ఉద్యోగాలు, ప్రతిభకు దేశంలోనే నంబర్‌వన్ సిటీగా విశాఖ: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Aug 22 , 2026 | 08:33 PM
ఉద్యోగాలు, ప్రతిభకు దేశంలోనే నంబర్‌వన్ సిటీగా విశాఖపట్నం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
విశాఖపట్నం, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగాలు, ప్రతిభకు దేశంలోనే నంబర్‌వన్ సిటీగా విశాఖపట్నం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) స్పష్టం చేశారు. ఈరోజు (శనివారం) విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ దేశాల యువజన, క్రీడ శాఖల మంత్రుల సాంస్కృతిక కార్యక్రమం 2026కు సీఎం హాజరయ్యారు. ఈ సందర్భంగా బ్రిక్స్ దేశాల ప్రతినిధులకు సీఎం స్వాగతం పలికారు. భారత తూర్పు తీరంలో విశాఖ దేశానికే ఆభరణమని అభివర్ణించారు. సిటీ ఆఫ్ డెస్టినీగా విశాఖను పిలుస్తారని బ్రిక్స్ దేశాల మంత్రులకు వివరించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రసంగించారు. మహిళలకు అత్యంత సురక్షితమైన నగరాల్లో విశాఖ నగరం అగ్రస్థానంలో ఉందని ఉద్ఘాటించారు. మారిటైమ్ గేట్‌వేగా, టెక్నాలజీ - ఇన్నోవేషన్ హబ్‌గా విశాఖను తీర్చి దిద్దుతున్నట్లు వ్యాఖ్యానించారు. వాటర్ స్పోర్ట్స్, స్పోర్ట్స్ టూరిజానికి విశాఖలో అపార అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. యువత ఆకాంక్షలకు ప్రతీకగా విశాఖ నగరాన్ని తీర్చి దిద్దుతున్నట్లు పేర్కొన్నారు.
క్రీడలతో బ్రిక్స్ దేశాల ఐక్యత ఉండాలి..
భాష, సంస్కృతి, భౌగోళికంగా భిన్నమైనా.. క్రీడలతో బ్రిక్స్ దేశాల ఐక్యత ఉండాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. క్రీడలు పోటీ మాత్రమే కాదని... సంస్కృతి, జీవన విధానమని తెలిపారు. యువతలో ఒత్తిడిని అధిగమించేందుకు క్రీడలు, యోగా, ధ్యానం వంటివి భారతీయ విధానమని వెల్లడించారు. ఆరోగ్యవంతమైన పౌరులతోనే బలమైన సమాజం ఉంటుందని వివరించారు. క్రీడలతో అథ్లెట్లు, కోచ్‌లు, ట్రైనర్లకు ఉపాధి అవకాశాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. స్పోర్ట్స్ టూరిజంతో పెట్టుబడులు, అంతర్జాతీయ ఈవెంట్లకు అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఏపీలో స్టేట్ అకాడమీలు, సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌తో సమగ్ర క్రీడా వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. అమరావతి స్పోర్ట్స్ సిటీ కేంద్రంగా పూర్తి స్థాయి స్పోర్ట్స్ ఎకోసిస్టమ్ వస్తుందని స్పష్టం చేశారు. నెల్లూరు కేంద్రంగా స్పోర్ట్స్ ఎక్విప్‌మెంట్, అపెరల్, టెక్నాలజీ తయారీ కంపెనీలు వస్తున్నాయని తెలిపారు.
బ్రిక్స్ దేశాలతో క్రీడా భాగస్వామ్యానికి ఏపీ సిద్ధం..
అంతర్జాతీయ వాటర్ స్పోర్ట్స్ డెస్టినేషన్‌గా విశాఖను తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఏపీలో ప్రపంచ స్థాయి క్రీడా ఈవెంట్ల నిర్వహణే లక్ష్యంగా పని చేస్తున్నట్లు తెలిపారు. బ్రిక్స్ దేశాలతో క్రీడా భాగస్వామ్యానికి ఏపీ సిద్ధమని వివరించారు. విశాఖ కేంద్రంగా బ్రిక్స్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఇన్నోవేషన్ నెట్‌వర్క్ ఏర్పాటుకు ప్రతిపాదన చేస్తున్నామని వెల్లడించారు. బ్రిక్స్ దేశాల మధ్య అథ్లెట్లు, కోచ్‌ల పరస్పర మార్పిడికి అవకాశం ఉందని చెప్పారు. వాటర్ స్పోర్ట్స్, అంతర్జాతీయ ఈవెంట్లు, స్పోర్ట్స్ టూరిజంలో పెట్టుబడులకు ఆహ్వానిస్తున్నామని అన్నారు. నైపుణ్యం కలిగిన యువత, సాంకేతిక వ్యవస్థ, సుదీర్ఘ తీరప్రాంతం ఏపీ బలమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
హరీశ్‌రావు కాదు.. అబద్దాల రావు.. మంత్రి పొంగులేటి సెటైర్లు
ఆ భూములను లాక్కుంటే.. చూస్తూ ఊరుకోం.. రేవంత్ సర్కార్‌కు కవిత వార్నింగ్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News