Pedapatnam: గొడ్డలితో కేక్ కటింగ్.. వీడియో వైరల్.. రంగంలోకి దిగిన పోలీసులు
ABN , Publish Date - Jan 20 , 2026 | 09:53 AM
గొడ్డలితో కేక్ కట్ చేయడమే కాకుండా.. గ్రామంలోని ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నారు కొందరు యువకులు. గ్రామస్థుల ఫిర్యాదు మేరకు సదరు యువకులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి విచారిస్తున్నారు పోలీసులు.
మచిలీపట్నం, జనవరి 20: కృష్ణా జిల్లాలోని బందరు మండల పరిధిలో పలువురు యువకులు రెచ్చిపోయారు. పెదపట్నం గ్రామంలో రప్పా.. రప్పా తరహాలో యువకులు హల్‌చల్ చేశారు. జన్మదిన వేడుకల్లో గొడ్డలితో కేక్ కట్ చేశారు. అనంతరం.. సంబంధిత వీడియోను వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది వైరల్‌గా మారింది. దీనిపై పోలీసులు దృష్టి సారించారు. ఆ గ్రామానికి చెందిన రాంకీ, సంతోశ్, రాజేశ్‌గా పోలీసులు గుర్తించారు. ఈ ఆగడాలపై స్థానికులను పోలీసులు ఆరా తీయగా.. వారి ఆకతాయి పనులను వివరించారు.
న్యూ ఇయర్ వేళ.. డిసెంబర్ 31న పూటుగా మద్యం సేవించి పెదపట్నంలో ఈ యువకులు భయాందోళనలు సృష్టించారని పోలీసులకు వివరించారు గ్రామస్థులు. అలాగే జనవరి 14న కనుమ రోజు కూడా వారు మద్యం సేవించి గ్రామంలో హల్‌చల్ చేశారని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రశాంతంగా ఉండే గ్రామంలో.. అరాచకం సృష్టిస్తున్న ఆ యువకులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో ముగ్గురూ యువకులను పోలీసులు స్టేషన్‌కు పిలిపించారు. ఈ సందర్భంగా వారిని తమదైన శైలిలో పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత యువత చెడు మార్గం పట్టకుండా ఉండేందుకు పటిష్ఠ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా సోషల్ మీడియాలో వారు చేస్తున్న పోస్ట్‌లపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. యువతకు నైతిక విలువలు నేర్పేదిశగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది.
ఇవీ చదవండి:
భారీ పెట్టుబడుల సమీకరణే లక్ష్యంగా..
ఏపీలో స్విస్ పెట్టుబడులకు సహకరించండి
For More AP News And Telugu News