డీఎస్సీపై అపోహలు వద్దు.. అక్టోబర్‌లో మరో నోటిఫికేషన్: ఏపీ విద్యాశాఖ
ABN , Publish Date - Jun 11 , 2026 | 07:17 PM
డీఎస్సీపై రెండుసార్లు సమగ్ర వివరణ ఇచ్చినా నిరాధార ఆరోపణలే మళ్లీ మళ్లీ వస్తున్నాయని ఏపీ ప్రభుత్వ విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. అక్టోబర్‌లో జాబ్ క్యాలెండర్‌లో భాగంగా మళ్లీ డీఎస్సీ నోటిఫికేషన్ వస్తోందని చెప్పుకొచ్చారు.
అమరావతి, జూన్11, (ఆంధ్రజ్యోతి): డీఎస్సీపై రెండుసార్లు సమగ్ర వివరణ ఇచ్చినా నిరాధార ఆరోపణలే మళ్లీ మళ్లీ వస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. అక్టోబర్‌లో జాబ్ క్యాలెండర్‌లో భాగంగా మళ్లీ డీఎస్సీ నోటిఫికేషన్ వస్తోందని చెప్పుకొచ్చారు. దీనిపై ఎవరికీ ఎలాంటి అపోహలు వద్దని అన్నారు. ఈరోజు(గురువారం) అమరావతి వేదికగా కోన శశిధర్ మీడియాతో మాట్లాడారు. లీక్‌కు ఎలాంటి స్కోప్ లేకుండా డీఎస్సీ నిర్వహించామని స్పష్టం చేశారు. హారిజాంటల్ రిజర్వేషన్ అర్ధం చేసుకోని వాళ్లే అనవసర విమర్శలు చేస్తున్నారని చెప్పారు.
కాల్ లెటర్ వచ్చినంత మాత్రాన ఉద్యోగం వచ్చినట్లు కాదని నోటిఫికేషన్‌లోనే స్పష్టం చేశామని అన్నారు. సర్టిఫికేట్ ధ్రువీకరణ కోసమే కాల్ లెటర్‌లు పంపిస్తామని వివరించారు.ఎక్కడైనా సెలెక్షన్ లిస్ట్ ఉంటుంది తప్ప రిజెక్షన్ లిస్ట్ ఉండదని చెప్పుకొచ్చారు. ఇంకో డీఎస్సీ కూడా వస్తున్నందున అభ్యర్థులు ఈ విధానాన్ని అర్థం చేసుకోవాలని సూచించారు. ఎవరికైనా ఇంకా అనుమానాలు ఉంటే కమిషనర్ కార్యాలయంలో సమాచారం కోసం అందుబాటులో ఫోన్‌నంబర్ ఉందని, అందరి అనుమానాలు నివృత్తి అవుతాయని కోన శశిధర్ పేర్కొన్నారు.
పకడ్బందీగా డీఎస్సీ పరీక్ష నిర్వహించాం: అజయ్ జైన్
డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా విధానంపై ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. డీఎస్సీలో క్రీడా కోటా పారదర్శకంగా అమలు చేశామనటానికి అన్నీ ఆన్‌లైన్‌లో ఉంచామని స్పష్టం చేశారు. ఇప్పుడున్న ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారమే పకడ్బందీగా డీఎస్సీ పరీక్ష నిర్వహించామని తేల్చిచెప్పారు. 2019లో ఇంటర్ కాలేజ్ రిక్రూట్‌మెంట్ జరిగిందని, కానీ ఇప్పుడలా చేయలేదని వివరించారు. ఇంటర్ డిస్ట్రిక్ట్, స్టేట్, ఇంటర్నేషనల్, ఒలింపిక్స్ వరకు సర్టిఫికెట్లు స్పోర్ట్స్ కోటాలో చూశామని వెల్లడించారు. నిబంధనల ప్రకారం ధ్రువపత్రాలు అప్‌లోడ్ చేయని వారికి ఉద్యోగం రాలేదని అన్నారు. అలాంటి వారు కొందరు కోర్టుకు వెళ్లారని, కోర్టు ఇచ్చే ఆదేశాల ప్రకారం ప్రభుత్వం నడుచుకుంటుందని అజయ్ జైన్ స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
జగన్ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు: హోంమంత్రి అనిత
ప్రధాని మోదీ దేశాన్ని సరికొత్త దిశగా తీసుకెళ్తున్నారు: సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News