Share News

యోగా ద్వారా ఆరోగ్య విప్లవం.. యోగాంధ్ర-2026పై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్

ABN , Publish Date - Jun 17 , 2026 | 05:58 PM

అంతర్జాతీయ యోగా దినోత్సవం (జూన్ 21) నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబు.. అధికారులను ఆదేశించారు.

యోగా ద్వారా ఆరోగ్య విప్లవం.. యోగాంధ్ర-2026పై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్
AP CM Chandrababu Naidu

అమరావతి, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ యోగా దినోత్సవం (జూన్ 21) నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగే యోగా దినోత్సవ కార్యక్రమాలను సమన్వయంతో, ఘనంగా నిర్వహించేలా అన్ని శాఖలు సమష్టిగా పనిచేయాలని సూచించారు. సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన ‘యోగాంధ్ర–2026’ ఏర్పాట్లపై ఈరోజు (బుధవారం) ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో యోగా దినోత్సవాన్ని ప్రజా ఉద్యమంగా మార్చే దిశగా చర్యలు తీసుకోవాలని సీఎం దిశానిర్దేశం చేశారు.


విజయవాడలో యోగా దినోత్సవం..

జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఘనంగా నిర్వహించేలా ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రస్థాయి ప్రధాన ఈవెంట్‌గా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ స్టేడియంలో 5 వేల నుంచి 6 వేల మందితో యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమానికి బాబా రాందేవ్ హాజరుకానున్నారని తెలిపారు. యోగాంధ్ర–2026లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రజల భాగస్వామ్యంతో యోగా ద్వారా ఆరోగ్యకర జీవనశైలిపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు.


ప్రజా ఉద్యమంగా తీర్చిదిద్దాలి..

యోగా దినోత్సవాన్ని కేవలం కార్యక్రమంగా కాకుండా ప్రజా ఉద్యమంగా తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు సూచించారు. శాఖల మధ్య సమన్వయం మరింత బలంగా ఉండాలని, అన్ని ఏర్పాట్లు సమయానికి పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే యోగా ద్వారా ఆరోగ్యకర జీవనశైలి ప్రాముఖ్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఆయుష్ శాఖ అధికారులు, అలాగే ప్రకృతి వైద్యం, యోగా సలహాదారు మంతెన సత్యనారాయణ రాజు పాల్గొన్నారు. వారు యోగా కార్యక్రమాల అమలు, ప్రజల భాగస్వామ్యం పెంపుపై ఈ సమావేశంలో చర్చించారు.


20న యోగా కార్యక్రమంలో పాల్గొనున్న బాబా రాందేవ్..

ఈ నెల 20వ తేదీన ఉండవల్లి గుహల దగ్గర జరిగే యోగా కార్యక్రమంలో బాబా రాందేవ్‌తో కలిసి సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే యోగాంధ్రకు వచ్చే వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఆరోగ్యంపై అందరూ ధ్యాస పెట్టేలా.... యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మార్గనిర్దేశం చేశారు. సంజీవని కార్యక్రమంతో అనుసంధానం ద్వారా యోగాను ఇంటింటికీ తీసుకువెళ్లాలని సీఎం చంద్రబాబు సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

సింగపూర్ తర్వాత పెట్టుబడులకు ఏపీనే ఉత్తమ గమ్యస్థానం: సీఎం చంద్రబాబు

మోదీ హయాంలో భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా దూసుకెళ్తోంది: ప్రహ్లాద్ జోషి

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jun 17 , 2026 | 07:39 PM