అసెంబ్లీలోనా? బయటా?!
ABN , Publish Date - Aug 18 , 2026 | 08:23 AM
‘‘చాలెంజ్ చేస్తున్నా. అసెంబ్లీలో అయినా సరే. అసెంబ్లీ బయట అయినా సరే. ఎక్కడైనా సరే. తేదీ, సమయం మీరే ఫిక్స్ చేయండి. ఎప్పుడైనా చర్చకు సిద్ధం.’’ అని మెగా డీఎస్సీ-2025పై వైసీపీ అధ్యక్షుడు జగన్‌కు మంత్రి లోకేశ్ సవాల్ విసిరారు.
తేదీ, సమయం ఫిక్స్ చేస్తే చర్చకు సై!
మెగా డీఎస్సీపై జగన్‌కు లోకేశ్ సవాల్
టెట్ నుంచి నియామకం వరకు పారదర్శకం
రోజుకో కేసు వేసి అడ్డుకోవాలని అనుకున్నారు
ప్రస్తుత ప్రభుత్వ హయాంలో మరో 3 డీఎస్సీలు
3 వేల పోస్టులతో త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్
బదిలీల చట్టంలాగే నియామకాలకూ చట్టం: లోకేశ్
అమరావతి, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): ‘‘చాలెంజ్ చేస్తున్నా. అసెంబ్లీలో అయినా సరే. అసెంబ్లీ బయట అయినా సరే. ఎక్కడైనా సరే. తేదీ, సమయం మీరే ఫిక్స్ చేయండి. ఎప్పుడైనా చర్చకు సిద్ధం.’’ అని మెగా డీఎస్సీ-2025పై వైసీపీ అధ్యక్షుడు జగన్‌కు మంత్రి లోకేశ్ సవాల్ విసిరారు. ‘‘నేను మీలా పారిపోవడం లేదు. నాపై సీబీఐ, ఈడీ కేసులు లేవు. ఎక్కడికైనా రావాలంటే కోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకోవాల్సిన దుస్థితి నాకు లేదు.’’ అని వ్యాఖ్యానించారు. 2025లో జరిగిన మెగా డీఎస్సీపై సోమవారం అసెంబ్లీలో మంత్రి ప్రకటన చేశారు. ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. వచ్చే ఎన్నికలలోపు మరో మూడు డీఎస్సీలు నిర్వహిస్తామన్నారు. త్వరలో 3 వేల పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
ప్రజల కోసమే..
ప్రజలకు సమాధానం చెప్పాలని ఈ ప్రకటన చేస్తున్నా. మెగా డీఎస్సీ-2025లో 16,341 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చాం. 15,941 పోస్టులు భర్తీ చేశాం. 148 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తయింది. ఎన్టీఆర్ హయాం నుంచి విద్యకు టీడీపీ ప్రాధాన్యత ఇచ్చింది. సీఎం చంద్రబాబు విద్యావ్యవస్థను బలోపేతం చేశారు. 1994లో డీఎస్సీ విధానం వచ్చింది. అప్పటి నుంచి ఒక్క టీడీపీ హయాంలోనే 1.8 లక్షల ఉపాధ్యాయ ఉద్యోగాలిచ్చాం. 2019-24 మధ్య టీచర్లు లేక 12 లక్షల మంది పేద పిల్లలు ప్రైవేటు పాఠశాలలకు వెళ్లారు. గత ప్రభుత్వం తెచ్చిన జీవో 117తో పాఠశాలలు నష్టపోయాయి.
మెగా డీఎస్సీ ఇలా నిర్వహించాం
మెగా డీఎస్సీకి 3,36,300 మంది 5,77,675 దరఖాస్తు చేసుకున్నారు. 154 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశాం. 42 వేల ప్రశ్నలతో క్వశ్చన్ బ్యాంక్ రూపొందించాం. మొదట టెట్ నిర్వహించి, అనంతరం డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చాం. మొత్తం కంప్యూటర్ ఆధారిత పరీక్షలు కావడంతో దేశంలో అనేక సంస్థలకు సేవలు అందిస్తున్న టీసీఎస్ అయాన్ సెంటర్ల ద్వారా పరీక్షలు నిర్వహించాం. డీఎస్సీ ఫలితాల అనంతరం కూడా 33,830 సందేహాలను నివృత్తి చేశాం. మెగా డీఎస్సీ ఆపాలని కొందరు తీవ్రంగా ప్రయత్నించి 148 రోజుల్లో దాదాపు రోజుకో కేసు ఫైల్ చేశారు. మొత్తం 336 కేసులు పడ్డాయి. అన్నింటినీ న్యాయబద్ధంగా పరిష్కరిస్తున్నాం. దేశ చరిత్రలో తొలిసారి హారిజంటల్ రిజర్వేషన్‌ను డీఎస్సీలో అమలు చేశాం. క్రీడలను ప్రోత్సహించాలన్నది మా ప్రభుత్వ లక్ష్యం. అందుకే కేంద్రం తీసుకొచ్చిన క్రీడా విధానాన్నే ఇక్కడ అమలుచేశాం. గతంలో 29 కేటగిరీలు క్రీడా కోటాలో ఉంటే కేంద్రం వాటిని 65కు పెంచింది. నోటిఫికేషన్ పకడ్బందీగా ఉండాలని, న్యాయ పరిశీలనలో విఫలం కాకూడదని అధికారులకు ముందే చెప్పాను. అలాగే నోటిఫికేషన్ రూపొందించారు. మార్కుల నార్మలైజేషన్‌కు సైంటిఫిక్ విధానం అమలు చేశాం. ప్రత్యేక వెబ్‌సైట్ ద్వారా ఆధార్ ఆధారంగా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించాం. 42 వేల ప్రశ్నలను ఎస్‌సీఈఆర్‌టీ రూపొందించింది. అవి అత్యంత గోప్యంగా ఉంచాం. మొత్తం ఎన్‌క్రి్‌ప్టలో జరిగింది. దానిని బ్రేక్ చేయడం క్వాంటం సాంకేతికత వల్ల కూడా కాదు. అయినా పేపరు లీకైందని వైసీపీ వాళ్లు గొడవ చేస్తున్నారు.
కులాలు, మతాలతో చిచ్చు
గొడ్డలి పార్టీ అండతో ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి క్రీడా కోటాలో ఒకే సామాజికవర్గానికి ఎక్కువ ఉద్యోగాలు వచ్చాయని తప్పుడు ప్రచారం చేశారు. క్రీడా కోటాలో 372 ఎంపికయ్యారు. వీరిలో 46 మంది ఓసీ, 185 మంది బీసీ, 112 మంది ఎస్సీ, 29 మంది ఎస్టీలున్నారు. ఒక ‘పిల్’ వేసి మెగా డీఎస్సీ రద్దు చేయాలని అడిగారు. కోర్టుకు వచ్చేందుకు అభ్యర్థులు భయపడుతున్నారని చెప్పారు. భయపడితే 336 కేసులు ఎలా పడ్డాయని న్యాయస్థానం ఎదురు ప్రశ్నించింది. జాబ్ క్యాలెండర్ ద్వారా 10,060 పోస్టులు భర్తీ చేస్తాం. టీచర్ల బదిలీలకు చట్టం తెచ్చా. అదే తరహాలో టీచర్ల నియామకాలకూ చట్టం తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం ర్యాలీలు చేసిన మెగా డీఎస్సీ టీచర్లకు ధన్యవాదాలు.
క్రీడా కోటా పారదర్శకం
క్రీడా కోటా ఉద్యోగాల గురించి ‘టీమ్-11’(వైసీపీ) ఆరోపణలు చేస్తోంది. స్టార్ షట్లర్ పీవీ సింధుకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చాం. త్వరలో ఆమె కన్ఫర్డ్ ఐఏఎస్ కాబోతున్నారు. యర్రా జ్యోతికి ఉద్యోగం ఇవ్వమని సీఎం ఆదేశించారు. క్రికెటర్ శ్రీచరణికి డిగ్రీ పూర్తయ్యాక ఉద్యోగం వస్తుంది. క్రీడా సర్టిఫికెట్లను శాప్ వివిధ దశల్లో నెల రోజులు పరిశీలించింది. అనంతరమే అభ్యర్థులను ఎంపిక చేశారు. ఇది ఆషామాషీగా చేయలేదు. ఏడాది తర్వాత వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఎమ్మెల్యే కూన రవి, ఎంపీ భరత్ గేమ్స్‌కు అధ్యక్షులు కాబట్టి వారికి అనుకూలంగా ఉన్నవారికి ఉద్యోగాలు ఇచ్చారని అంటున్నారు. ఆధారాలుంటే తీసుకురండి. పారదర్శకంగా పరిశీలన జరిగింది.
‘‘డీఎస్సీ అంటే అవగాహన లేనివారు కూడా మాట్లాడుతున్నారు. డీఎస్సీ అంటే ‘డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్’ అని వైసీపీ అధికార ప్రతినిధి చెబుతున్నాడు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తర్వాత 16,291 మందికి కాల్ లెటర్లు పంపాం. హారిజంటల్ రిజర్వేషన్, ఇతర కారణాలతో 722 మందికి పోస్టులు ఇవ్వలేకపోయాం. వర్టికల్ రోస్టర్ ఆధారంగా నోటిఫికేషన్ ఇచ్చి ఉంటే కోర్టు కొట్టివేసేది. అందుకే వర్టికల్, హారిజంటల్ రిజర్వేషన్ అమలు చేశాం.’
- అసెంబ్లీలో మంత్రి లోకేశ్
‘‘టీచర్లూ నేను హామీ ఇస్తున్నా. ఎవరూ ఆందోళన చెందొద్దు. వైసీపీ ఐదేళ్లలో ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. జగన్ సభకు వస్తే ఇది అడుగుదాం అనుకున్నా. ఇకపై ప్రతి ఏటా డీఎస్సీ ఇస్తాం. ఈ ఏడాది 3 వేల పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి ఉగాదిలోపు టీచర్లను పాఠశాలలకు పంపుతాం.’’
- మంత్రి లోకేశ్
వైసీపీ ఆరోపణ లోకేశ్ సమాధానం
ఆరోపణ-1: ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్, డీఎస్సీ కన్వీనర్ ఒక్కరినే ఎలా నియమిస్తారు?
సమాధానం: ఇతర రాష్ర్టాల్లో ఇలాగే నియమించారు. డీఎస్సీ ప్రక్రియ త్వరలో పూర్తికావాలన్న ఉద్దేశంతో ఒకే అధికారిని నియమించాం. ఆయన కింద 50 మంది పనిచేశారు.
ఆరోపణ-2: అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి ర్యాంకు
సమాధానం: ప్రశ్నల సెట్టింగ్‌లో అతనికి ప్రమేయం లేదు. అది కేవలం రెగ్యులర్ ఉద్యోగుల బాధ్యత. అవుట్‌సోర్సింగ్ ఉద్యోగికి కాల్ లెటర్ పంపారు. కానీ, అతను సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకాలేదు. అందుకే అనర్హుడయ్యాడు. అతను పరీక్ష రాసేందుకు శాఖ నుంచి ఎన్‌వోసీ పొందలేదు. అందుకే లాగిన్లు తొలగించాం. 42 వేల ప్రశ్నలు ఎవరికి ఎలా వెళ్తాయో తెలియదు. లీకు అయిందనడం సరికాదు.
ఆరోపణ-3: కలెక్టర్ల ఆఫీసుల్లో ఎంపిక జాబితా పెట్టలేదు.
సమాధానం: ఎంపికైన అభ్యర్థులకు ఎస్‌ఎంఎస్‌లు పంపాం. వారి లాగిన్లలో సమాచారం ఉంది. అన్నీ ఆన్‌లైన్‌లో పెట్టాం. జగన్‌కు ఫోన్ వాడటం రాదని.. అందరికీ రాదనుకుంటే ఎలా?.
ఆరోపణ-4: : క్రీడా కోటాలో డబ్బులు వసూలు చేస్తున్నారని ఆడియో లీక్.
సమాధానం: ఆడియో వచ్చిన వెంటనే శాప్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. నిందితుడిని జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపాం. తప్పుచేస్తే ఎవరినీ వదిలిపెట్టం.
వార్తలు కూడా చదవండి...
నా రాజకీయ జీవితంలో గ్రూప్ -1 లాంటి స్కాం చూడలేదు: సీఎం
అసెంబ్లీలో మంత్రుల సరదా సంభాషణ.. సత్యకుమార్‌పై లోకేశ్ చమత్కారం
ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్‌పర్సన్‌గా నాగబాబు.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
Read Latest AP News And Telangana News And National News
And Telugu News