అనంతబాబు కేసులో సుప్రీం కోర్టు వ్యాఖ్యలు బాధితులకు ధైర్యం ఇచ్చాయి: న్యాయవాది ముప్పాళ్ల
ABN , Publish Date - Feb 20 , 2026 | 03:40 PM
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై ఈ రోజు (శుక్రవారం) సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్‌పై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈ కేసు దర్యాప్తులో ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది..
రాజమండ్రి, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై (Anantha Babu case) ఈ రోజు (శుక్రవారం) సుప్రీంకోర్టులో (Supreme Court) విచారణ జరిగింది. ఈ పిటిషన్‌పై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈ కేసు దర్యాప్తులో ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలపై న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు (Muppalla Subbarao) స్పందించారు. సుబ్రహ్మణ్యం హత్య కేసులో సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ఉన్న బడుగు, బలహీన వర్గాలకు మనోధైర్యం ఇచ్చేవిధంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు.
వైసీపీ హయాంలో డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అత్యంత కిరాతకంగా హత్య చేసి, డోర్ డెలివరీ చేశారని న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు ప్రస్తావించారు. వైసీపీ ప్రభుత్వ అండదండలతో అప్పటి పోలీసులు సుబ్రహ్మణ్యం హత్య కేసును నీరుగార్చారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని మృతుడు సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు వినతిపత్రం అందజేశారని అన్నారు. వెంటనే కూటమి ప్రభుత్వం స్పందించి సుబ్రహ్మణ్యం కేసులో సిట్ విచారణకు ఆదేశించిందని తెలిపారు. ఆ తర్వాత ట్రైల్ విచారణ ఆపాలని అనంతబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారని అన్నారు.
ఈ క్రమంలో అనంతబాబుకు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలిందని న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు చెప్పుకొచ్చారు. సుప్రీంకోర్టు బాధిత కుటుంబానికి న్యాయం చేసే విధంగా భరోసా ఇచ్చేలా మాట్లాడిందన్నారు. ఏపీ హైకోర్టు జోక్యం చేసుకోవద్దని సుప్రీంకోర్టు ఆదేశించిందని తెలిపారు. ప్రత్యేక న్యాయమూర్తితో విచారణ జరపాలని, నవంబర్ 30వ తేదీ లోపు విచారణ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని అన్నారు. అనంతబాబుకు సహకరించిన అప్పటి పోలీసులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హైరిటేజ్.. నాణ్యతలో రాజీ పడబోం: నారా భువనేశ్వరి
యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యం: మంత్రి నారా లోకేశ్
Read Latest Telangana News And AP News And Telugu News