Telangana Investments: భారీ పెట్టుబడుల సమీకరణేలక్ష్యంగా..
ABN , Publish Date - Jan 20 , 2026 | 02:55 AM
ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో పాల్గొనేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం దావోస్ బయల్దేరి వెళ్లారు.
వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు దావోస్‌కు వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి
దిగ్గజ కార్పొరేట్ సంస్థల అధినేతలతో భేటీ కానున్న ముఖ్యమంత్రి
ఐటీ, ఏఐ, లైఫ్ సైన్సెస్‌లపై దృష్టి.. తెలంగాణ సత్తా చాటేలా విజన్ డాక్యుమెంట్ ప్రదర్శన
హైదరాబాద్, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో పాల్గొనేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం దావోస్ బయల్దేరి వెళ్లారు. అంతకుముందు ఉదయం మేడారంలో గిరిజన దేవతలు సమ్మక్క-సారలమ్మ ఆలయాల పునర్నిర్మాణాన్ని ప్రారంభించారు. మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకొని స్విట్జర్లాండ్‌లోని దావో్‌సకు ప్రయాణమయ్యారు. అక్కడ తెలంగాణ పెవిలియన్‌లో ప్రపంచ ప్రఖ్యాత సంస్థల అధినేతలతో వేర్వేరుగా భేటీ అవుతారని అధికార వర్గాలు తెలిపాయి. ఇందులో గూగుల్, యూనిలీవర్, హనీవెల్, సేల్స్‌ఫోర్స్, లోరేల్, నోవార్టిస్, టాటా గ్రూప్స్, డీపీ వరల్డ్, ఇన్ఫోసిస్, సిస్కో వంటి ప్రముఖ సంస్థలు ఉన్నాయి. అలాగే అంతర్జాతీయ ప్రతినిధులతో నిర్వహించే రౌండ్‌టేబుల్ సమావేశాల్లో సీఎం పాల్గొంటారు. ఈ చర్చల సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణ, ఇప్పటికే స్థాపించిన పరిశ్రమల విస్తరణపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. ఐటీ, ఏఐ, లైఫ్ సైన్సెస్, తయారీ రంగాల్లో పెద్దఎత్తున పెట్టుబడులను ఆహ్వానించడమే లక్ష్యంగా చర్చలు జరుగుతాయని తెలుస్తోంది. ఆ దిశగా గత డిసెంబరులో హైదరాబాద్‌లో నిర్వహించిన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’లో విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. 2047 నాటికి తెలంగాణ మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలనే లక్ష్యంతో ఈ డాక్యుమెంట్‌ను రూపొందించారు. అందుకే వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా తెలంగాణ అభివృద్ధి సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా ‘తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్’ను ప్రదర్శించాలని సంబంధిత అధికారులు, మంత్రులకు సీఎం ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. కాగా, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఇప్పటికే దావోస్ చేరుకున్నారు. సీఎం రేవంత్‌తో పాటు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు బయల్దేరి వెళ్లారు.