Share News

వైఎస్ జగన్ కేసుల విచారణ వేగవంతం చేయాలి: మంత్రి కొల్లు రవీంద్ర

ABN , Publish Date - Oct 11 , 2026 | 02:47 PM

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌ ఆర్థిక నేరాల కేసుల విచారణను వేగవంతం చేసి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని కేంద్ర దర్యాప్తు సంస్థలను గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు.

వైఎస్ జగన్ కేసుల విచారణ వేగవంతం చేయాలి: మంత్రి కొల్లు రవీంద్ర
AP Minister Kollu Ravindra

అమరావతి, అక్టోబర్ 11: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌ ఆర్థిక నేరాల కేసుల విచారణను వేగవంతం చేసి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని దర్యాప్తు సంస్థలను గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు. వైఎస్ జగన్‌పై ఉన్న ఆర్థిక నేరాల కేసుల నుంచి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. కేసుల విచారణ ఆలస్యమైనా తప్పు చేసినవారు చట్టం నుంచి తప్పించుకోలేరని అన్నారు. ఆదివారం రాజధాని అమరావతిలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. వాస్తవాలను పక్కదారి పట్టించి రాజకీయ లబ్ధి పొందడమే జగన్‌ నీతి అని అభివర్ణించారు.


షెల్‌ కంపెనీల ద్వారా నిధుల మళ్లింపుపై విచారణ వేగవంతం కావాలని ఆకాంక్షించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును టీడీపీ అధినేత, సీఎం నారా చంద్రబాబు నాయుడుకు ఆపాదించేలా గతంలో ప్రచారం చేశారని గుర్తు చేశారు. ఈ కేసులో నాలుగు వేలకు పైగా డిశ్చార్జ్‌ పిటిషన్లతో విచారణను కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ సొంత మీడియాలో అసత్య కథనాలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు.


ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) స్వతంత్ర దర్యాప్తు సంస్థ అని గుర్తు చేశారు. సీబీఐ కేసులు ఉన్నంత మాత్రాన ఈడీ విచారణ ఆగదని స్పష్టం చేశారు. ఈడీ విచారణకు రాజకీయ రంగు పులమడం సరికాదని అన్నారు. డబ్బుంటే కేసులను మాఫీ చేసుకోవచ్చా?.. విచారణను సాగదీయవచ్చా? అని ఆయన సందేహం వ్యక్తం చేశారు. వ్యక్తిగత హాజరుపై నిర్ణయం తీసుకునేది న్యాయస్థానాలే అని.. ప్రభుత్వానికి సంబంధం ఏమిటి? అని వైసీపీ నేతలను ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర నిలదీశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక కార్యాచరణ: పవన్ కల్యాణ్

తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ సిబ్బందికి ప్రమాదం

For More AP News And Telugu News

Updated Date - Oct 11 , 2026 | 03:59 PM