హోంగార్డుల సమస్యలు పరిష్కరించండి: సీఎం చంద్రబాబుకు ఏపీ బీజేపీ చీఫ్ లేఖ
ABN , Publish Date - Apr 08 , 2026 | 05:51 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి రాష్ట్ర బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ లేఖ రాశారు. అందులో హోం గార్డులు పడుతున్న ఇబ్బందులతోపాటు నెల్లూరు, బాపట్లలోని తీర ప్రాంతాల్లోకి తమిళనాడుకు చెందిన జాలర్లు స్పీడ్ బోట్లతో తరలి వచ్చి.. స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వివరించారు.
అమరావతి, ఏప్రిల్ 08: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం హోం గార్డులు.. విధి నిర్వహాణలో భాగంగా పోస్టింగ్ కారణంగా తమ సొంత ఊళ్లకు దూరంగా ఉంటూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ ఆవేదన వ్యక్తం చేశారు. వారిలో చాలా మంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో సేవలందిస్తుండగా.. వారి కుటుంబాలు తెలంగాణలో నివసిస్తున్నాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన సుమారు 200 మంది హోం గార్డులు ప్రస్తుతం ఏపీలో పని చేస్తున్నారని వివరించారు. అందువల్ల వారు తీవ్ర వ్యక్తిగత, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. దీనితోపాటు నైతిక స్థైర్యాన్ని సైతం వారు కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ సముద్ర తీర ప్రాంతంలోకి తమిళనాడుకు చెందిన జాలర్లు బోట్లు ద్వారా చొచ్చుకొచ్చి స్థానికులను తీవ్ర భయబ్రాంతులకు గురి చేస్తున్నారని పీవీఎన్ మాధవ్ తెలిపారు. ఈ రెండు సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ లేఖ ద్వారా తీసుకెళ్లారు. ఈ లేఖను ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ బుధవారం అమరావతిలో విడుదల చేశారు. పరస్పర ప్రాతిపదికన రాష్ట్రాల మధ్య బదిలీకి వీలు కల్పించడం ద్వారా దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న హోం గార్డుల సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
అదే విధంగా పొరుగున ఉన్న తమిళనాడులోని కడలూరు, కారేకల్‌కు చెందిన జాలర్లు ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, ఒంగోలు, బాపట్ల ప్రాంతాలకు వచ్చి స్థానిక మత్స్యకారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఈ లేఖలో సీఎం చంద్రబాబుకు మాధవ్ వివరించారు. శాంతిభద్రతలకు భంగం కలిగించేలా ఇప్పటికే పలు సంఘటనలు అక్కడ జరిగాయని తెలిపారు. తమిళనాడుకు చెందిన మత్స్యకారులు స్పీడు బోట్లతో ఆంధ్ర తీర ప్రాంతంలో మత్స్య సంపదను దోచుకుంటున్నారని విమర్శించారు.
ఈ ఏడాది మార్చిలో నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ప్రాంతంలో అక్రమంగా సంచరిస్తూ దౌర్జన్యానికి పాల్పడుతున్న తమిళనాడు జాలర్ల బోట్లను అక్కడ స్ధానికులు నిర్భందించారని పీవీఎన్ మాధవ్ గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతోపాటు స్థానిక అధికారుల తోడ్పాడుతో ఆ బోట్లను రాత్రికి రాత్రే విడుదల చేశారని చెప్పారు. తమిళనాడుకు చెందిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోక పోవడం అనేక అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు. అక్రమంగా ఆంధ్ర తీర ప్రాంతంలో సంచరిస్తూ స్థానికులను భయ భ్రాంతులకు గురి చేస్తున్న తమిళనాడు జాలర్లలపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు పీవీఎన్ మాధవ్ లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కృష్ణపట్నం పోర్టులోకి తమిళనాడు బోటు అక్రమ చొరబాటు.. పట్టుకున్న టాస్క్‌ఫోర్స్
రూ.185 కోట్లతో విజయవాడ స్టేడియం అభివృద్ధి: మంత్రి మండిపల్లి..
For More AP News And Telugu News