మెగా డీఎస్సీపై రోజుకో కుట్ర
ABN , Publish Date - Aug 18 , 2026 | 07:54 AM
మెగా డీఎస్సీపై ప్రతి ఆరోపణకూ వివరణ ఇచ్చినా.. వైసీపీ వాళ్లు రోజుకో కుట్ర చేస్తున్నారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. 80, 90 ఏళ్లవారిని కూడా నిరుద్యోగులుగా చూపించి ధర్నాలు చేయిస్తున్నారని ఎద్దేవా చేశారు.
80, 90 ఏళ్లవారినీ నిరుద్యోగులుగా చూపి ధర్నాలు చేయిస్తున్నారు
మెగా టీచర్లు రోడ్లెక్కడం భేష్.. వారికి అండగా ఉంటాం
మెరిట్ ఆధారంగానే వారికి ఉద్యోగాలు.. ఎంపికంతా ఆన్‌లైన్‌లోనే
రెండున్నరేళ్లుగా సభకు రాని ఏకైక పార్టీ.. మళ్లీ జీతాలు తీసుకుంటారు
బాధ్యత ఉంటే సభకు వచ్చి మాట్లాడాలి.. అసెంబ్లీలో సీఎం ధ్వజం
అమరావతి, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): మెగా డీఎస్సీపై ప్రతి ఆరోపణకూ వివరణ ఇచ్చినా.. వైసీపీ వాళ్లు రోజుకో కుట్ర చేస్తున్నారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. 80, 90 ఏళ్లవారిని కూడా నిరుద్యోగులుగా చూపించి ధర్నాలు చేయిస్తున్నారని ఎద్దేవా చేశారు. మెగా డీఎస్సీ అంశంపై సోమవారం శాసనసభలో ఆయన మాట్లాడారు. ‘ఉద్యోగాలకు ఎంపిక కానివారు కూడా పారదర్శకంగా భర్తీ జరిగిందని చెబుతున్నారు. ఉద్యోగాలు సాధించినవారు రోడ్లెక్కి ర్యాలీలు చేస్తున్నారు. ఇది మంచి పరిణామం. వైసీపీకి వారే సరైన సమాధానం చెబుతున్నారు. అయినా ఆ పార్టీ మారదు. రెండున్నరేళ్లు అసెంబ్లీకి రాని పార్టీని చూడడం నా జీవితంలో ఇదే తొలిసారి. అయినా జీతాలు, ప్రివిలేజెస్ పొందుతున్నారు. ప్రజలపై బాధ్యత ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి’ అని హితవు పలికారు. గత ప్రభుత్వంలో ఐదేళ్లలో ఒక్క టీచర్ నియామకం కూడా చేపట్టలేదన్నారు.
కూటమి అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ ఫైలుపై తొలి సంతకం చేసి 15,941 ఉద్యోగాలు భర్తీచేశామని.. 148 రోజుల్లోనే పారదర్శకంగా ప్రక్రియ పూర్తిచేశామని గుర్తుచేశారు. ‘వర్టికల్, హారిజంటల్ రిజర్వేషన్లను కట్టుదిట్టంగా అమలుచేశాం. మెరిట్ ఆధారంగా అభ్యర్థులు ఉద్యోగాలు సాధించారు. క్రీడా కోటా పోస్టుల్లో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలనే ఇక్కడా అమలుచేశారు. మెగా డీఎస్సీలో ఉద్యోగాలు వచ్చినవారు అత్యుత్తమ ప్రతిభావంతులు. ఎంపిక ప్రక్రియంతా ఆన్‌లైన్‌లోనే జరిగింది. ఇంతకంటే పారదర్శకత ఎక్కడ ఉంటుంది? ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ఓ మాజీ మంత్రి ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. నియామకాల్లో ఒక్క ఉల్లంఘన కూడా లేదు. వందల కేసులు వేసి మెగా డీఎస్సీని అడ్డుకునే ప్రయత్నం చేశారు. సిగ్గులేదు ఆ పార్టీకి. అది హిట్ అండ్ రన్ పార్టీ. అసెంబ్లీకి వచ్చి ఉంటే ఎండగట్టేవాడిని. రాకుండా బయట పబ్జీలు ఆడుకుంటున్నారు. బాధ్యత ఉంటే అసెంబ్లీకి వచ్చి సలహాలివ్వాలి. మా లోపాలుంటే సరిదిద్దుకుంటాం. లేనిపక్షంలో నిలదీస్తాం. ఇక్కడికి వస్తే అడ్డంగా దొరికిపోతారు. ఎన్‌డీఏ విశ్వసనీయతను దెబ్బతీయాలనుకుంటే ఖబడ్దార్. ఉద్యోగాలు సాధించిన వారికి చెబుతున్నాను.. మీరు ప్రతిభావంతులు.. ధైర్యంగా ఉండండి. మీకు అండగా నిలబడతాం’ అని భరోసా ఇచ్చారు.
80శాతం మంది నేనిచ్చిన నోటిఫికేషన్లతోనే..
రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకూ 14 డీఎస్సీలు జరిగితే 11 తాను సీఎంగా ఉన్నప్పుడే జరిగాయని చంద్రబాబు తెలిపారు. ప్రస్తుతం పనిచేస్తున్న టీచర్లలో 80 శాతం మంది తానిచ్చిన నోటిఫికేషన్ల ద్వారానే ఉద్యోగాలు సాధించారని చెప్పారు. ఇంతవరకూ ఒక్కరూ అవినీతి జరిగిందని ఫిర్యాదు చేయలేదన్నారు. ‘వైసీపీ హయాంలో 12 లక్షల మంది ప్రభుత్వ బడులకు రావడం మానేశారు. అందుకే తల్లికి వందనం పేరుతో పిల్లలందరికీ ఆర్థిక సాయం చేస్తున్నాం. దీంతో లక్ష మంది ప్రైవేటు నుంచి ప్రభుత్వ పాఠశాలలకు వచ్చారు’ అని తెలిపారు.
ఇలాంటి స్కాం చూడలేదు: చంద్రబాబు
వైసీపీ హయాంలో జరిగిన గ్రూప్-1 నియామక పరీక్షలో చోటుచేసుకున్న తరహా అక్రమాలను తన 50ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ చూడలేదని సీఎం వ్యాఖ్యానించారు. అసెంబ్లీ లాబీల్లో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. వైసీపీ నిర్వాకం వల్ల ఎంతో మంది ప్రతిభ కలిగిన విద్యార్థులు నష్టపోయారని.. దీనిపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తామని అన్నారు. మెగా డీఎస్సీలో మహిళలు ఎక్కువ మంది ఎంపికయ్యారని, విజయవాడలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో వారి మాటలు విన్నాక వారి నిజాయితీ, కష్టం కళ్లకు కట్టినట్లయిందని తెలిపారు. తమ ఆత్మగౌరవాన్ని కించపరిచేలా వైసీపీ నాయకులు విమర్శలు చేయడంపై వారంతా బాగా మాట్లాడారని సీఎం చెప్పారు.
వార్తలు కూడా చదవండి...
నా రాజకీయ జీవితంలో గ్రూప్ -1 లాంటి స్కాం చూడలేదు: సీఎం
అసెంబ్లీలో మంత్రుల సరదా సంభాషణ.. సత్యకుమార్‌పై లోకేశ్ చమత్కారం
ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్‌పర్సన్‌గా నాగబాబు.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
Read Latest AP News And Telangana News And National News
And Telugu News