దాడులు చేసి మీడియాను బెదిరించాలనుకోవడం సరైంది కాదు.. వైసీపీపై మంత్రి టీజీ భరత్ ధ్వజం
ABN , Publish Date - Apr 07 , 2026 | 04:09 PM
హైదరాబాద్‌లో ఏబీఎన్- ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ నేతలు దాడి ప్రయత్నాన్ని మంత్రి టీజీ భరత్, ఎంపీలు సానా సతీశ్, విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్ తీవ్రంగా ఖండించారు. వైసీపీ నేతలు ఇప్పటికైనా వారి తీరు మార్చుకోవాలని హితవు పలికారు.
అమరావతి, విశాఖపట్నం, ఢిల్లీ, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో ఏబీఎన్- ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ నేతల దాడి ప్రయత్నాన్ని మంత్రి టీజీ భరత్, ఎంపీలు సానా సతీశ్, విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్ తీవ్రంగా ఖండించారు. వైసీపీ నేతలు ఇప్పటికైనా వారి తీరు మార్చుకోవాలని హితవు పలికారు.
ప్రజాస్వామ్య పద్ధతిలో ఎదుర్కోవాలి: మంత్రి టీజీ భరత్ గుప్తా
హైదరాబాద్‌లో ఏబీఎన్- ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ నేతల దాడిని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా తీవ్రంగా ఖండించారు. వార్తలు నచ్చకపోతే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎదుర్కోవాలని అన్నారు. దాడులు చేసి మీడియాను బెదిరించాలనుకోవడం సరైంది కాదని చెప్పుకొచ్చారు. వైసీపీ నాయకులు ఇకనైనా ధోరణి మార్చుకోవాలని హితవు పలికారు.
నిజాన్ని నిర్భయంగా చెబుతున్నందుకే ఏబీఎన్‌పై దాడులు: ఎంపీ సానా సతీశ్
హైదరాబాద్‌లోని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ శ్రేణులు దాడి చేయడం దుర్మార్గమని టీడీపీ ఎంపీ సానా సతీశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో సానా సతీశ్ మీడియాతో మాట్లాడారు. పత్రికా స్వేచ్ఛపై దాడి.. ఏబీఎన్ ఆఫీస్‌పై గూండాగిరీని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులే దగ్గరుండి రౌడీ మూకలతో దాడులు చేయించడం సిగ్గుచేటన్నారు. నిజాన్ని నిర్భయంగా చెబుతున్నందుకే ఆంధ్రజ్యోతిని లక్ష్యంగా చేసుకొని వైసీపీ నేతలు దాడులకు తెగబడ్డారని ఆగ్రహించారు. అమరావతి కుట్రలను ఆధారాలతో ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక భౌతిక దాడులు చేస్తారా అని ఫైర్ అయ్యారు. ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణకి అండగా ప్రజాస్వామ్యవాదులంతా ఉన్నారని.. ఎన్ని అణిచివేతలు ఉన్నా నిజం ఆగదని అన్నారు. ప్రజాస్వామ్యంలో గూండాగిరీకి తావులేదని.. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పత్రికా స్వేచ్ఛను హరిస్తున్న వైసీపీ.. భౌతిక దాడులతో నిజాలను అణచివేయలేరని ఎంపీ సానా సతీశ్ హెచ్చరించారు.
వైసీపీ నేతలు ఇప్పటికైనా మారాలి: ఎంపీ శ్రీభరత్
జగన్ అండ్ కోపై తెలుగుదేశం విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ఏబీఎన్- ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ నేతల దాడిని తీవ్రంగా ఖండించారు. ఈరోజు విశాఖపట్నంలో మీడియాతో ఎంపీ శ్రీభరత్ మాట్లాడారు. 39 శాతం ఓటు బ్యాంకు ఉండి, ప్రతిపక్షమని చెప్పుకునే వైసీపీ నేతలు ఇలాగే మాట్లాడితే ప్రజలు హర్షించరని అన్నారు. వైసీపీ నేతలు ఇప్పటికైనా మారాలని హితవు పలికారు. మొన్న ఏపీలో ఆపహాస్యం అయ్యారని, ఇప్పుడు దేశ వ్యాప్తంగా జగన్ అండ్ కో అపహాస్యం అయ్యారని ఎంపీ శ్రీభరత్ ఎద్దేవా చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఫ్యాక్షన్ బెదిరింపులకు భయపడే వ్యక్తి రాధాకృష్ణ కాదు: మంత్రి లోకేశ్
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ దాడిని ఖండించిన సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telangana News And International News And Telugu News