Share News

ఇది నా ఇల్లు.. అంజలి పెళ్లికి మరో వేదిక చూసుకో.. షర్మిలకు జగన్ లేఖ

ABN , Publish Date - Oct 24 , 2026 | 05:14 PM

కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూతురు అంజలి వివాహం నేపథ్యంలో వైసీపీ అధినేత , మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓ లేఖ రాశారు. ఈ లేఖలో పలు విషయాలను జగన్ ప్రస్తావించారు.

ఇది నా ఇల్లు.. అంజలి పెళ్లికి మరో వేదిక చూసుకో.. షర్మిలకు జగన్ లేఖ
YS Jagan Mohan Reddy

అమరావతి, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) కూతురు అంజలి వివాహం నేపథ్యంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ఓ లేఖ రాశారు. ఈ లేఖలో పలు విషయాలను జగన్ ప్రస్తావించారు. అంజలి పెళ్లి గురించి తెలిసి తనకు చాలా సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. గత ఏడేళ్లుగా మన మధ్య ఎన్ని పరిణామాలు జరిగినా, అంజలి జీవితాంతం సంతోషంగా, ప్రేమానురాగాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని పేర్కొన్నారు. తన అభ్యంతరాలను పట్టించుకోకుండా బెంగళూరులోని తన నివాసంలోనే పెళ్లి నిర్వహించాలని షర్మిల భావిస్తున్నట్లుగా తన దృష్టికి వచ్చిందని తెలిపారు. ఇది తన ఇల్లు.. అంజలి పెళ్లికి మరో వేదిక చూసుకోవాలని సూచించారు.


భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతాయి..

‘నేను నివసిస్తున్న ప్రాంగణంలో పెళ్లి నిర్వహించడం వల్ల తీవ్రమైన భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతాయి. ఈ విషయాన్ని ఇప్పటికే వివిధ వ్యక్తుల ద్వారా నీకు తెలిపాను. పెళ్లి వంటి కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తారు. క్యాటరింగ్‌, డెకరేషన్‌, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సిబ్బంది, ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు, అతిథులు ఇలా ఎంతోమంది ప్రాంగణంలోకి వస్తారు. వీరిలో చాలామంది మనకు కనీసం పరిచయం కూడా లేని వ్యక్తులే. ఇంతమంది నివాస ప్రాంగణంలోకి రాకపోకలు సాగించడం వల్ల తీవ్రమైన భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతాయి. నివాస ప్రాంగణానికి, చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు బయటకు వెళ్లడం భద్రతాపరమైన ఆందోళనలకు దారితీస్తుంది. ఈ నిర్ణయం తీసుకోవడం నాకు అంత సులభం కాదు. అంజలిని నేను చిన్నప్పటి నుంచి దగ్గరుండి చూశాను. ఆమెకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను. అయినప్పటికీ భద్రతకు, వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన ముప్పులను ఏమాత్రం విస్మరించలేను. హర్ష లేదా వర్ష పెళ్లి అయినా కూడా నేను ఇదే నిర్ణయం తీసుకునేవాడిని. ప్రస్తుతం నేను ఇక్కడే నివసిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం వల్ల అనవసరంగా అందరి దృష్టి ఈ నివాసంపై పడుతుంది. చివరకు ఇది నా ఇల్లు. ఇక్కడ నేను, నా కుటుంబం సురక్షితంగా ఉండేలా చూసుకోవాలనుకుంటున్నాను. భద్రతకు, వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన ఆందోళనలను ఇప్పటికే నీకు తెలిపా. నా అభ్యంతరాలను పట్టించుకోకుండా ముందుకు వెళ్లడం నన్ను బాధించింది. ఈ విషయంలో నా పరిస్థితిని, అభిప్రాయాన్ని మరోసారి పరిగణనలోకి తీసుకుని వివాహం కోసం మరో వేదికను ఎంచుకోవాలని కోరుతున్నాను. రాజా పెళ్లికి చేసినట్లుగా కన్వెన్షన్‌ సెంటర్‌, డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ వేదికలో గానీ పెళ్లి నిర్వహించుకోవచ్చు. అలాంటి వేదికలు ఇష్టం లేకపోతే హైదరాబాద్‌లోని నా లోటస్‌ పాండ్‌ ఆస్తిని పెళ్లికి ఉపయోగించుకోవడానికి కూడా అవకాశం ఇచ్చాను. లోటస్‌ పాండ్‌ ఆస్తిని ఉపయోగించుకోవడానికి ఇచ్చిన ప్రతిపాదన ఇప్పటికీ అలాగే ఉంది. అంజలి పెళ్లి ఆమె జీవితంలో ఒక ప్రత్యేకమైన రోజుగా నిలిచిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భవిష్యత్తులో ఆ రోజును ఆమె ఎంతో ఆనందంగా గుర్తుచేసుకోవాలని ఆశిస్తున్నాను. అందుకోసం సహేతుకంగా నేను చేయగలిగిన ప్రతి ప్రయత్నం చేయాలనుకుంటున్నాను. ఈ విషయంలో నువ్వు కూడా నా దృక్కోణాన్ని అర్థం చేసుకోవాలని కోరుతున్నాను’ అని లేఖలో జగన్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు.. అధికారులకు ఎస్‌ఈసీ కీలక ఆదేశాలు

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి భారీ వర్ష సూచన

స్థానిక ఎన్నికల్లో నామినేషన్లు, ఏకగ్రీవాలపై వైసీపీ ఫేక్ ప్రచారాలు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Oct 24 , 2026 | 05:34 PM