పెట్టుబడులే లక్ష్యంగా సీఎం చంద్రబాబు దావోస్ టూర్.. హైలెట్స్ ఇవే..
ABN , Publish Date - Jan 20 , 2026 | 09:21 PM
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటన కొనసాగుతోంది. రెండో రోజు పర్యటనలో పలువురు పారిశ్రామిక వేత్తలతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఏపీకి కావాల్సిన పెట్టుబడులపై సీఎం సుదీర్ఘంగా చర్చించారు..
ఇంటర్నెట్ డెస్క్, జనవరి20(ఆంధ్రజ్యోతి): ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) దావోస్ పర్యటన కొనసాగుతోంది. రెండో రోజు పర్యటనలో పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఏపీకి కావాల్సిన పెట్టుబడులపై సీఎం సుదీర్ఘంగా చర్చించారు. పెట్టుబడుల సాధన, ఏపీ బ్రాండింగ్, రాష్ట్రంలోని వనరులను వివరించేలా ప్రపంచ ఆర్థిక సదస్సుకు ముఖ్యమంత్రి బృందం హాజరైంది. వివిధ జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఏపీలో అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలను తెలుసుకునేందుకు పలువురు పారిశ్రామిక వేత్తలు ఆసక్తికనబరిచారు. గూగుల్ ఏఐ డేటా సెంటర్, గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ వంటి పెట్టుబడులతో ప్రపంచ ఆర్థిక సదస్సులో విశాఖపట్నం, కాకినాడ చర్చనీయాంశంగా మారాయి. వివిధ దేశాల్లో రంగాల వారీగా అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలను సీఎం చంద్రబాబు అధ్యయనం చేస్తున్నారు. ఏపీలో అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలు, తెచ్చిన పాలసీలను పారిశ్రామిక వేత్తలకు సీఎం వివరించారు.
దావోస్ మ్యాన్ సీఎం చంద్రబాబు.. ఈరోస్ సీఈఓ కిషోర్ లుల్లా ప్రశంసలు...
1998 నుంచి చంద్రబాబు దావోస్‌కు వస్తున్న విషయాన్ని పలువురు పారిశ్రామిక వేత్తలు ప్రస్తావించారు. దావోస్ మ్యాన్ అంటూ సీఎం చంద్రబాబును తన సహచరులకు ఈరోస్ సీఈఓ కిషోర్ లుల్లా పరిచయం చేశారు. గతేడాది దావోస్ పర్యటనతో ఏపీలో రూ. 2.36 లక్షల కోట్ల పెట్టుబడులు సాకారమయ్యాయనే అంశంపై భారతదేశం నుంచి వచ్చిన వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులతో చర్చించారు. వివిధ రంగాల్లోని 20 ప్రాజెక్టుల ద్వారా సుమారు రూ. 2.36 లక్షల కోట్ల పెట్టుబడులను గతేడాది కూటమి ప్రభుత్వం రాబట్టిందని సీఎం గుర్తుచేశారు. ఐటీ రంగంలో దాదాపు రూ. 1.36 లక్షల కోట్లు, స్టీల్ రంగంలో సుమారు రూ. 62 వేల కోట్లు వచ్చాయని స్పష్టం చేశారు. ఇంధన రంగంలో దాదాపు రూ.23 వేల కోట్లు, ఎలక్ట్రానిక్స్ రంగంలో సుమారు రూ. 9 వేల కోట్లు వచ్చాయని తెలిపారు. డిఫెన్స్-ఎయిరో స్పేస్ రంగంలో రూ.2 వేల కోట్లు, ఇన్ఫ్రా, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో రూ. 4 వేల కోట్లు వచ్చాయని వెల్లడించారు. ఏపీలో వివిధ సంస్థలు ఇప్పటికే మొదలుపెట్టిన ప్రాజెక్టులను మరింత విస్తరించేలా పలువురు పారిశ్రామిక వేత్తలతో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ సంప్రదింపులు జరుపుతున్నారు.
గూగుల్, ఐబీఎం ప్రతినిధులతో సీఎం భేటీ...
గూగుల్, ఐబీఎం వంటి కీలక సంస్థలకు చెందిన ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. అమరావతిలో క్వాంటం ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఐబీఎం ప్రతినిధులకు సీఎం ప్రతిపాదించారు. ఐబీఎం భాగస్వామ్యంతో అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ ఏర్పాటు చేసేలా ఇప్పటికే ఏపీ ఒప్పందం చేసుకుందని ప్రస్తావించారు. ఏపీలో 10 లక్షల మందికి ఏఐ, క్వాంటం, సైబర్ సెక్యూర్టీపై నైపుణ్య శిక్షణ ఇవ్వాలని ఐబీఎం ప్రతినిధులను ముఖ్యమంత్రి కోరారు.
పెట్టుబడుల సాధనలో నారా లోకేశ్ కీలక పాత్ర...
రాష్ట్రానికి పెట్టుబడుల సాధనలో మంత్రి నారా లోకేశ్ కీలకంగా వ్యవహరించారు. రాష్ట్రంలో 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేలా ఆర్ఎంజెడ్ గ్రూప్ ప్రతినిధులతో లోకేశ్ సంప్రదింపులు జరపగా ఆర్ఎంజెడ్ గ్రూప్ అంగీకరించింది. విశాఖపట్నం, రాయలసీమ ప్రాంతాల్లో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టనుంది ఆర్ఎంజెడ్ గ్రూప్. జీసీసీలు, హైపర్ స్కేల్ డేటా సెంటర్, ఇండస్ట్రీయల్, లాజిస్టిక్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది ఆర్ఎంజెడ్ గ్రూప్. ఏపీలో పర్యటించేందుకు, పరిశ్రమలు స్థాపించేందుకు మరికొన్ని అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపించాయి. నేషన్ ఫస్ట్ అనే స్పూర్తితో పని చేస్తామని దావోస్‌లో ఇండియా లాంజ్ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రకటించారు. గత ఏడాది దావోస్ పర్యటన సందర్భంగా జరిపిన సంప్రదింపులతో రూ.2.36 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి. ప్రస్తుతం అవి గ్రౌండ్ అవుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
పెట్టుబడులకు అత్యంత సురక్షితమైనది.. భారత్: సీఎం చంద్రబాబు
మహిళా కానిస్టేబుల్‌ను అభినదించిన హోం మంత్రి అనిత
For More AP News And Telugu News