Share News

జగన్ హయాంలో అసెంబ్లీని బూతుల అడ్డాగా మార్చారు.. సీఎం చంద్రబాబు ధ్వజం

ABN , Publish Date - Feb 13 , 2026 | 12:56 PM

వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో ఐదేళ్లు జరిగింది మామూలు విధ్వంసం కాదని ఆరోపించారాయన. తనలాంటి వాళ్లు ఎంతోమంది కనీళ్లు పెట్టుకున్నారంటే వైసీపీ పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు.

జగన్ హయాంలో అసెంబ్లీని బూతుల అడ్డాగా మార్చారు.. సీఎం చంద్రబాబు ధ్వజం
AP CM Chandrababu Naidu

అమరావతి, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై(YS Jagan Mohan Reddy) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(AP CM Chandrababu Naidu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలోని ఐదేళ్లు జరిగింది మామూలు విధ్వంసం కాదని ఆరోపించారు. తనలాంటి వాళ్లు ఎంతో మంది నాడు కనీళ్లు పెట్టుకున్నారంటే వైసీపీ పాలన ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చన్నారు సీఎం. శుక్రవారం ఏపీ అసెంబ్లీలో గవర్నర్‌ అబ్దుల్ నజీర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. చట్టసభ అనేది ప్రజా దేవాలయమన్నారు. ఇటీవల విద్యార్థులతో మాక్‌ అసెంబ్లీ నిర్వహించామని తెలిపారు. సభలోని సభ్యులకంటే.. మాక్‌ అసెంబ్లీలోని విద్యార్థులే చక్కగా ప్రసంగించారని కొనియాడారు. ఒకప్పుడు ఈ అసెంబ్లీ అనుచిత వ్యాఖ్యలకు నమూనాగా ఉండేదన్నారు. అసెంబ్లీలో తనకు జరిగిన అవమానానికి నాడు కన్నీళ్లు పెట్టుకోవాల్సి వచ్చిందన్నారు. 2019-2024 మధ్య తనలా కన్నీళ్లు పెట్టుకున్న వారెందరో ఉన్నారని ప్రస్తావించారాయన.


20 నెలల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు..

కూటమి ప్రభుత్వ హయాంలో 20 నెలల్లో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని చంద్రబాబు పేర్కొన్నారు. రాజధాని కోసం 29 వేల మంది రైతులు.. 33 వేల ఎకరాలు ఇచ్చారని తెలిపారు. భూములిచ్చిన రైతులకు మనం ఒక్క పైసా కూడా ఇవ్వలేదన్నారు. అభివృద్ధి చేసి ప్లాట్లు ఇస్తామని చెప్పామని తెలిపారు. నోటీసులివ్వకుండా నన్ను అరెస్ట్‌ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పవన్‌ కల్యాణ్‌ విశాఖ పర్యటనకు వెళ్తే అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. నాడు మమ్మల్ని అడ్డుకున్న వాళ్లు.. నేడు నీతులు చెబుతున్నారని విమర్శించారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం టీడీపీ, జనసేన, బీజేపీ కలిశాయని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే పొత్తు పెట్టుకున్నామని స్పష్టం చేశారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తుంటారని.. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామన్నారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 94 శాతం స్ట్రైక్‌రేట్‌తో తమను గెలిపించారని తెలిపారు.


పెన్షన్ల కోసం రూ.34 వేల కోట్లు ఖర్చు..

పెన్షన్ల కోసం ఏటా రూ.34 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు. దేశంలో ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం ఏదీ లేదని చెప్పుకొచ్చారు. ఈ ఏడాదిలో 1,000 ఏసీ బస్సులను తీసుకొస్తున్నామన్నారు. 20 నెలల్లో ఇంత చేయగలిగామా.! అని ఆశ్చర్యపోయేలా అందరూ సహకరించారని తెలిపారు. విభజన జరిగడం వల్ల రాష్ట్రానికి కొంత మేర నష్టం వాటిల్లిందని ప్రస్తావించారు. నాడు ఏ వైపూ తాను సపోర్టు చేయకుండా తటస్ధంగా ఉన్నానని వివరించారు. 2014-2019 మధ్య ఏడాదిలోనే అసెంబ్లీ కట్టామని.. ఇక్కడ అసెంబ్లీ రావడానికి కారణం 29వేల మంది రైతులు 33 వేల ఎకారాల భూమిని ఇచ్చారని తెలిపారు. వారికి పైసా కూడా ఇవ్వలేకపోయామన్నారు. అయితే అదే టెంపో కంటిన్యూ అయి ఉంటే రికవర్ అయ్యేవాళ్లమని చెప్పుకొచ్చారు.


7 శ్వేతపత్రాలు ఇచ్చాం..

నాడు ముగ్గురు కలిసి పోటీ చేశామని.. కేంద్రం కూడా భాద్యత తీసుకోవాల్సి వచ్చిందని సీఎం పేర్కొన్నారు. ‘రాష్ట్రంలో వైసీపీ హయాంలోని విధ్వంసంపై 7 శ్వేతపత్రాలు ఇచ్చాం. సంక్షేమంలో ఎవ్వరూ ఊహించని విధంగా ప్రపంచంలోనే అతిపెద్ద డీబిటీ ప్రోగ్రాం చేస్తున్నాం. రూ.2700 కోట్లు నెలకు ఈ పథకం కింద ఇస్తున్నాం. బకాయిలు కూడా ఇచ్చాం. పిల్లలందరికి తల్లికి వందనం పథకం కింద రూ.10,700 కోట్లు ఇచ్చాం. స్త్రీశక్తి ద్వారా సుమారు 443 కోట్ల మంది ప్రయాణం చేశారు. ఈ విషయంలో ఆర్టీసీని అభినందిస్తున్నా. ఈ ప్రోగ్రాం సక్సెస్ మాత్రమే కాదు.. ప్రభుత్వానికీ మంచి పేరు తెచ్చింది. త్వరలో మరో వెయ్యి ఏసీ బస్సులు తెస్తాం. మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేల నగదును రైతుల అకౌంట్లలో వేస్తాం. అన్ని నియోజకవర్గాల్లో అన్నా క్యాంటిన్లను ఏర్పాటు చేస్తున్నాం’ అని చంద్రబాబు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ హయాంలో మద్యనిషేధం పేరుతో రేట్లు పెంచారు: మంత్రి కొల్లు రవీంద్ర

ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానం, చర్చలు

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 13 , 2026 | 02:34 PM