ఆంధ్రజ్యోతి కార్యాలయాల వద్ద ఆందోళనకు వైసీపీ ప్లాన్.. పోలీసుల బందోబస్తు
ABN , Publish Date - Apr 08 , 2026 | 10:07 AM
ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీడియా సంస్థల కార్యాలయాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని వైసీపీ నిరసనలకు పిలుపునివ్వడంతో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.
విజయవాడ, రాజమండ్రి, అనంతపురం, కడప, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీడియా సంస్థల కార్యాలయాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి (ABN Andhrajyothy) కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని వైసీపీ (YSR Congress Party) ఈరోజు (బుధవారం) కూడా నిరసనలకు పిలుపునివ్వడంతో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. రాజమండ్రి నుంచి అనంతపురం, విజయవాడ, కడప వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ముందస్తు చర్యలతో పరిస్థితిని అదుపులో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు.
రాజమండ్రిలో..
రాజమండ్రిలోని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద వైసీపీ నేతలు ఆందోళనకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో పోలీసులు ముందస్తు జాగ్రత్తగా కార్యాలయం పరిసరాల్లో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏమైనా అల్లర్లు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
అనంతపురంలో ఉద్రిక్తత..
అనంతపురంలో కూడా ఇదే తరహా పరిస్థితి నెలకొంది. కమలానగర్‌లో ఉన్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం ఎదుట నిరసనకు వైసీపీ నేతలు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో నిరసన తెలపాలని సిద్ధమయ్యారు. ఈ నిరసనకు పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఏబీఎన్ కార్యాలయం ఎదుట పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత కల్పించారు.
విజయవాడలో భారీ భద్రత..
విజయవాడలోని ముస్తాబాద్ రోడ్‌లో ఉన్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ నాయకులు నిరసన చేపట్టనున్నట్లు ముందుగానే ప్రకటించారు. హైదరాబాద్‌లో నిన్న(మంగళవారం) ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడి నేపథ్యంలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ముందస్తుగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యాలయం పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రత కొనసాగుతోంది.
కడపలో అప్రమత్తం..
కడపలో కూడా పోలీసులు అప్రమత్తమయ్యారు. మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) సొంత జిల్లా కావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఏబీఎన్, ఆంధ్రజ్యోతి కార్యాలయాల వద్ద నేడు కూడా వైసీపీ నిరసన, ధర్నాలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. ముందస్తుగా కడపలో వైసీపీ ముఖ్య నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కడపలో ముందస్తుగా ఎస్పీ నచికేత్ విశ్వనాథన్ చర్యలు చేపట్టారు. కడప నగరంలో వైసీపీ ముఖ్య నాయకులను హౌస్ అరెస్టు చేశారు. వారిలో మాజీ మంత్రి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ భాష , మాజీ మేయర్లు సురేశ్ బాబు, పాకా సురేశ్, మరి కొంతమంది వైసీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
ఏపీలో ఆగని వైసీపీ అరాచకాలు..
ఏపీలో వైసీపీ నేతల అరాచకాలు ఆగడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా నేడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయాలు వద్ద ఆందోళన చేయాలని వైసీపీ హైకమాండ్ పిలుపునిచ్చింది. నిన్న(మంగళవారం) హైదరాబాద్‌లో ఏబీఎన్ ప్రధాన కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లిన వైసీపీ నేతలు దాడికి దిగారు. వాస్తవాలను వక్రీకరించి వైసీపీ నేతలు విష ప్రచారం చేస్తున్నారు. మావిగన్‌పై వచ్చిన వ్యతిరేకత నుంచి బయటపడేందుకు జగన్ అండ్ కో డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరదీశారు. ఇందులో భాగంగానే ఈ రోజు ఏపీలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయాల ఎదుట ఆందోళనకు వైసీపీ హైకమాండ్ పిలుపునిచ్చింది. జగన్ మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో వైసీపీ నేతలు మహిళలను దారుణంగా అవమానించారు. ఏపీ రాజధాని అమరావతి మహిళలపై అసభ్యకర పదజాలాన్ని వైసీపీ నేతలు ఉపయోగించారు. ఏకంగా నాటి ప్రతిపక్షనేత, నేటి సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని అసెంబ్లీ సాక్షిగా నాటి వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు అవమానించారు. మహిళలకు అవమానం జరిగిందంటూ కొందరు వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలతో రెచ్చిపోయారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై దాడులు తగవు.. వైసీపీపై పవన్ కల్యాణ్ ధ్వజం
నిజాలు మాట్లాడితే భౌతిక దాడులా.. వైసీపీపై రామ్మోహన్ ధ్వజం
ఉన్నత విద్యపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్.. అధికారులకు కీలక ఆదేశాలు
Read Latest AP News And Telangana News And International News And Telugu News