Minister Narayana: అమరావతి అభివృద్ధిలో మరో కీలక అడుగు.. కొత్త పనులకు గ్రీన్ సిగ్నల్
ABN , Publish Date - Jan 13 , 2026 | 12:13 PM
అమరావతిలో పలు ప్రాజెక్టులకు ల్యాండ్ పూలింగ్ జరుగుతోందని మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. అమరావతి మండలంలోని 3 గ్రామాల్లో మొదటి రోజే 1000 ఎకరాలు పూలింగ్‌కు ఇచ్చారని పేర్కొన్నారు..
అమరావతి, జనవరి13 (ఆంధ్రజ్యోతి): అమరావతిలో పలు ప్రాజెక్టులకు ల్యాండ్ పూలింగ్ జరుగుతోందని ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ (Minister Narayana) వ్యాఖ్యానించారు. అమరావతి మండలంలోని 3 గ్రామాల్లో మొదటి రోజే 1000 ఎకరాలు పూలింగ్‌కు ఇచ్చారని పేర్కొన్నారు. అంటే మూడు గ్రామాల్లో 25 శాతం ల్యాండ్ పూలింగ్ పూర్తైందని చెప్పుకొచ్చారు. అమరావతి మండలం కర్లపూడిలో మంగళవారం రోడ్డు పనులకు మంత్రి నారాయణ, ఎమ్మెల్యే బాష్యం ప్రవీణ్ శంకుస్థాపన చేశారు. నిన్న ల్యాండ్ పూలింగ్ ప్రారంభానికి వెళ్లిన మంత్రిని రోడ్డు వేయాలని రైతులు కోరారు. రైతులు అడిగిన వెంటనే రోడ్డు నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేయించి.. కాంట్రాక్ట్ సంస్థకు పనులు అప్పగించారు. కర్లపూడి నుంచి అనంతవరం వరకు.. 2.9 కిలోమీటర్ల రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. వారం రోజుల్లో రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని కాంట్రాక్ట్ సంస్థకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
స్పోర్ట్స్ సిటీ అవసరం..
భూములిచ్చిన రైతులను తాను ప్రత్యేకంగా అభినందిస్తున్నానని అన్నారు. ఎమ్మెల్యే ప్రవీణ్ దగ్గరుండి రైతులను ఒప్పిస్తున్నారని తెలిపారు. అమరావతి అభివృద్ధి జరగాలంటే ఇన్నర్ రింగ్ రోడ్డు, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ అవసరమని చెప్పుకొచ్చారు. నెల రోజుల్లోగా 80 శాతం భూమి ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకుంటానని ఎమ్మెల్యే ప్రవీణ్ చెప్పారని అన్నారు. 80 శాతం పూలింగ్ పూర్తి కాగానే మాస్టర్ ప్లాన్ డిజైన్ చేసి, టెండర్లు పిలుస్తామని వెల్లడించారు. రైతులకు ఇచ్చే ప్లాట్‌లలో ముందుగా రెండు వరుసల రోడ్డు పూర్తి చేస్తామని తెలిపారు. కర్లపూడిలో 3.9 కిలోమీటర్ల రోడ్డు బాగోలేదని నిన్న గ్రామ సభలో అడిగారని అన్నారు. వెంటనే రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశామని.. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేస్తామని మంత్రి నారాయణ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
అనంతపురంలో భారీ అగ్నిప్రమాదం.. ఏం జరిగిందంటే...
ప్రభుత్వ లాంఛనాలతో గుండ అప్పల సూర్యనారాయణ అంత్యక్రియలు.. సీఎం ఆదేశాలు..
Read Latest AP News And Telugu News