ఏపీని క్రీడాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి రాంప్రసాద్ రెడ్డి
ABN , Publish Date - Jan 30 , 2026 | 07:40 PM
ఏపీని క్రీడాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దే దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఏపీ క్రీడా, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ఏపీలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా అమలవుతున్నాయని తెలిపారు.
ఢిల్లీ, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): ఏపీని క్రీడాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దే దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఏపీ క్రీడా, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి (Minister Mandapalli Ramprasad Reddy) అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు పూర్తి అయ్యిందన్నారు. శుక్రవారం ఢిల్లీ వేదికగా మంత్రి మండిపల్లి మీడియాతో మాట్లాడారు. ఏపీలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా అమలవుతున్నాయని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో నిధుల సమీకరణ జరుగుతోందని వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే తాటిపై నిలబడి ఏపీ అభివృద్ధికి కృషి చేస్తున్నాయని వెల్లడించారు. రాష్ట్ర క్రీడా ప్రాజెక్టుల గురించి కేంద్ర క్రీడా శాఖతో సంప్రదింపులు జరిపామని.. దీనిపై ఆ శాఖ సానుకూలంగా స్పందించిందని తెలిపారు.
‘అశ్మితా’ స్కీమ్ అమలు..
మహిళా క్రీడాకారుల కోసం SAI పరిధిలో ‘అశ్మితా’ స్కీమ్‌ను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. సండే ఆన్ సైకిల్ కార్యక్రమాన్ని మార్చి నుంచి అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రారంభిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఖేలో ఇండియా నిధులు క్రీడా మౌలిక సదుపాయాలకు కీలకమని తెలిపారు. ఖేలో ఇండియా కింద రాష్ట్రానికి ఇప్పటికే రూ.67 కోట్లు మంజూరు చేశారని ప్రస్తావించారు. క్రీడా మౌలిక సదుపాయాల కోసం కేంద్రానికి రూ.600 కోట్ల ప్రతిపాదన చేశామని తెలిపారు. కేంద్ర కోచ్‌ల నియామకాల్లో ఆంధ్రప్రదేశ్ వాటా పెంచాలని విజ్ఞప్తి చేశామని అన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు ఏర్పాటు చేసిన క్రీడా కళాశాలలే.. నేటి ఎక్సలెన్సీ సెంటర్లుగా కొనసాగుతున్నాయని వివరించారు. క్రీడాకారులకు గత 18 నెలల్లో రూ.18 కోట్ల ఇన్సెంటివ్స్ విడుదల చేశారని వెల్లడించారు. జాతీయ, అంతర్జాతీయ పతక విజేతలకు గ్రూప్–1, గ్రూప్–2 ఉద్యోగాలు ఇస్తామని మాటిచ్చారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడాకారులకు మూడు శాతం రిజర్వేషన్.. చారిత్రాత్మక నిర్ణయమని ఆయన పేర్కొన్నారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో తిరుపతి బస్టాండ్..
తిరుపతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో నూతన బస్టాండ్ నిర్మాణానికి చర్యలు చేపడుతున్నామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్ట్ వ్యయం రూ.500 కోట్లు అవుతుందని.. త్వరలో శంకుస్థాపన చేస్తామని స్పష్టం చేశారు. దీనిపై NHLMCL సంస్థతో చర్చలు జరిపామని.. డీపీఆర్‌లు కూడా సిద్ధమయ్యాయని పేర్కొన్నారు. రాయచోటి–కడప NH–40ను నాలుగు లైన్ల రహదారిగా అభివృద్ధి ప్రతిపాదన చేస్తున్నామని వివరించారు. అధిక ప్రమాదాలు జరుగుతున్న మార్గంపై ఆరు నెలల్లో టెండర్లు పిలుస్తామని చెప్పుకొచ్చారు. ఇందుకోసం కేంద్ర రవాణా శాఖ అధికారులతో విస్తృత స్థాయి చర్చలు జరుపుతున్నామని తెలిపారు. ప్రతి రెండు నెలలకు ఒకసారి కేంద్రంతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. మంత్రులు కేంద్రం, రాష్ట్రాల మధ్య వారధిగా పని చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
దావోస్ పర్యటనలో ఏపీని బెస్ట్‌గా ప్రమోట్ చేశాం: మంత్రి టీజీ భరత్
ఆ భూములపై వైసీపీ దౌర్జన్యం చేస్తోంది.. పల్లా శ్రీనివాసరావు ధ్వజం
Read Latest AP News And Telugu News