Share News

నాలెడ్జ్ ఎకానమీ దేశ ఆర్థిక వ్యవస్థనే మారుస్తోంది: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Jan 20 , 2026 | 03:46 PM

నాలెడ్జ్ ఎకానమీ మన దేశ ఆర్థిక వ్యవస్థనే మారుస్తోందని.. దీని ద్వారా సంపద సృష్టి జరుగుతుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. భారతీయులు, అందులోనూ తెలుగువారు టెక్నాలజీని అందిపుచ్చుకోవటంలో ముందుంటారని పేర్కొన్నారు.

నాలెడ్జ్ ఎకానమీ దేశ ఆర్థిక వ్యవస్థనే మారుస్తోంది: సీఎం చంద్రబాబు
CM Nara Chandrababu Naidu

ఇంటర్నెట్‌డెస్క్, జనవరి20(ఆంధ్రజ్యోతి): నాలెడ్జ్ ఎకానమీ మన దేశ ఆర్థిక వ్యవస్థనే మారుస్తోందని.. దీని ద్వారా సంపద సృష్టి జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. భారతీయులు, అందులోనూ తెలుగు ప్రజలు టెక్నాలజీని అందిపుచ్చుకోవటంలో ముందుంటారని పేర్కొన్నారు. టెక్నాలజీని సమర్థంగా వినియోగించుకుంటేనే అద్భుత ఫలితాలు సాధించేందుకు అవకాశముంటుందని ఆయన వెల్లడించారు. మంగళవారం.. దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పారిశ్రామిక వేత్తలతో ఏపీకి కావాల్సిన పెట్టుబడులపై చర్చించారు. భారత్ కేంద్రంగా అభివృద్ధి, ఏపీ సానుకూలతలపై మాట్లాడారు.


కొత్త విషయాలు తెలుసుకుంటా..

దశాబ్దాలుగా దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరవుతున్నానని సీఎం చంద్రబాబు తెలిపారు. దావోస్‌కు వచ్చిన ప్రతిసారీ పారిశ్రామికవేత్తలు, నిపుణుల నుంచి కొత్త విషయాలు తెలుసుకుంటానని.. కొత్త ఆలోచనలు పంచుకుంటానని వెల్లడించారు. టెక్నాలజీ సహా వివిధ రంగాల్లో వస్తున్న మార్పులను తెలుసుకుని పాలసీలు రూపొందిస్తానని వివరించారు. దావోస్‌లో ప్రపంచ పారిశ్రామికవేత్తల ఆలోచనలు అర్థం చేసుకుని ఏపీని బిజినెస్ ఫ్రెండ్లీ స్టేట్‌గా మారుస్తున్నామని చెప్పుకొచ్చారు. మరే దేశంలో లేని యువశక్తి భారత్‌లో ఉందని, దీంతో తిరుగులేని సమర్థ నాయకత్వం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఏ రంగంలో అయినా పెట్టుబడులకు భారతదేశం, ఆంధ్రప్రదేశ్‌లు అత్యుత్తమ గమ్య స్థానాలని చెప్పుకొచ్చారు. 2047కు భారత్ ప్రపంచ శక్తిగా మారుతుందని వివరించారు. ప్రతి ఒక్కరూ ఈ గ్రోత్ స్టోరీని చూస్తారని తెలిపారు సీఎం.


నిర్దిష్ట లక్ష్యాలతో పనిచేస్తున్నాం..

గతంలో పారిశ్రామిక వేత్తలను ఏపీకి తేవాలంటే చాలా కష్టపడాల్సి వచ్చేదని చంద్రబాబు అన్నారు. ప్రస్తుతం తెలుగు ప్రజల విజయాలు, ఏపీ బ్రాండ్ సానుకూలాంశంగా మారాయని వెల్లడించారు. ప్రతీ రంగంలో నిర్దిష్టమైన లక్ష్యాలతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పుకొచ్చారు. తమకు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కావాలని.. అందుకు ఏపీకి రావాలని పిలుపునిచ్చారు. దీనికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని స్పష్టం చేశారు. గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తితో కొత్త చరిత్రకు నాంది పలికామని.. ఇక ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తామని వ్యాఖ్యానించారు. వ్యవసాయం రంగంతో పాటు వైద్య రంగంలోనూ డ్రోన్లను ఉపయోగించబోతున్నామన్నారు.


డ్రోన్ అంబులెన్స్‌పై ఆలోచన..

2026లో డ్రోన్ అంబులెన్స్‌ను ఏపీలో ప్రారంభించే ఆలోచన చేస్తున్నామని తెలిపారు. దేశంలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే వచ్చాయని వివరించారు. 1000 కిలోమీటర్లకు పైగా సముద్ర తీరం, పోర్టులు, ఎయిర్‌పోర్టులు రాష్ట్రానికి ఉన్న బలమని పేర్కొన్నారు. వచ్చే నాలుగేళ్లలో 50 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం లక్ష్యంగా ప్రభుత్వ పనిచేస్తోందని తెలిపారు. అక్కడ అమలు చేస్తున్న పాలసీలు, పెట్టుబడులకు ఉన్న సానుకూల పరిస్థితులను స్వయంగా చూడాలని పారిశ్రామిక వేత్తలను కోరారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లాంటి విధానాలను పరీక్షించాకే పెట్టుబడులపై నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏపీకి మించిన అత్యుత్తమ పెట్టుబడుల గమ్యస్థానం మరోకటి లేదని.. పారిశ్రామికవేత్తలకు ఏపీ అతిపెద్ద మార్కెట్ అవుతుందని చంద్రబాబు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

యూఏఈ మంత్రితో సీఎం చంద్రబాబు భేటీ

గొడ్డలితో కేక్ కటింగ్.. వీడియో వైరల్.. రంగంలోకి దిగిన పోలీసులు

For More AP News And Telugu News

Updated Date - Jan 20 , 2026 | 09:16 PM