Share News

నవంబరు 9 నాటికి పంట నష్టం అంచనాలు పూర్తి చేయాలి.. అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం

ABN , Publish Date - Nov 07 , 2026 | 08:57 PM

నవంబరు 9వ తేదీ నాటికి వ్యవసాయ పంట నష్టం అంచనాలను పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశించారు. బాధితులకు నిత్యావసరాలు, తక్షణ ఆర్థిక సాయంపై అధికారులకు సీఎం మార్గనిర్దేశం చేశారు.

నవంబరు 9 నాటికి పంట నష్టం అంచనాలు పూర్తి చేయాలి.. అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం
AP CM Chandrababu Naidu

అమరావతి, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): నవంబరు 9వ తేదీ నాటికి వ్యవసాయ పంట నష్టం అంచనాలను పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (AP CM Chandrababu Naidu) ఆదేశించారు. బాధితులకు నిత్యావసరాలు, తక్షణ ఆర్థిక సాయంపై అధికారులకు సీఎం మార్గనిర్దేశం చేశారు. రేపటికల్లా తుఫాన్ బాధితులకు పూర్తిస్థాయిలో నిత్యావసరాలను పంపిణీ చేయాలని ఆజ్ఞాపించారు. మురసు తుఫాన్ నష్టం, సహాయక చర్యలపై ముఖ్యమంత్రి ఈరోజు (శనివారం) ఉండవల్లి నివాసంలోని క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక అంశాలపై సీఎం దిశానిర్దేశం చేశారు. ఇప్పటివరకు 3.82 లక్షల కుటుంబాలకు నిత్యావసరాలను పంపిణీ చేసినట్లు వెల్లడించారు. ఇప్పటికే 92 శాతం మేర ఉద్యాన పంటల నష్టం అంచనా ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. మురసు తుఫాన్ ప్రభావిత 1,825 గ్రామాల్లో విద్యుత్ పునరుద్ధరణ పనులు పూర్తయినట్లు చెప్పుకొచ్చారు. తుఫాన్ ధాటికి దెబ్బతిన్న 7,850 విద్యుత్ స్తంభాలకు మరమ్మతులు పూర్తి చేశామని వివరించారు.


మార్కెట్‌లో నిత్యావసరాల ధరల అదుపుపై సీఎం ప్రత్యేక దృష్టి

అలాగే, మార్కెట్‌లో నిత్యావసరాల ధరల అదుపుపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టిసారించారు. ఏపీవ్యాప్తంగా రైతుబజార్ల ద్వారా కిలో రూ.35లకే ఉల్లిపాయలను పంపిణీ చేయాలని ఆదేశించారు. ఉల్లి ధరల నియంత్రణకు మార్కెట్‌లోకి 8 వేల క్వింటాళ్ల ఉల్లిపాయలను దిగుమతి చేసినట్లు తెలిపారు. రైతు బజార్లలో సబ్సిడీపై బియ్యం విక్రయాలు చేస్తున్నట్లు చెప్పారు. కిలో బియ్యం రూ.50, బీపీటీ రూ.49లకే పంపిణీ చేయాలని ఆదేశించారు. బహిరంగ మార్కెట్‌లో బియ్యం ధరల నియంత్రణకు వ్యాపారులతో చర్చలు జరుపుతున్నామని అన్నారు. నిబంధనలను ఉల్లంఘించి అధిక ధరలకు విక్రయించిన 204 మంది వ్యాపారులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. రేషన్ దుకాణాల ద్వారా సబ్సిడీపై పామాయిల్, కందిపప్పు, గోధుమ పిండి పంపిణీ చేయాలని ఆజ్ఞాపించారు. రేషన్ షాపుల్లో రూ.125లకే లీటర్ పామాయిల్, రూ.100లకే కిలో కందిపప్పు, రూ. 25లకే కిలో గోధుమ పిండి పంపిణీకి ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తుఫాన్ బాధితులకు అండగా ఉంటాం.. అధైర్యపడొద్దు: సీఎం చంద్రబాబు

ఏపీ విపత్తు నిర్వహణ భేష్.. ప్రభుత్వ పనితీరుపై కేంద్రం ప్రశంసలు

పదే పదే అవమానించడంతోనే వైసీపీ నుంచి బయటకు వచ్చా: విజయసాయిరెడ్డి

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 07 , 2026 | 09:16 PM