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ప్రమాదాల్లో తలకు తగిలే దెబ్బలే మరణానికి ప్రధాన కారణమవుతున్నాయని పోలీసులు తెలిపారు. రోడ్లు ఖాళీగా ఉన్నాయని అతివేగంతో వెళ్లడం, విన్యాసాలు చేయడం ప్రాణాంతకమని పోలీసులు హెచ్చరించారు. సోషల్ మీడియాలో రీల్స్‌కు వచ్చే లైకుల కంటే నిజ జీవితంలో మన ప్రాణం, కుటుంబం ముఖ్యమన విషయాన్ని యువత గుర్తించాలని పోలీసులు సూచిస్తున్నారు. సోషల్ మీడియాలో రీల్స్ చేయడం కోసం స్టంట్‌లు చేస్తున్నారని.. ఆయా ఘటనలలో యువత విలువైన ప్రాణాలు కోల్పోతున్నారని పోలీసులు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని కడప జిల్లా పోలీసులు స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పంచాయతీరాజ్ ఉద్యోగి ఆస్తులపై ఏసీబీ రైడ్స్.. ఇరు తెలుగు రాష్ట్రాల్లో సోదాలు..

రాజమండ్రిలో పెద్ద పులి భయం.. ఫారెస్ట్ బృందం చర్యలు

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 05 , 2026 | 12:33 PM